గాయం రక్తాశ్రువులై స్పర్శించినపుడు
చెమ్మగానైనా తడిమిన చెలిమి
కర్తవ్యనిర్వహణలో
కఠినశిల అయినప్పుడు
వధ్య శిలలా జీవితం
విషపుకోరలకు బలైనప్పుడు
కాలయవనికపై బ్రతుకుచిత్రం
కాలిబూడిదయినప్పుడు
అనంతంగా సాగే అపరిష్కృత
సమస్యలకి అలంబనేదీ కానరానపుడు
చేతనత్వాల వేదికేదీ చేతికందనపుడు
ఆత్మబలిదానంలో కూడా
అట్టడుగు స్వరం
ఆణువంతైనా జాలిచూపనపుడు
ఆలిగా, అమ్మగా, అత్తగా,
అడుగడుగునా
అణచివేతకు గురవుతున్నపుడు
ఆడపిల్లను ఆ.. డ..పిల్లగా
సమాజం ఛీత్కరించినపుడు
బలిదానానికి సిద్ధమవక
బ్రతుకు పోరును
బాసటగా తీసుకొని
గొంతెత్తి అడిగే స్వరం
ఆమెదే కావాలి
రంగురంగుల ఆకాశపునేత్రాలతో
రాగబంధాల రక్తిమపులుముకొని
ఆర్ద్ర సంగీత ఝరిలా
ఆమె స్వరం
రేపటి తరానికి
నాందీగీతం అవాలి..
- రెడ్డి పద్మావతి.
(పార్వతీపురం. విజయనగరం జిల్లా)
Advertisement