నిజం నిల‌బ‌డాని ఆకాంక్షించే నాట‌కం - నిజం

రాచకొండ విశ్వనాథ శాస్త్రి వ్రాసిన నాటకాలలో అగ్రగణ్యమైనది ‘‘నిజం’’. ఈ నాటకం సమాజంలోని విభిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల నిజస్వరూపాలను బహిర్గతం చేస్తుంది. కోర్టులో సాక్షుల చేత ‘‘అంతా నిజమే చెప్తాను.

Advertisement
Update:2022-10-10 16:12 IST

రాచకొండ విశ్వనాథ శాస్త్రి వ్రాసిన నాటకాలలో అగ్రగణ్యమైనది ''నిజం''. ఈ నాటకం సమాజంలోని విభిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల నిజస్వరూపాలను బహిర్గతం చేస్తుంది. కోర్టులో సాక్షుల చేత ''అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను'' అని ప్రమాణం చేయిస్తారు. శాస్త్రి గారు అలా ప్రమాణం చేశారో లేదో కానీ నిజం నాటకం మాత్రం స్వార్థపరులు, రాజకీయ నాయకులు, మధ్య తరగతి మనస్తత్వాలు మొదలయిన వాటిని గురించి నిజం ఎలా వుంటుందో, ఎలా వెల్లడవుతుందో, ఎలా బయటకు రాకుండా అణచి వేయబడుతుందో తెలియజేసిన నాటకం 'నిజం'.

ఇది ఆరంకాలు కలిగిన పెద్ద నాటకం. ఆ నాటకం ఎందుకు వ్రాయవలసి వచ్చిందో ఆయన మనవి మాటల్లో ఇలా అన్నారు, ''ఈ నాటకం నేను గొప్పకి కాని, నాకు ఊసుపోక కాని రాసింది కాదు, ఇందులో జరిగిన అన్యాయాల వంటి అన్యాయాలు నిజ జీవితంలో అదే స్థాయిలో నిత్యం జరక్క పోయినా ఏదో ఒక స్థాయిలో మాత్రం నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో ప్రతిరోజూ ప్రతి చోటా కూడా ఎవరో కొందరమాయకులు వాళ్లు చెయ్యని నేరాలకు శిక్షలను భరించడం జరుగుతోందని నేను ఖచ్చితంగా, ఘంటాపథంగా, ఛాలెంజి చేసి చెప్పగలను.

ఏ పాపం ఎరగని వాళ్లు జెయిళ్లలోనూ, జెయిళ్ళ బైట కూడా మగ్గుతూనే వున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సంఘంలో పేదవాడికి న్యాయం దొరకదు గాక దొరకదు. తనకన్యాయం జరిగితే ఎదుర్కొనడానికి సంఘంలో అవకాశం లేదు కాక లేదు. ఈ పరిస్థితి మారాలని నాకుంది. అందుకే ఈ నాటకం రాసేను. కోర్టులో వాద ప్రతివాదనలు డిఫెన్సు లాయరు, ప్రాసిక్యూటర్‌ల ఎత్తులు పై ఎత్తులతో ఆసక్తికరంగా సాగుతాయి. ఈ సందర్భంలో సార్వభౌమారావు అకృత్యాలకు సహాయపడే న్యాయమూర్తి బదిలీ అయిపోయి, నూతన న్యాయమూర్తి పదవి స్వీకరించడంతో, కేసు తేలికగా చిన్నపాటి శిక్షతో ముగుస్తుందని సార్వభౌమారావు భావించినా, జడ్జి గారి నిక్కచ్చితనం వలన నకిలీ సుందరానికి ఉరిశిక్ష ఖాయమవుతుంది.

ఈ సందర్బంలో సుశీల అతని శిక్ష తప్పించుకోవడానికి నేను సత్యాన్ని రక్షిస్తానని చెపుతుంది. హత్య చేయబడిన సత్యం ఎలాగూ తిరిగి రాడు. (సత్యం హత్య నిజాన్ని హత్య చేయడంగా, నేటి సమాజంలో సత్యానికీ, న్యాయానికీ జరిగిన సంఘర్షణలో సత్యాన్ని పాతిపెట్టి, తన చాతుర్యంతో న్యాయవ్యవస్థలోని లొసుగులను ఆధారం చేసుకుని ఎలా కేసును తప్పుదారి పట్టిస్తాడో నిరూపించడమే ఈ నాటక ముఖ్యోద్దేశం. కనుకే బలి అయేవాడు మనకు తెలిసీ, తెలియని అమాయకుడు. నువ్వు మాట్లాడొద్దు అని సుశీలను బెదిరిస్తాడు. అయినా, సుశీల అతనిని వదిలి నిజం చెపుతానని వెళ్ళిపోతుంది. సత్యం గెలుస్తుందా, న్యాయం నిలుస్తుందా అన్నది నాటకం చూస్తేనే అర్థమవుతుంది.

