పిన్నిగారు (కథ)

Advertisement
Update:2023-10-30 16:35 IST

నిన్నటి నుండి మాధురి మనసు మనసులో లేదు. నిన్న సాయంత్రం గుడిలో కనిపించిన తన దూరపు బంధువు చెప్పిన విషయం వినగానే, మనసుకి బాధ కలిగించింది.

'ఏమోనే మాధురి! మీకు, ఆవిడకి ఉన్న సంబంధం తెలుసు కాబట్టి మనసాగలేక చెప్పాను కానీ, ఏమనుకోకు' అంటూ వెళ్లిపోయిం దావిడ. పరధ్యానంగా ఇల్లు చేరిందే కానీ అప్పటి నుండీ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తూనే ఉన్నాయి.

భర్త, పిల్లలు బైటకి వెళ్ళాక, టీ కప్ పట్టుకుని తీరిగ్గా బాల్కనీలో కూచుంది మాధురి. పక్కనే ఉన్న చెట్టు మీద పక్షి గూడు కట్టింది. పిల్లలు లేత గొంతుతో కువకువలాడుతున్నాయి. ఇంతలో తల్లి పక్షి నోట్లో ఏదో కరుచుకు పట్టుకు వచ్చి, పిల్లలకి పెడుతుంది. సృష్టిలో అమ్మతనం అనేది ప్రతీ ప్రాణిలో నిక్షిప్తం చేసాడు భగవంతుడు. అలాంటి తల్లి అనురాగం పూర్తిగా అనుభవించకుండానే తమ దగ్గర నుండి దూరం చేశాడేందుకో? తల్లి గుర్తుకు రాగానే కళ్ళ వెంట బొటబొటా కన్నీళ్లు వచ్చేసాయి. గతం వెంట మనసు పరుగులు తీసింది.

ఆంధ్రదేశంలో చిన్న ఊరులో మాధురి తండ్రి పెద్ద ఉద్యోగంమే చేసేవాడు. వరసగా ముగ్గురు అమ్మాయిలు. మూడో కూతురు పుట్టగానే పురిట్లోనే కాలం చేసింది భార్య. అప్పటికీ మాధురి కి నాలుగేళ్లు, వాళ్ళ అక్కకి ఆరేళ్ళు. చెల్లి వచ్చి, తల్లి దూరం ఎందుకయ్యిందో తెలియని పసితనం. నానమ్మ పసిగుడ్డుని పట్టుకుని, 'మీ అమ్మని మింగేశావ్ కదే' అని ఎందుకు తిడుతుందో అర్ధం కానీ చిన్నతనం. రెండేళ్లు ఆవిడ కష్టంగానే పిల్లల్ని చూసింది కానీ, 'కోడలు వండి పెడితే తిని కూచునే వయసులో, నీ ఆడ పిల్లలని సాకడం నా వల్ల కాదు నాయనా! నా మాట విని మీ మామయ్య తెచ్చిన సంబంధం చేసుకో! పేదింటి పిల్ల. నీకు వండి పెట్టి, పిల్లల్ని చూసుకుంటుంది' అంటూ పగలూ, రాత్రీ కొడుకుని వేధించి ఆయనకి రెండో పెళ్లి చేసింది.

పేరులో ఉన్న లక్షణం ఇసుమంతైనా లేని శాంతమ్మకి ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని తెలిసినా, తండ్రి అంతకన్నా గొప్ప సంబంధం చేయడని తల ఒగ్గింది. ఏనాడూ పిల్లల్ని చేరదీసేది కాదు. 'పిన్నీ' అంటూ దగ్గరకి చేరబోయినా, విసిరికొట్టేది. తండ్రికి పిల్లల మీద చాడీలు చెప్పి, తిట్టించేది. పాపం పసిపిల్లలు అర్ధాకలితో , అరకొర చదువులతో బతికేవారు.

ఇంతలో శాంతమ్మ నెల తప్పింది. మంచం దిగకుండా, పిల్లల్తో సమస్తం చేయించుకునేది. 'నేను అనుకున్నదొకటి, అయినదొకటి. ఈ ప్రారబ్దం నే చూడలేను' అనుకుంటూ మాధురి నానమ్మ చిన్న కొడుకింటికి వెళ్ళిపోయింది.

మగపిల్లాడు పుట్టగానే, తండ్రి మొహంలో అంత ఆనందం ఎన్నడూ చూడలేదు మాధురి. తర్వాత కూడా ఇద్దరు అబ్బాయిలు. దాంతో తండ్రికి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారన్న ధ్యాస కూడా ఉండేది కాదు. పళ్లైనా, ఫలాహారాలైన ఆ పిల్లలకే కానీ, వీళ్ళను అసలుకే పట్టించుకునేవారు కాదు. స్టోర్ రూంలో కూచుని అక్కాచెలెళ్ళు ఒకరినొకరు పట్టుకుని ఎన్నిసార్లు ఏడ్చుకున్నారో? 'ఎందుకమ్మా! మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు?' అంటూ అమ్మని తలుచుకుని కుమిలిపోయేవారు.

