రావిశాస్త్రి పొట్టి కథల్లో వాస్తవికత

Advertisement
Update:2023-07-30 15:23 IST

వైవిధ్యమైన కథా సాహిత్యానికి వెలిగే సూర్యుడు రాచకొండ విశ్వనాథశాస్త్రి. ఆయన కథల్లో అక్షరాలకు గొంతులుంటాయి. దృశ్యాలన్నీ వాస్తవికత స్వరాలతో గాయాలతో వున్న బాధల్ని గానం చేస్తాయి. పేదరికం కార్చిన కన్నీరు పాఠకుల చేతుల్లో పాఠమై మిగులుతుంది. నిత్యం నిద్రలోకి జారుకొనే మనిషి ఆలోచనలు, ఆయన కథల కేకలతో సరిహద్దు సైనికుల్లా తయారవుతాయి. అసంఖ్యాకమైన కథా సంపదకు దాతగా మిగిలిన రావిశాస్త్రి కలం ప్రసాదించిన ఈ పొట్టి కథలు 1979 - 1980 ప్రాంతంలో స్వాతి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి. కథలకు శీర్షికలు ఉండవు. కానీ శిరస్సుల నిండా దట్టించిన సామాజిక ఆలోచన, తన చూపులతో మనం మరచిపోయిన మార్గాల వైపు నడిపిస్తుంది.

పేదరికంతో పస్తులున్న పాక అది. ఆకలితో ఒక పసికూన అలమటిస్తోంది. బువ్వకోసం అమ్మను, నాన్నను అడిగింది. కన్నీళ్ళతో ఖాళీ గిన్నెలు చూపించారు. ఆకలేస్తుందని ఎండిన డొక్కతో ప్రభుత్వాన్ని అడిగింది. మట్టిని మోస్తున్న ఆమె మొహాన్ని చూసి చీదరించుకున్నారు. చంపమని బ్రతిమాలింది పాప. 'మేము అహింసావాదులం, చంపం, వదిలేస్తే నువ్వే చచ్చిపోతావు' అంది ప్రభుత్వం. అన్నట్టుగానే పసికూన చచ్చిపోయింది. ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం పాప శవంచుట్టూ పేలాల్లా కనిపించాయి. ఈ స్థితి ఇప్పటికీ తన తివాచీల మీద ఆసనాలు వేయటం, చప్పట్లు కొట్టే అసెంబ్లీలు ఆలోచించవలసిన విషయం. ఈ పొట్టికథ మనల్ని కదిలిస్తుంది, కదిలించి ఆలోచన పడవల మీద కూర్చో పెడుతుంది, కర్తవ్యం తెడ్డు మన చేతుల్లోకి వచ్చి చేరుతుంది.

ఒక కుర్రాడు కష్టపడి చదివి పరీక్షలు రాశాడు. మరొకడు అదే పరీక్షల్ని కాపీకొట్టిరాశాడు. మరోఘనుడు ఏకంగా పరీక్షాపత్రాలుముందుగానే సంపాదించి ఈ పరీక్షలు రాశాడు. ఇది పిల్లల మధ్య అతి సాధారణంగా జరిగే విషయమైనా, నైతికంగా దిగజారిపోయినసమాజ వ్యవస్థను దగ్గరుండి దర్పణంలో

చూపిస్తుంది ఈ కథ. కాపీ కొట్టిన వాడు దొంగయితే, ఇక మూడవవాడు ఏకంగా గజదొంగ. మరి మిగిలిన మొదటివాడు ఏమవుతాడు. తర, తరాలుగా సమాధానం కూలోడు ముద్ర తలపాగతో సిద్ధంగా వుంటోంది. ఖచ్ఛితంగా ఈ మూడు పాయలుగానే దేశం విడిపోయి వుంది. కూలోడి పాయమాత్రం ఇప్పటికీ ఎముకల గట్ల మీద ఆకలి నీళ్లను మోసుకుంటూ వెళ్తోంది. కథ చదవగానే నిప్పు లేకుండానే మెదళ్ళు చైతన్యమవుతున్నాయి. రావిశాస్త్రి కథల్లో వేడి అంతే మరి.