ఇంత పెద్ద కాన్వాసు గల ఈ నాటకాన్ని తన సంభాషణా చాతుర్యంతో, సన్నివేశాల రూపకల్పన చేసి, ప్రేక్షకులను మైమరపించి, ఆలోచనా నిమగ్నులను కావించడంలో రచయిత కృతకృత్యులయినారు.

''కావ్యేషు నాటకం రమ్యం, తత్రశకుంతలా, తత్రాచతుర్థోంక: తత్రాపిశ్లోక చతుష్టయం'' అన్నట్లు శాకుంతలంలో నాల్గవ అంకానికి ఎంత ప్రాధాన్యత వుందో, ఈ నాటకంలో అయిదు, ఆరు అంకాలకు అంత ప్రాధాన్యత వున్నది. ఈ రెండు చివర అంకాలు కావడం వలన అయిదో అంకం ప్రీక్లయిమాక్స్‌, ఆరవ అంకం క్లయిమాక్సుకు ప్రతీకలుగా నిలిచి ప్రేక్షకులను కట్టిపడేయడమేగాక, సత్యం సమాజంలో ఎలా హత్య గావించబడుతుందో అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెపుతాడు రచయిత. ఇక మనం నాటకంలోకి వెళ్ళి కొన్ని సంఘటనలు, సన్నివేశాలు చూద్దాం.

లిలిలి

ఈ నాటకం మొత్తం పదిహేనుకు పైగా పాత్రలున్నాయి. వాటిలో ప్రధానమైనవి సార్వభౌమారావు, సుశీల, సుందరం, డిఫెన్స్‌, ప్రాసిక్యూషన్‌, జడ్జి తదితర పాత్రలు. ఈ నాటకం రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి సామాజిక స్పృహను తెలియజేయడమే గాక ఆయా పాత్రల ద్వారా చెప్పించిన సంభాషణలు సార్వకాలికమైనవి. విభిన్న మనస్తత్వాలను తెలియజేసి ప్రేక్షకులలో, పాఠకులలో చైతన్య స్ఫూర్తిని కలుగజేస్తుంది.

ఏ నాటకానికి అయినా మూడు ముఖ్య లక్షణాలుంటాయి. నాటకం మొదటి అంకాలలో ఇతివృతానికి సంబంధించి కొన్నిముడులు వేయటం చివరకు ఆ ముడులను విడదీసి రసానుభూతినీ, పాఠకులలో ఆలోచనలు రేకెత్తించడం జరుగుతుంది. ఇవి రచయిత సక్రమంగా నిర్వహించగలిగితే, ఆ ప్రదర్శన విజయవంతమైనట్లే.

ఈ నాటకంలో మొదటి అంకంలో ప్రవేశపెట్టబడిన మిత్రుల పిక్‌నిక్‌ ఇతివృత్తానికి మొదటి భాగం. సత్యం, సుందరరావు, మధుసూదనరావు, కృష్ణయ్య అనే నలుగురి పరిచయం చేయబడిరది. ఈ నలుగురు మిత్రులూ పిక్‌నిక్‌కు వెళ్ళిన సందర్భంలో మందు తాగుతూ ఆ మైకంలో మాటా మాటా పెరిగి, సుందరం, సత్యాన్ని విస్కీ సీసాతో తల పగలగొట్టి హత్య చేస్తాడు. తరువాత ముగ్గురూ భయపడి శవాన్ని అక్కడే వదిలేసి అక్కడ ఏమీ ఆధారాలు లభించకుండా జాగ్రత్తపడి పారిపోతారు.

హత్య చేసిన సుందరం బాగా పలుకుబడి కలిగిన పార్లమెంటు మెంబరు సార్వభౌమారావు గారి కొడుకు. ఆయన ఇంట్లో వంటపుట్టి సుశీలను ప్రేమించి ప్రేమించబడినవాడు. సార్వభౌమారావు సుశీలను గాఢంగా ప్రేమించి వుండటం చేత ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ సుందరం తన కొడుకు కావడంతో వారి సంబంధాన్ని అంతగా పట్టించుకునే వాడు కాదు. అదీగాక సుశీలను ఆయన పెళ్లాడలేదు.