వీళ్ళ పరిస్థితి చూసిన మేనమామలు, పిన్నమ్మలు పూనుకుని, ముగ్గురి పెళ్లిళ్లు చేసారు. చూడచక్కని అమ్మాయిలు కావడంతో, మంచి సంబంధాలు వచ్చాయి. భగవంతుడు ఈ విషయంలో తన కరుణ చూపించాడు వాళ్ళ మీద. మొదటి పురుడు మాత్రం పుట్టింట్లో పోసుకుని 'మమ' అనిపించుకుని వచ్చేసారు. క్రమంగా వెళ్లడం కూడా తగ్గించేశారు.

తండ్రి కూడా ఆడపిల్లల్ని పెద్దగా తలచేవారు కాదు. 'తల్లి ఎలాగూ లేదు కన్నతండ్రి ఉండి కూడా అనాధలమయ్యాం' అని అక్కాచెలెళ్ళు ఒకరినొకరు ఓదార్చుకునేవాళ్ళు. ఒకరోజు తండ్రి అకస్మాత్తుగా పోయాడనేసరికి ముగ్గురూ బయలుదేరారు. పిన్నిగారు ముక్కు చీదుకుంటూ ఏడుస్తుందే కానీ, ఆడపిల్లల ఖరీదైన చీరలు, తళుక్కుమంటూ మెరుస్తున్న వాళ్ళ నగల మీదే ఆవిడ చూపులన్నీ ఉన్నాయని వీళ్ళు గమనించారు.

మగపిల్లలకు తన ఆస్తి మొత్తం రాసేశారు తండ్రి. కనీసం 'మా చెల్లి నగలు, తనకి మా పుట్టింటివారం ఇచ్చిన భూమి ఆడపిల్లలకి ఇవ్వండి' అని మేనమామలు తమ తరపున వకాల్తా పుచ్చుకు అడిగినా, 'చిల్లిగవ్వ ఇచ్చేది లేదంటూ' పిన్నిగారు పెద్ద గొడవ చేసింది. 'తల్లీ తండ్రీ ప్రేమకి నోచుకోని అభాగ్యులం, ఇప్పుడు వాటి కోసం గొడవ ఎందుకు మామయ్య? అంటూ ఎక్కడివాళ్ళక్కడికి వెళ్లిపోయారు.

మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నిన్న గుళ్లో బంధువు చెప్పిన మాట వింటే, మనసు బాధపడింది క్షణకాలం.

'మీ పిన్నిగారి ముగ్గురు కొడుకులు వేరు పడ్డారు. ఏ కోడలూ కూడా అత్తగారిని ఉంచుకోమని మొహాన చెప్పేసారట. ఆస్తి మొత్తం కూడా ముగ్గురూ వాటాలేసుకు పంచుకున్నారు. ఇప్పుడు గుళ్లో అనాథలా పడుంది. ఆ పంతులు గారు పెట్టే నైవేద్యం తింటూ, ఒక కాలు పడిపోయుంది. మొన్న గుళ్లో నన్ను చూడగానే పట్టుకు ఏడ్చింది. ఏం చేస్తాం? ఎప్పుడు చేసుకున్న ఖర్మమో' అందావిడ.

లేచి అక్కాచెల్లెళ్ల కి కాన్ఫరెన్స్ కాల్ కలిపి, జరిగిన విషయం చెప్పింది మాధురి.

'మా బాగా అయ్యింది. మనల్ని తక్కువ బాధపెట్టిందా ఆవిడగారు? అందుకే అనుభవిస్తుంది. ఆవిడ మాట నాదగ్గర ఎత్తకు. దేవుడున్నాడు' అంది అక్క.

'అందుకే అన్నారు పెద్దలు...,చేసుకున్నవారికి చేసుకున్నంత అని. మన అమ్మ నగలు ఒళ్ళంతా దిగతుడుచుకు తిరిగేది మన ముందే. ఎప్పుడు చూసినా నన్ను పిక్కపాశం పెట్టి, మొట్టికాయలు వేసేది. ఇవాళ కొడుకులే ఒక ముద్ద పెట్టటం లేదన్నమాట. తిక్క కుదిరింది ఆవిడకి' అని చెల్లి అంది.

సవతి తల్లిలా ప్రవర్తిస్తున్నప్పుడు కన్నతండ్రి మొదట్లోనే ఆవిడ్ని వారించవలసింది. తండ్రి అలక్ష్యం కూడా ఉంది. దాంతో ఆవిడదే పెత్తనం అయ్యింది. 'తన పనులు జరిగిపోతున్నాయని ఇంట్లో ఎవరెలా పోతే తనకేంటి' అనుకున్న తండ్రి నిర్లక్ష్యాన్ని వదిలేసి, ఆవిడని నిందించే పనేమిటి? అనాధలాగా కొడుకులు వదిలేస్తే గుళ్లో పూజారి ఇచ్చిన ప్రసాదం తింటున్న పిన్నిగారి మొహం గుర్తుకు వచ్చింది.

అందరూ ఉండి అనాథలా బతకాల్సి వస్తే ఆ నరకం ఎలా ఉంటుందో తాను అనుభవించింది. తన తల్లి కాలేకపోయినా తన తండ్రికి భార్య ఆమె. తండ్రి వంశాన్ని వృద్ధి చేసే కొడుకుల్ని కన్న భార్య. ఈ వయసులో ఆవిడ్ని ఒంటరిగా వదిలేయడం ధర్మం కాదు.

భర్త రాగానే ఆయన్ని ఒప్పించి, పిన్నిగార్ని తన ఇంటికి తెచ్చుకువాలనుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మాధురి.

- రామాయణం పద్మజ

Tags:    
Advertisement

Similar News