ఉత్తములు మధ్యములు
అధములుగా
చిత్రించబడ్డ ప్రజావళితో పాటు
రాళ్ళూ వివిధాలై వర్ణించబడ్డాయి
రాళ్ళకు కాళ్లున్నాయి కళ్ళున్నాయి
హృదయముంది గానముంది
కరుణావుంది!
పట్టుతప్పి కొండరాయిని పట్టి
లోయలో వూగులాడుతూ
ప్రాణం గాలిపటమైతే
పడకుండా పట్టు యిచ్చి
పైకి చేర్చిన రాయి
గుండెంత విశాలం
వీరత్వమెంత వందనం!
శిల్పించిన రాయి
ఆరాధ్య దైవం విష్ణుమూర్తయి
నడచివచ్చి గర్భగుడిలో
మూలమూరైతే
పూజలు కైంకర్యాలు!
రాయి దేవేరై
ఆలయాన అధిష్టిస్తే
విశాలనయన కటాక్షంతో
సౌభాగ్య దీవెనలు
పసుపు కుంకుమల అర్చనలు!
రాతిస్తంభాలు జీవమై
విరామ మెరుగక
సరిగమలు పాడుతూ
సంగీత కచేరీలు!
కడుపు ఎండిన సుత్తి
లేవలేక లేచి రాయిని మోదితే
కరుణించిన రాయి
మునీశ్వరుడు మంత్రించినట్లు
ముక్కల ముక్కల కంకరై
ఎత్తిన చేతికి స్వాగతమంది!
కసాయిని వర్ణిస్తూ
కఠినశిల అన్నందుకు
కన్నీరొలుకుతూ శిలలు
లోహాన్ని మించిన లోహమంటూ
మనిషిని ఉపమానిస్తున్నాయి!
-అడిగోపులవెంకటరత్నం