జన్మజన్మల అనుబంధం మాది

Advertisement
Update:2023-08-31 00:00 IST

నా పసి వయస్సులో చిరుగజ్జెల అడుగులతో,

తెనాలిలో మా స్కూలు కు వచ్చిన కళాతపస్విని

ఆహ్వానిస్తుంటే

అక్కి నేని అప్యాయంగా తలనిమురుతూ

ఆశీస్సులు అందించిన

ఆనాటి

అన్నయ్యరూపం నాలో చిరస్థాయిగా నిలిచి పోయింది.

ఆపై అక్కి నేని ఇంట

ఆడబడుచుగా నా స్థానం సుస్థిరమైపోయింది.

మా అను బంధం తాలూకు అనుభూతులను

రేఖా మాత్రంగా చెప్పటం సాధ్యమా ?

నేను తెనాలిలో వున్నా,

కాకినాడ లో వున్నా

అన్నయ్య నుంచి ఫోన్ వచ్చేది

" అమ్మా ! నేను షూటింగ్ కు వెళ్ళబోతున్నాను. అన్నయ్య గా నటించ బోతున్నాను. ఒక్కసారి 'అన్నయ్యా ''అని పిలువు .

నా పిలుపుకు అన్నయ్య కళ్ల ల్లో మెరిసిన కాంతి

నాకు ఫోన్లో కనిపించేది .

నేను 1980 లో హైదరాబాద్ వచ్చాక కుటుంబ సభ్యులం తప్పనిసరి గా ప్రతి ఆదివారం అన్నయ్యా వాళ్ళింట్లో కలుసుకునే వాళ్ళం. ఆ రోజు మాకు పండుగరోజు .ఆయన అసాధారణ వ్యక్తిత్వాన్ని చదవటానికి అలవాటు పడిన నేను ' మీ జీవితచరిత్ర రాయాలని వుంది ' అన్నప్పుడు వ్రాయమ్మా ! ఐనా వ్రాసేది నీవు కాదు కదా !నీలో వున్న నేనే కదా !' అంటూ ఆశీర్వదించారు .

నేను వ్రాసిన " మనిషిలో మనిషి డాక్టర్ అక్కి నేని" గ్రంథం ఆధారంగా ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు ఇద్దరు డాక్టరేట్ తీసుకున్నారని అన్నయ్య కళ్ళు చెమర్చడం మరచిపోలేను.

నారాయణ రెడ్డిగారు నాకు

సుశీలా నారాయణరెడ్డి అవార్డు ప్రకటించి,

అన్నయ్యని ముఖ్య అతిథిగా ఆహ్వానించినపుడు

ఇబ్బందిగా అన్నారు.

'మా చెల్లాయికి

పురస్కారం ఇస్తూ ,అందరూ పొగుడుతూ ఉంటే ప్రేక్షకుల్లో వుండి ఆనందించడమే నాకు ఇష్టం " అంటూనే వేదికనెక్కి నాకు పురస్కారం అందచేసి ఆశీర్వదించారు .

రాఖీ పండగ

నాకూ అన్నయ్యకూ ఇద్దరికీ

పెద్ద పండగే -

రాఖీ పండుగ రోజున

అన్నయ్య నాకోసం ఎదురు చూస్తూ ఉండేవారు .

రాఖీ కట్టాక అన్నయ్యకిష్టమైన

బెల్లం జిలేబీని

నోటికి అందించేదానిని .

అన్నయ్య గదిలో అరవైకి పైగా రాఖీలు ఉండేవి

" అన్నీ నువ్వు కట్టినవే " అని ఆప్యాయంగా చూసేవారు ." పూర్వజన్మలూ ,పునర్జన్మలూ నాకు నమ్మకం లేకపోయినా మన అనుబంధం చూస్తుంటే అన్నీ నిజమేననిపిస్తోందమ్మా " అనేవారు

ఆ రోజు జనవరి 22 వ తేదీ .

అన్నయ్య నుండి పొద్దున్నే ఫోన్ వచ్చింది.

“నువ్వు అన్నం తినటం లేదట . నిద్రపోవటం లేదట .ఇలాగైతే ఇంక నీకు ఎవరు చెప్పగలరమ్మా ! రాత్రి ఫోన్ వస్తుంది .నన్ను చూడటానికి వస్తావు కదా !"

అవే ఆఖరు మాటలు

ఇప్పటికీ రాఖీ రోజున అన్నయ్య నా అంతరం గంలో ఆశీస్సులు అందిస్తునే వుంటారు .ఆ రోజున మా సుశీల నాన్న తరఫున నాకు చీర ,గాజులు పంపుతూనే వుంటుంది.

మా అన్నయ్యకు అక్షరాక్షర సుమాంజలులు




-డాక్టర్ కె.వి కృష్ణ కుమారి

Tags:    
Advertisement

Similar News