పదహారేళ్ళ ప్రాయం
పరికిణీ ఓణీలే ఆహార్యం
ఇంట్లో అంతా కట్టుదిట్టం
తల వంచుకునే
సంగీత పాఠాలకు
సాయంత్రం వెళ్ళి రావడం.
సందు మలుపులో
ద్విచక్ర వాహనం.
రాక పోకలకు
కాచుకుని ఉంటుంది,
రాలు గాయి తనం.
కలకంఠి ఓర కంటికి
తెలుసునా విషయం
కలుగుతూనే ఉంటుందొక
గుబులు నిజం.
అలవాటవుతుంది.
ఒకింత వెనుకకు
తిరిగి చూడడం.
బాగుందనిపిస్తుంది.
క్రాపు దువ్విన
పూల రంగని వేషం.
గులాబీ రెక్కలను
విప్పుకుంటుంది,
ఊహా లోకం.
రోమాంచన కలుగుతుంది.
కను గుడ్ల బొమ్మలు కలబడిన
ఘడియ రానే వస్తుంది.
అదుపు మరచినకలయిక
తీయనౌతుంది.
తల్లి దండ్రుల మాట
కఠినమౌతుంది
లేని తెగువ తెలియకనే
వస్తుంది.
వయసు మనసును
తనవెంపుకు
తిప్పుకుంటుంది.
బెదురు చూపుల
లేడి పిల్లను
పంజా విసిరిన పులి
పొదల మాటుకు లాగుతుంది
చదువు గగనానికెగిసిపోతుంది
సంగీతం బెడిసి కొడుతుంది.
పుట్టినిల్లు తిరస్క రిస్తుంది.
అడవి చీకటి నడుమ
విడిచిన
ప్రియుని వెతికే
కలత ఝాములో
ముళ్ళ కంప
పరుచుకుంటుంది .
అమ్మాయికి మెలకువ వచ్చింది.
పాడు కలను తరిమి
గుండె దిటవు చేసుకుంటుంది .
తెలవారగనే అమ్మను నాన్నను కౌగలించుకుంటుంది.
- రాజేశ్వరి దివాకర్ల
(వర్జినియా ,యు ఎస్ )