వస్తువుల కరువును సృష్టించడం ఈ దేశ ముఖచిత్రంగా కొనసాగుతూనే ఉంది. ఈ దోపిడీ రవాణా జోరుగా జరగడం దేశ అభివృద్ధి అంశాలలో ఒకటిగా ప్రకటిస్తూనే వున్నారు. ఇదే అంశాన్ని రావిశాస్త్రిగారు ఒక కథలో ప్రస్తావిస్తారు. కరువొచ్చింది, దాచి ఉంచిన ధాన్యం కోసం ఆకలితో వున్న ప్రజలు ఎగబడ్డారు. ధాన్యం పంపకం జరగలేదు. ప్రజల ఆకలి మంటలు తీరలేదు. పైగా పోలీసులు వచ్చారు. చాలక సైన్యం దిగింది. చాలా మంది చనిపోయారు. శాంతి భద్రతలు కాపాడబడ్డాయని ప్రశంసలతో ప్రభుత్వం పందిళ్ళు వేసుకుంది. పేదరికాన్ని మోస్తున్న భుజాలమీద ఒకటే ప్రశ్న... ధాన్యం తనంతట తానే ఎక్కడో దాగోదు, దాచిన దానికి బాధ్యులెవరు? ఆ నేరానికి శిక్షలు ఉండవా? జవాబుల్లేని ప్రశ్నల సంఖ్య పెరుగుతూనే ఉంది, సరైన సమాధానాలు మాత్రం ఇప్పటికీ ఈ దేశంలో లభించడం లేదు.

దిక్కుమాలిన నైజాలతో, సమాజానికి అవసరం లేని రూపాలలో చాలామంది రచయితలు తమ కలాలను ఖడ్గాలుగా ఝలిపిస్తూ ఉత్తరకుమార ప్రగల్భాలకు వారసులుగా ప్రకటించుకుంటూ వుంటారు. ఇదే విషయాన్ని బ్లాక్ బోర్డు మీద తెల్లటి అక్షరాలుగా రావిశాస్త్రి గారు కథల్లో అందించిన విధానం ఒక గొప్ప పాఠశాలగా నిలుస్తోంది. ఒకడు తనకు తాను ప్రకటించుకున్న గొప్ప రచయిత. కథలు కవితలు, నవలలు, నాటకాలు సవాలక్ష ప్రక్రియలన్నీ అతని ఇంటి వాసాలే. తన ప్రతిభ పెచ్చులు, పెచ్చులుగా రాలిపోతున్నా, తనకు తానే ఘనాపాటి అనుకుంటాడు. ఇన్ని రచనలు ఎందుకు చేస్తున్నావని ఎవరైనా అడిగితే సమాధానంగా "రాస్తున్నప్పుడు విస్కీ త్రాగుతునట్లు వుంటుంది" అంటాడు. ఉన్నట్లుండి రచనలు చేయడం ఆపేసాడు. కారణం ఏమిటని అడిగిన ప్రశ్నకు సమాధానంగా "నేను నేరుగా విస్కీ తాగుతున్నాను" అంటాడు, కథ ముగుస్తుంది. వర్తమానంలో కూడా ఎంతోమంది రచయితల ముఖాలు ఈ చట్టంలో పోటీపడుతూ కనపడుతున్నాయి.

