నేను విభ్రమగా
నీ ముందు నిలబడతాను
కొత్త దుఃఖమొకటి
నన్ను నీకు మరింత దగ్గరగా మోసుకొస్తుంది.
ఎవరికని చెప్పను చెప్పు
అయాచిత కష్టాల్నన్నింటినీ ప్రోగేసుకుంటాను కదా!
నీకెన్ని దుఃఖాల్ని వినిపించాలనుకున్నానో!
ఓ కృతిగీతం
నీ ముందు వెక్కిళ్లతో పాడాను గుర్తుందా?
ఆవేళ వర్ణ శోభితమైన ఆకాశం కేసి అబ్బురంగా చూస్తూ
నిన్నెంతగా పొగిడాను.
వెనక్కు తిరిగి చూడొద్దన్నావని
యుగాల దుఃఖం నన్ను తరుముకొస్తున్నా
మధ్యాహ్నపు తీరని ఆకలి,
రాత్రి కడుపులోకి ముడుచుకున్న మోకాళ్లు,
పొడిబారి బరువెక్కిన కళ్ళు
ఆ వెనుక రేపటి భయాలు,
నీరసమైన ఉదయాలు
పోనీలే!
అవన్నీ
సంచిత కర్మలంటావు నువ్వు.
ఆశల వెంట
వెర్రిగా పరిగెట్టించావా లేదా?
మోహాల ముంగిట
బొక్కబోర్లా పడేసావా లేదా!
ఎన్ని శోభల్ని కూర్చావు నువ్వు!?
మరెన్ని క్షోభల్ని రుచి చూపావు!?
మధువులూరే
పైపూత పూసిన క్లేశాల్ని
సుఖాలని భ్రమసి
జుర్రుకున్నాను కదా!
ప్రభూ!
నిజం చెప్పు!
జీవమొక దుఃఖమవునా?కాదా !
- రాజేశ్వరరావు లేదాళ్ళ
(లక్షెట్టిపేట)