మిత్రులు ముగ్గురూ వచ్చి సార్వభౌమారావు గారికి జరిగిన విషయమంతా చెప్పి రక్షించమని కోరతారు. హత్య చేసింది తన కొడుకే కాబట్టి అతడిని రక్షించడానికి, సుందరం అనే పేరు గల మరో అభాగ్యుణ్ణి తీసుకువచ్చి శిక్ష పడేలా చేస్తానంటాడు. మిత్రులందరూ దీనిని సమర్థించకపోయినా ఒప్పుకోకపోతే తమకు కూడా శిక్ష పడుతుందని సార్వభౌమారావు హెచ్చరించడంతో, ఆఖరుకు సుశీల కూడా మౌనంగా ఊరుకుంటుంది.

సార్వభౌమారావు తన ఇంటికి ఎదురుగా సిఐని తన పలుకుబడి ద్వారా ఉపయోగించుకొని ఈ తతంగమంతా జరుపుతాడు.

సుందరం సత్యాన్ని హత్య చేయడానికి ముందు జరిగిన సంభాషణ హత్య చేయడానికి ప్రేరణ యిచ్చేదిలా వుంటుంది.

సుందరానికి వరుసకు పిన్ని అయినా ఆమెతో అక్రమసంబంధం పెట్టుకున్నాడంటూ సత్యం అన్న మాటలు`

సత్యం :` కాని, వీడి ఫాదరు ఎంత పార్లమెంటు మెంబరయినా, ఎంతటి పెద్దపులి అయినా, అమాయకప్పక్షికి ఎన్నాళ్ళు కళ్ళు మూయగలడు? ఎన్నాళ్ళు బంగారు సంకెళ్ళతో బంధించగలడు? స్నేహితులారా! ప్రియ మిత్రులారా! ఇప్పుడా సుశీలను సుందరంగాడు సాకుతున్నాడు!

సుందరం :` నే... నేనా? మా పిన్నినా? సాకుతున్నానా? బాస్టర్డ్‌. ఏమిట్రా పేల్తున్నావ్‌?

సత్యం :` ఒరే సుందర్‌! నువ్వు మంచి వాడివైతే, మీ ఫాదర్‌ పాడుచేసేడు నిన్ను! కొంత వరకూ ఖాకీ డ్రెస్సు పాడు చేసింది!

కృష్ణ :` ''ఆఖరికి పింతల్లిని తగులుకున్నావు!'' అని ఆ మాటా కూడా అను. భయపడతావేం. అను అంటూ సుందరాన్ని రెచ్చగొడతాడు, చివరకు.

సుందర్‌ :` (విస్కీ సీసా పట్టుకొని సత్యాన్ని చంపటానికి మీదకు వెళతాడు. మిత్రులు ఆపడానికి ప్రయత్నిస్తారు కానీ, సుందర్‌ ఆగడు)

సుందర్‌ :` చంపి తీరతాను అంటూ విస్కీ సీసాతో సత్యం తల పగలగొడతాడు. ఈ విధంగా సుందరం సత్యాన్ని చంపేడు. సత్యం సమాధి చేయబడుతుంది అని చెపుతాడు శాస్త్రిగారు.

తరువాత కథలో మిత్రులు సార్వభౌమారావు గారి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పగా కొడుకు మీద ప్రేమతో వేరొక అభాగ్యుడి మీద నేరం త్రోసివేస్తాడు.

సుశీలతో ఫేక్‌ స్టేటుమెంటు వ్రాయించి, పోలీసులకు ఇస్తాడు.

కానీ సిఐ కిష్టప్పను పిలిచి ఇస్తే కిష్టప్ప ఇలా అంటాడు ''న్యాయం చేయడానికని చెప్పి ఖాకీ బట్టలూ, టోపీ,గీపీ ` మొత్తం యూనిఫాం అంతా తగిలించుకున్నాను. కానీ అదే యూనిఫాంలో దురన్యాయాలు రోజుకు నూటయాభైఐఐఐఐఐ చేస్తున్నాను. అయితే ఇది ఖూనీ కేసు. ఎన్ని ఘోరాలయినా చేయొచ్చు కానీ ఈ ఒక్క ఘోరం చేయకూడదని మా డిపార్ట్‌మెంట్‌లో అన్‌ రిటన్‌ రూలుంది. నేను ఒక అమాయకుడి మీద ఖూనీ నేరం మోపలేను అంటాడు. కానీ కిష్టప్పను బెదిరించి సుందరాన్ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడతాడు.

కోర్టులో వాదప్రతివాదాలు సత్యానికీ, అన్యాయానికీ మధ్య సంఘర్షణాత్మకం గా, ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతాయి. న్యాయవాదులు అన్యాయాన్ని న్యాయంగా ఎలా వాదించగలరో, నిజమైన సత్యం, లాయర్లు అనబడే లైయర్లు చేతిలో ఎట్లా అసత్యంగా నిరూపించబడుతుందో శాస్త్రి గారు. అమాయకుల పక్షాన నిలబడ్డ వారు ఎంత ఘోరంగా, నిర్ధాక్షిణ్యంగా, శిక్షల పాలవుతున్నారో, అనితరసాధ్యమయిన సంభాషణతో డిఫెన్స్‌ లాయరూ, ప్రాసిక్యూటరూ జడ్జి ఎదుట చాలా పకడ్బందీగా ఎవరి వాదన వారు వినిపిస్తారు.