ఈ దేశంలో పేదలు పేదలుగానే చరిత్రలో ఎందుకు మిగిలిపోతున్నారో తెలిపే మర్మాన్ని ఒక పొట్టికథలో మనం చూడవచ్చు. ఊరి సెంటర్లో అదొక పెద్ద హోటల్. రోజూ భారీగా జనం. మోసినంత ఆదాయం. ఎంగిలి అరిటాకులు హోటల్ వెనక కుప్పలుగా పడుతున్నాయి. వాటికోసం దారినపోయే ఆవులు హాజరవుతూ ఆకలి తీర్చుకుంటున్నాయి. ఉచితంగా ఆ ఎంగిలి ఆకుల్ని వీధిలో ఆవులు తినటం సహించలేక పోయాడు హోటల్ యజమాని. ఆ ఎంగిలి కుప్పలకు ధరకట్టి పాలకాంట్రాక్టరుకు సరఫరా చేస్తున్నాడు. ఉసూరుమన్న వీధి ఆవులు, డొక్కల్ని చల్లార్చుకునేందుకు గోడమీద వాల్ పోస్టర్లను తినడం మొదలుపెట్టాయి. దీనిని నివారించటానికి సినిమా అభిమాన సంఘాలు కర్రలు పట్టుకుని కాపలా డ్యూటీకి వచ్చారు. తిండిలేక ఆవులు తలలను పైకెత్తి దేశాన్ని ప్రశ్నిస్తున్నాయి. సరిగ్గా అదే జరుగుతోంది ఇప్పుడు కూడా. కార్పొరేట్ వ్యవస్థలో సామాన్యుడి బ్రతుకు మీద వ్యాపార వర్గాల దోపిడి బాంబులు పడుతూనే ఉన్నాయి. దేశంలో ఆ బాంబుల తయారీకి అనుమతులు నిత్యం మంజూరవుతూనే వున్నాయి. వాళ్ళ లక్ష్యం అప్పటికీ, ఇప్పటికీ ఒక్కటే, పేదోడు ఎవడూ ఎప్పటికీ అభివృద్ధి చెందకూడదు. అంతర్లీనమైనఈ సత్యానికి హామీపత్రంగా నిలుస్తోంది ఈ కథ.

సాహిత్యకారులు సృజనకారులు మాత్రమే కాదు, భవిష్యత్ దృశ్యాల చిత్రకారులు కూడా. శాస్త్రిగారు ఆ కోవకి చెందుతారు. సారా సంపాదనలో ప్రభుత్వాల వైఖరి మీద నలభై సంవత్సరాల క్రితమే అద్భుతంగా తన కలం ద్వారా ఒక పెద్ద నల్లగీతను గీస్తాడు. ఈ కథలో విస్కీబాటిల్ పట్టుకొని వస్తూ మెట్లుజారి క్రిందపడి చచ్చిపోతాడు. భార్యాబిడ్డల విచారం గుమ్మనికి వ్రేలాడుతూ వుంటే, స్నేహితులు మాత్రం విస్కీ నేలపాలు అయినందుకు దిగులుపడి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వర్తమానంలో తాగుబోతు చావుతో ఒక ఓటు జారిపోయిందన్న దిగులుతో మద్యం షాపుల ముందు సంతాపం పేరుతో దొంగకన్నీళ్లు కారుస్తున్న ప్రభుత్వాల వైఖరికి అద్దం పడుతోంది

ఈ కథ.

కొన్ని సత్యాలు మానవ జీవితాలకు కంటికి రెప్పలాంటివి. కళ్ళుచాలు, రెప్పలు అవసరం లేదనుకుంటే మొత్తం చూపు పోయే ప్రమాదం ఉంది. ఈ వాస్తవాన్ని మోసుకొచ్చిన కథ ఇప్పుడు మన పక్కనే ఉంది. ఒక్కసారి ఆ కథను పలకరిద్దాం. ఆ కథలో జబ్బులన్నీ పేదోళ్ళ వల్లనే వస్తున్నాయని ఒక రాజు తన ఏకైక కుమారుడ్ని అందరికీ దూరంగా ఒంటిస్తంభం మేడలో వుంచి పెంచాడు. కానీ కొడుక్కి పెద్దరోగం తగులుకుంది. కారణాలు వెతికితే కొడుకు ఒంటిస్తంభం మేడలో ఉన్నాడు కానీ, సేవకుడు మాత్రం పూరి గుడిసెలో తన పెద్దతల్లి దగ్గర ఉంటున్నాడు. ఆ తల్లికి ఆ రోగం ఉంది. ఇది కథ. ఇప్పటికైనా మనిషిగా పుట్టిన ప్రతివాడు శ్వాస పీల్చుకోవలసిన ప్రాణవాయువు మరొకటి ఉందని గమనించాలి. మనం బ్రతికితే చాలదు, మన బ్రతుకు పక్క వాడు కూడా బ్రతికితే అదే మనకు రక్షణ అవుతుంది. ఈ నిజాన్ని గమనించి, పాటించాలని ఈ కథ సారాంశం.

