మిషన్ తల్లి (కవిత)

Advertisement
Update:2023-03-02 19:37 IST

ఆమె మడిచి తెచ్చిన బట్టను

మంచి కళాకృతిగ మలచింది.

నున్నని మెడ దిగువకు

భుజం తళ తళ మెరిసేటట్టుగా

గుండ్రగ కత్తిరించిన బ్లౌజు కు

కాజా వేసిన వెనుక బొత్తాల వరుస

రమణి అందానికి మెరుగు దిద్దింది.

పరువపు బిగువులకు

కనికట్టు చేసింది.

వదులయింది ఇక వద్దంటూ

వదిలేసిన కుర్తీ చొక్కాను

టాకా కుట్టు వేసి సవరించి ఇచ్చినప్పుడు

సంతసించిన కాలేజీ అమ్మాయి

మేలు చేసిన పనితనానికి

మరింత పైకం అదనంగా చేర్చి

ఆమె కొట్టుకు తెచ్చి ఇచ్చింది.

మరి పదిమందికి పొగిడి చెప్పి

పరపతిని పెంచింది.

ఆమె జార్జెటు చీరకు

నక్షత్రాల నమూనాలను దించింది.

చీరకుచ్చిళ్ళు పాదాలకు

జీరాడేటట్టు గా

సాటీను బట్ట ఒద్దికను చేర్చి

ఫాల్ పతనోద్దారణల పెంపు నేర్చింది.

తీరిక లేని ఉద్యోగిని

సమయానికందిన తోడ్పాటుకు

మురిసి పోయింది.

ఈ సారి పండుగకు

మరిన్ని చీరలిచ్చి

కొంగుకు డబ్బీ మెలికలు

వేయమంది.

రవిక అంచుకు జిలుగు పోగుల పూలు కుట్టమంది.

టైలరమ్మ నైపుణ్యానికి

తాఖీదు లిచ్చింది.

( రెండు రోజుల కృతపు టైలర్స్ డే సందర్భంగా రాసింది)

- రాజేశ్వరి దివాకర్ల

(వర్జినియా, యు.ఎస్)

Tags:    
Advertisement

Similar News