అప్పుడప్పుడు

Advertisement
Update:2023-08-07 13:12 IST

క్షణాల సమూహపు ప్రవాహాన్ని ఎదురీది

కొన్ని కొన్ని మజిలీల దగ్గరకు

మళ్ళీ చేరాలని

మార్పుచేర్పులేవో చెయ్యాలనిగాదుగానీ

ఇంకొన్నిసార్లా మధురిమల్ని..

తనివితీరా ఆస్వాదించాలని!

మళ్ళీ చిన్న పాపాయినయిపోతే బాగుండని

ఉయ్యలతొట్లో ఊగాలనో

గుర్రుబెట్టి బజ్జోవాలనోకాదుగానీ

కేరింతలకు అమ్మనవ్వేనవ్వులు

ఇంకోసారి చూడాలని

తప్పటడుగులేస్తూ నాన్నవ్రేలుబట్టి

మరొక్కసారి నడవాలని!

ఇంకోసారి పిల్లాడై బడికెళ్ళగలిగితే బాగుండని

కుర్రాడై బాధ్యతలు తప్పించుకోవడానికి కాదుగానీ

చెట్టుకు పుట్టకొకరై జీవన ప్రవాహాన్నీదుతున్న

స్కూలు దోస్తులతో కొంచెమెక్కువ

సమయం గడపాలని!

మళ్ళీ టీనేజరై కాలేజికి వెళ్ళగలిగితే బాగుండని

కొంటెకోణంగి పనులేవో చేద్దామనికాదు గానీ

ఎంతందమైన ఊహల ప్రపంచంలో

విహరించానో

ఇంకొక్కసారి తనివితీరా చూసుకోవాలని!

మొదటి ఉద్యోగపు నెలకి

వెళ్ళగలిగితే బాగుండని

ఏదో తక్కువ పనులతో

సరిపెట్టెయ్యొచ్చని కాదు గానీ

మొదటి సంపాదన

పొందినరోజుటి ఆనందం

ఇంకొక్కసారి అనుభవంలోకి తెచ్చుకోవాలని!

పిల్లలు ఇంకొన్ని రోజులు

పసిపాపల్లాగుంటేనే బాగుండని

తొందరగా పెరిగేస్తున్నారనికాదు గానీ

బుడి నడకల బుడతలైతే

ఇంకొంచెం ఎక్కువ రోజులు

వాళ్ళతో ఆడుకోవచ్చని!

-- రవి కిషోర్ పెంట్రాల,

(లాంగ్లీ, లండన్)

Tags:    
Advertisement

Similar News