కొన్ని వాస్తవాలు ఎదుట పడ్డప్పుడు వినోదంగా ఉంటాయి కాని, లోపలి పొరలు పైకిలాగితే డొల్లతనం అస్తిపంజరంలా బయట పడుతుంది. ఎంతో అందంగా ఉందని ఎన్నాళ్ళుగానో ధ్యానించిన రూపం, వట్టి బొమ్మని తెలిశాక, గొప్పగా అనుకున్న తెలివితేటలన్నీ అమాంతం ఒకప్రక్కకు వాలిపోతూ కనబడతాయి. ఆ దృశ్యాలను మన కళ్ళ ముందుకు తెచ్చిన కథలో అతడు ప్రభుత్వ ఉద్యోగం చేశాడు. సంపాదనలో అవకాశాలను తాళంచెవిలా వాడుకున్నాడు. ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. అదృష్టం కలిసిరాలేదు. ఒక కూతురు చనిపోయింది. ఒక కూతురు భర్త చనిపోయి కేసు కోర్టులో నడుస్తోంది. మూడవ కూతురు మొగుడితో తగాదాలు పడి విడాకులు తీసుకుంది. నాలుగవ పిల్లకు పెళ్లి చేయాలి. మెల్లకన్ను, నత్తి, భారీగా కట్నం ఇవ్వడానికి పాతిక తులాల బంగారం కూడబెట్టాడు. దురదృష్టం ఖాతా పెరిగి, ఆ రాత్రి దొంగలు పడి మొత్తం బంగారం దోచుకుపోయారు. పోలీసులకు రిపోర్టు ఇచ్చాడు. అయినా దేవుడి మీద నమ్మకంతో ఆయనే కాపాడుతాడని ఎంతో ఆయాసంగా ఉన్నా, భరించి వంద మెట్లు ఎక్కి కొండమీద దేవుడ్ని దర్శించుకోవడానికి వెళ్ళాడు. గుడి తలుపులు మూసి ఉన్నాయి. పూజవేళ ఎందుకు మూసేశారో తెలియలేదు. అడిగితే తెలిసింది. గతరాత్రి గుడిలో దొంగలుపడి కోటి రూపాయల దేవుడి నగలు దోచుకుని పారిపోయారని. ఈ కథ ద్వారా రచయిత మూఢనమ్మకాల నడ్డి విరిగేలా దృశ్య కల్పన చేశారు. భక్తి రూపంలో మనిషి ఆలోచనలకు గ్రుడ్డితనాన్ని ఆహ్వానించడం అవివేకమే కాదు, మూర్ఖత్వం కూడా అని నిరూపించిన కథ ఇది.

తెలుగు సాహిత్య అభిమానులకు రాచకొండ విశ్వనాథశాస్త్రి ఒక పండగలాంటివాడు. అతి చిన్న పొట్టికథల్లో దట్టమైన విషయాన్ని దట్టించటం వీరికే సాధ్యమైంది. మనిషి మానసిక కల్లోల స్థితినుంచి వెలికితీసిన సత్యాలు సముద్రపు అలల్లా ఎగిసిపడుతూనే ఉంటాయి. ప్రభుత్వ వైఖరి, వైఫల్యాల చిట్టాలను ఈ పొట్టికథలు కాగడాల్లా వెలిగించాయి. జవాబులు దొరకని ఎన్నో ప్రశ్నలను ఈ కథలు మోసుకొస్తాయి. పేదల వ్యధలు, కన్నీళ్ళు, కలతలు, దోపిడీ, దౌర్జన్యం, మోసం ఏ ఏ రూపాల్లో మన చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయో ఈ కథల్లో మనం చూడవచ్చు. మానవ తప్పిదాలకు, బలహీనతలకు చక్కటి పాఠాలు కూడా ఈ కథల్లో ఉన్నాయి. ఈ కథల నిండా వాస్తవికత, సజీవకత ఆరోగ్యకరమైన ఆలోచనా ఔషధాలను అందిస్తున్నాయి. ఈ కథలలోని పాత్రలు, బుద్ధులు అన్నీ మన రూపాలే. కాలం కొలిమిలో ఆ బుద్ధుల మలినాలను వదిలించుకొనే బాధ్యత మాత్రం ఇంకా ప్రపంచానికి మిగిలే ఉంది.

- డాక్టర్ .కె.జి.వేణు

Tags:    
Advertisement

Similar News