శిలలు రాసాయి కవిత్వం.
శిల్పులు చేసారు సృష్టి సంతకం.
అందాల చెన్న కేశవాలయ నిర్మాణానికి
భూమి పూజ పరచింది నక్షత్ర ప్రణాళిక
మాయా విభ్రమ లోకంలో
మానవ ప్రతిభల కళా సత్య దర్శనం.
హొయ్ సల
వేసేయ్ సల అన్న గురువు గారి ఆదేశానికి
పైకెగసి వస్తున్న పులిని చెండాడిన శిష్యుడు సల
హొయసల రాజ లాంఛనమైన వైభవం.
విష్ణు వర్థనుని యుద్ధ విజయ ఉత్సవం.
దేవతలు సంభ్రమించి దివికి కొనిపోదలచిన
విశ్వ సౌందర్య చేతనా కేతనం.
లతా మంటపాలలో మదనికలు
వందల ఏండ్లకు క్రితమే
అధునాతన నారీ క్రియా శక్తి విలాసాలు
పట్ట మహిషి నాట్య సరస్వతి శాంతలాదేవి
అభిజ్ఞతా ముద్రల నవరసాకృతులు.
సంప్రదాయ చట్రం లో
స్వేచ్ఛా భావనా మూర్తులు
రాణి అభీష్టాన్ని మన్నించిన
రాజు కళా తత్వ ప్రతికృతులు.
నుదుట తిలకం దిద్దుకుంటున్న
ముకుర ముగ్ధ
తన సొగసుకు
అద్దాన చూపులు నాటుకుంది.
దర్పణ సుందరి,
స్త్రీల సహజ లావణ్యాపేక్షకు ప్రతీక.
త్రికోణమైన ఒంపులతో
దేహ లాస్యమాడింది
త్రిభంగి నర్తకి అసాధ్య నృత్య భంగిమ.
చిక్కని కురులను
ముడి వేసుకున్న కేశ బంధ.
చిలుకతో ముచ్చటలనాడింది
శుక భాషిణి.
మహత్తరం ఆమె హస్త భూషణం
కదలాడుతుంది చేతి కంకణం.
గిరజాల జుట్టును
సరిదిద్దుకుంటున్న మెలుత
ఆధునికం అలంకరణ ఆభరణాలు,
చిత్ర విచిత్ర సంగీత వాద్య
నృత్య విన్యాసాలు,
ఇవన్నీ అంత:పుర గీతికా ప్రబంధాలు.
పూర్వం అభినవమైన
పరంపరల అభిజాత్యాలు.
కోతి చీరను లాగి మేల మాడుతుంటే
కొమ్మనెత్తి అదలించిన మర్కట మోహిని
సహజ పర్యావరణ సహవాసాలు.
కనుల పండుగ బేలూరు కళా వైభవాలు
భౌతికమైన అందాలన్నీ
పరమాత్మ లాస్య కేళీ వినోదాలు.
సాలభంజికలు అర్పించిన
ఆత్మ శుద్ధ హావ భావ భక్తి నీరాజనాలు
ప్రపంచ వారసత్వ కీర్తికి
ఆగమ శిల్ప ప్రమాణాలు.
- రాజేశ్వరి దివాకర్ల (బెంగళూరు)