కోటి రాగాల
సుదీర్ఘ గాన యజ్ఞమిది
మబ్బులు చేశాయి
మార్తాండుణ్ణి మాయం
ఇది జడి వాన లాక్ డౌన్ గాయం
నింగినేల చినుకుల చిటపటలు పల్లవి
రేయి పగలు చరణాలు
క్షణమాగదు ఈ గానం
జడివాన వీణ గానం
రోడ్లన్నీ అలల చెరువులు
కొండలన్నీ తడినిగనిగల తరువులు
పుడమి లోలోతులను
తడిపింది వర్షం
గ్రీష్మ తాపాలకు పూర్తిగా
ఒసగింది మోక్షం
ఎటుచూసినా ఎర్రని బురద నీళ్ళమయం
అటుజూస్తే వాగువంకల వరదపొంగుల మహాప్రళయం
మారుమూల ప్రాంతాలన్నీ జలదిగ్బంధం
లోతట్టు ప్రాంతాలన్నీ బిక్కుబిక్కుమంటున్న చందం
మా పెదవాగులో గోదారి
పరవళ్ళ హుషారు
అన్నదాతల కళ్ళలో
నిరాశల ముసురు
నిండుకుండల ప్రాజెక్టులేమో ఎగువననిండడం
జలసౌభాగ్యభావం
సామర్థ్యానికి మించిన జలాలు దిగువకు వదలడం
ఇపుడు ఆవశ్యక రాగం
వాన వీణ గానం
కోటిరాగాల సుదీర్ఘ గాన యజ్ఞమిది
కొండగాలులు దిగివచ్చేను ఇలాతలం
వెచ్చనిగుండెలను గిచ్చెను శీతలంగా
అందాల ఆకాశ నీలంలో
ఆషాఢమేఘాలు అలా తేలుతూ
అనురాగాన పోటిపడుతున్న
ఆవేశ కాలం
చుట్టూ ఆకుపచ్చని
కొండల అరణ్యాలు
ఇపుడు పల్లెపట్టణాలు
చిరపుంజీ, మాసిన్రామ్ లు
ఊరువాడా జడివాన రాగాలు
కళ్ళముందంతా తడిఅలజడి భావాలు
ఇళ్ళలో గజగజస్వరాల ఎడదలు
ఇక పై విషజ్వారాల బెడదలు
వాన వీణ గానం
కోటి రాగాల సుదీర్ఘ గానం
- రమేశ్ నల్లగొండ