ఆకాశము నుదుట
ఎర్రని మందారం సింధూరమై
అందంగా ముస్తాబై
పచ్చని నవ్వులు రువ్వుతు
పసుపు కిరణాల వలయాలుగా తిరుగుతు
అవని తల్లి ఒడి కి చేరినప్పటి నుండి
కాలచక్రగమనం బ్రమరమై తిరుగుతు
ఆకాశం నిండా వెన్నెల పూలు పూసేంతవరకు
కాలంతో చేసే అలుపెరుగని
ఉరుకుల పరుగుల ప్రయాణం విశ్వదర్శన వీక్షణమే..
మెట్రో నగరాన మయూరమే పురివిప్పి నర్తిస్తున్న
సుందర దృశ్యాన్ని చూసినంత
అధ్భుతంగా అనిపిస్తుంది
అందమైన సీతాకోకచిలకలుగా అందాల కన్నె
వయ్యారాల సందడి మనసుకు సంబరమే..
మెట్రో ప్రయాణం
కత్తులు లేని మనుషుల యుద్ధమే !
ప్రతి రోజూ చూసే ముఖ కవళికలే
పేరే తెలియని పాత పరిచయాలే !!
గమ్యానికి చేరాలనే తపనొకటే
అందరి మనసులలో !!.
'తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి '
'డోర్స్ విల్ ఓపెన్ ఆన్ ద లెఫ్ట్'
'దర్వాజా భాయ్ తరప్ కోలేంగే'
మూడు మాటలు చెవిన
తిరుగుతుంటాయి
రంగుల చక్రంలా !!!
భాధలు కూడా తలపులు తెరుచుకుని
బయట పడితె బాగుండే !!!
మెలికలు తిరుగుతూ
పరుగులు పెడుతూ
నేనోచ్చానని పలుకరిస్తూ
అందరినీ తన ఒడిలో పట్టుకుని సాగుతుంది.
అడుగెడుదామంటే అంగుళం జాగే లేక రోజూ
బొటన వేలిపై చేసే తపస్సు ఓర్పు విలువ ఎంతో
తెలుపుతుంది.
అచ్చోటులో ఎందరున్నా
ఎవరికీ వారే ఒంటరి వారే
ఒకరితో ఒకరు మాట్లాడని తీరే
ఎవరి చేతిలో చూసినా చరవాణీలే
మౌన సముద్రంలో ఆహ్లాదాల అలల ఉయ్యాల లో
జోగే జన సందోహాల ఉత్సాహాలే!!
ఫ్లాట్ ఫారాల మంది హడావుడి
పోలేరమ్మ జాతరల పూనకాలే !!
'రెడ్','బ్లూ','గ్రీన్ ' లైన్ లా
ఇష్టమొచ్చిన గమ్యానికి మలుపు తిప్పుకునే
అవకాశం జీవితంలో ఉంటే ఎంత బాగుండు !!!
అద్దాల సందులోంచి ఆకాశాన్ని
తాకే అందమైన అంతఃపురాల సౌధాలు
అద్దాలతో సుందరమైన
హంగులతో గాలివేగంతో పుంజుకుని
పరుగెత్తే నేల మీద నడిచే విమానం మెట్రో రైలు .
ముందొచ్చే స్టేషన్లను ముందే చెప్పినట్టు
జీవితంలో కష్టాల రాకను , కాలం పసిగట్టి చెప్తే బాగుండు!!!
శీతాకాలం నుండి ఎగిరి వేసవికి దిగినట్టు
చల్లని మంచుకొండ నుండి ఎడారికి వలసలెళ్ళినట్టు
వేడిని తవి చూపిస్తుంది తన ఒడి నుండి విడుదలైనప్పుడు …!!
అడుగులు తడపడుతూ
ఆగక సాగుతుండే ఆలస్యం తవి చూపిస్తదని .
బాటలో ఎదురయ్యే
ఆకలి పేగుల మూటలెన్నో !
పొట్ట కూటికి
కొట్టు పెట్టుకుని
కడుపు నింపుకునే బతుకల కట్టలెన్నో !
వారానికి ఐదు దినాలు
చూడగానే కరిగిపోయే .
వీకెండ్ అయితే చాలు పార్టీల ముచ్చటలే
పబ్ అని ఒకడు
సినిమా కనీ ఒకడు
షికారు చేసి చిల్లు అవుదామనే వాడొకడు.
చూస్తూనే గడిచిపోయే శని ఆదివారాలు
షరా మాములే మళ్లొచ్చే ఐదు దినాలు .
ఎంత జాలిగా కనపడుతున్నా
ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగి వెనుక
ఎన్ని ఆలోచనల కుప్పలున్నాయో
మౌస్ ,కీప్యాడ్ కే తెలుసు.
బతుకుబండిని లాగడానికి ఎన్ని
మాటల కంటకాలు కుచ్చు కుంటాయో
తన ఒక్కొక్క రక్తపు బొట్టును అడిగితే చెప్తాయి .
ఏసీ గదుల్లో కూర్చొని ఇంత
సంపాదిస్తున్నాడే అని అనుకునే వారు కానీ .
ఏసీ గది నిండా వెలుతురు లేని చీకటుంటుదని ఎవరికి తెలుసు
మోడు బారిన గుండెకు తప్ప….
పోలోజు రాజ్ కుమార్