ఎన్నో రంగుల సీతాకోకచిలుకలు
కంటికెదురుగా ఎగురుతున్నా
ఇంకా కనిపించనిదేదో
వెతుక్కొంటున్నాను..
ఇంద్రధనుస్సు బుట్టను బోర్లించి
ఏడు రంగులూ
ముంగిట కుమ్మరించినా
సరిక్రొత్త ఎనిమిదో వర్ణం కోసం
ఎదురుచూస్తున్నాను..
ఏటిగలగలలు
ఎన్ని రాగాలను వినిపించినా
క్రొత్తగా పుట్టే స్వరం
నాలో ప్రవహించడం కోసం
గుండె తంబురాని మరొక్కమారు
శ్రుతి చేసుకొంటున్నాను..
అక్షరానికి - అక్షరానికి
మధ్యన తారాడే
అవ్యక్తప్రసాదం కోసం
అమ్మ పాదాల దగ్గరే
పారాడుతున్నాను..
ఉబుకుతున్న స్పందనలను
ఉక్కుపాదంతో త్రొక్కిపెట్టి
ఎవరిని మోసం చేస్తాం?
ఎద సంచీలను దులిపేస్తూ
ఏదీ లేనేలేదని ఇంకెన్నాళ్ళు
లోలోన దాచేస్తాం?
నన్నూ, నిన్నూ,
అక్కున చేర్చుకొన్న దానిని
ఎక్కడ దాగున్నా
గుర్తుపట్టగలవా నేస్తం?
మనసు మూలాన్ని
మౌనంగా తడుముకొంటూనే
మరొక ప్రయత్నం చేద్దాం..
రామ్ డొక్కా
(ఆస్టిన్, టెక్సస్)