అబ్బే లేదండీ
నాన్నంత గొప్పోడేంగాదు
సరిగ్గా లెక్కలే రావు
అప్పులెప్పుడూ తక్కువజేసి చెప్పేది!
బడిదారిలో ఎందరో
నాన్న గురించి అడుగుతుంటే
అబ్బ ఊరంతా స్నేహితులే అనిపించేది
అబ్బే లేదండీ..ఇంటికొచ్చి
లెక్కలేవో నేర్పించి వెళ్ళేవాళ్ళు!
చీకట్లో చుక్కలు లెక్కబెడుతుంటే
అక్కున జేర్చుకొని జోకొడుతూ
ఎక్కాలు పద్యాలడిగేది నేర్చుకొందామనో
మనస్సుకేం కూడికలు జరిగేవో!
పీడకల్లొచ్చి అర్దరాత్రుల్లు
ఎప్పుడు మేల్కొన్నా
అప్పుడూ అప్పులు ఆస్తులు లెక్కలే
అమ్మ రెండూ సరితూగాయని
నాన్నకి తీవ్రంగా లెక్కలు నేర్పుతుండేది!
కన్నవారిని కనిపెట్టుకొనుంటూ
కలల మూటలెన్ని అటకమీదెట్టాడో
కోర్కెల మొగ్గలెన్ని తుంచేసుకున్నాడో
ఆ లెక్కలేవీ సరిగ్గా తెలీవు నాన్నకి!
అత్యవసరాలెన్ని నెత్తినబడ్డా
తాతలనాటి ఆస్తులమ్మేదిగాదు
కన్నపిల్లల చదువో పెళ్ళయితే
లెక్కబెట్టకుండా తెగనమ్ముతుండేవాడు!
తలరాతల లెక్కలు తప్పినా
గుండె సడుల లెక్కలు తప్పకుండా
అధిక రక్తపోటు చలానా బారినపడకుండా
యోగా అకౌంటెంటునుబట్టి తప్పించుకుంటుండేది!
లెక్కలు నేర్పించేవారి లిస్ట్ చాంతాడంత
ఏడాదికోసారి తిరిగి అప్పజెప్పేవాడు
నాన్న తప్పులు చెప్పేవాడేమో
నెలల్లోనే అంతా మళ్ళీ నేర్పిస్తుండేవారు!
-రవి కిషొర్ పెంట్రాల,
(లాంగ్లీ, లండన్)