మెట్లు మెట్లుగా అమర్చిన
బొమ్మల బల్లమీద
ఆది మూలం
అమ్మ కొలువు తీరింది.
డాబా మీద వెన్నెల ఖడ్గం
డాలు పట్టింది.
పూర్వ పురాణ కథన రూపాలు
పుణ్య పుత్తళికలు,
దేశ భక్తులు, వీరమాతలు, త్యాగమూర్తులు,
నిత్య చైతన్య శిల్పాల సరసకు చేరేసరికి
అలై బలై దివ్య సాంగత్యం
అపురూపమయింది.
పాలపిట్టను చూసి తీరాలనే ఆశ
పూల మనసుల పిల్లల కలలకు
రెక్క తొడిగింది.
మరలి వచ్చిన దసరా
మనిషి చరిత్రకు
మనుగడల విలువ తెలిపింది.
చేతులు కలువని దూరముందని
చేతులు దులిపేసుకోక
వైద్యుడే నారాయణునిగ
అవతరించిన ప్రతిమ
వెలుగు సోపానాల
పైకెక్కి మెరిసింది.
ఆసుపత్రి నర్సమ్మ
అహర్నిశల సేవతో
విగ్రహ దేవత గా
రెక్కలను ధరించి నిలిచింది.
విపత్కర సమయాన
స్వేద శ్రమలకు వెనుకాడక
నడ వీధుల స్వచ్ఛతను
నెలకొలిపిన
పురకార్మికులకు సత్కార దృశ్యం
వెల కట్ట లేని వనరుగా
కొలువు చేసింది.
ఈ నాటి బొమ్మల కొలువు
మానవత్వానికి పెద్ద పీట వేసింది.
మట్టికి
ఇంద్రధనుస్సుల వర్ణాలను
మొలిపించగల
సృష్టి కళల విన్యాసాలకు
బ్రతుకు తెరువుల భాగ్యం కలిగించాలని
మనసు పడ్డ బొమ్మల వరుస
ఎదురు చూసింది.
రాజేశ్వరిదివాకర్ల
(బెంగళూరు)