చిట్టచివరి సంభాషణలు చెప్పి ఈ వ్యాసం ముగిస్తాను.

డిఫెన్సు లాయరు : ఈ కేసు గురించి ఇరైవ మూడో తారీఖు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ ముద్దాయి నల్ల చెరువు అవతల వున్నాడా లేక సార్వభౌమరావు గారింట్లో ఉన్నాడా అనేదే ఇందులో ప్రశ్న. ఒక వేళ ఇతడు సార్వభౌమరావు గారింట్లో వున్న పక్షాన సత్యాన్ని మరెవరో ఖూనీ చేసుండాలి.

నేను ఆఖరిసారిగా ముఖ్యంగా తమకి తెలియజేసేదేమంటే ఇందులో ప్రాసిక్యూషన్‌ వారు తెచ్చిన వస్తువుల్లో నేరస్తుడి గుర్తులు ఉండవలసినవీ, ఉన్నవీ లేవు. ఎవరు నేరస్తుడైతే వాడి గుర్తులు సీసా మీద వుండాలి. అవీ లేవు. వాటిని కనిపించకుండా గ్లాసులు మాయం చేశారు. వాటర్‌ బాటిలు పోనేపోయిందన్నారు. ఇందులో సుశీల చెప్పిన సాక్ష్యం నిజమయితే ఈ హత్య సుందరం చేసేడన్నది నిజం. అది నిజమని నా నమ్మకం. కాని వారెవరూ నిజం చెప్పకుండా చేసేరు.

న్యాయాన్నీ, నిజాన్నీ, కాపాడవలసిన వాళ్లూ, బాధ్యత తెలిసిన విద్యార్థులు, నవ యువకులు, అధికార్లు, న్యాయం కోసం, ధర్మం కోసం పాటుపడవలసిన వారు ఈ విధంగా బోనెక్కి అబద్ధం చెప్తే, ఇక సంఘం ఎక్కడ, దేశం ఎక్కడ అంటూ ఆవేశంగా చెప్తాడు.

ఆఖరున జడ్జి తన తీర్పు ఇలా వివరిస్తాడు. తీర్పులో డిఫెన్సు, ప్రాసిక్యూటర్‌ వారి వాదనల్నీ చెప్పి, చివరిగా ''కాబట్టి ఈ ముద్దాయిపై ప్రాసిక్యూషన్‌ వారి ఛార్జి పూర్తిగా రుజువయిందని భావిస్తూ ఇండియన్‌ పీనల్‌కోడ్‌ 302లో చెప్పిన ఖూనీ నేరం, యితను చేసేడని నిశ్చయిస్తూ, ఈ నేరం గురించి యితన్ని కన్‌విక్టు చేస్తున్నాను. ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడానికి తగినంత కారణం కనిపించడం లేదు. కాబట్టి యితనికి మరణ శిక్ష విధిస్తున్నాను''` అని ఛాంబర్‌లోకి వెళ్ళిపోతాడు.

ఆఖరున ముద్దాయికి ఉరిశిక్ష అమలు చేయడానికి ముందు జైలు సూపరింటెండెంట్‌ నీకేదయినా ఆఖరు కోరిక ఉంటే చెప్పు వీలయినదయితే చేస్తాం అంటారు. అందుకు ముద్దాయి చెప్పిన ఆఖరు మాటలు

''సూపరెంటు గారూ! లోకం అంతా నిజం పలకాలనేది నా ఆఖరి కోరిక! కానీ, లోకం అంతటి చేతా మీరెలానూ నిజం పలికించలేదు. అందుచేత ఇక్కడున్న వారు, అరుగో జెయిల్‌ డాక్టరు గారు, మేజస్ట్రేటుగారూ, వీరిద్దరు వార్డనర్లు, కనీసం ఇక్కడ ఉన్న వారంతా, మీమీ జీవితాల్లో ఇక ముందెప్పుడూ నిజానికి నిలబడతామని నాకో చిన్న వాగ్దానం మీకు వీలయిత చేయండి` ఏ ఒక్కరయినా చేయండి. చేస్తే చాలు, నేను హాయిగా ప్రాణం విడుస్తా''

అంతటితో నాటకం ముగుస్తుంది. ఈ నాటకం పేరు నిజం. ఆ నిజం ఈ లోకంలో నిలబడుతుందా! ఎవరయినా నిలబెట్టగలరా! అనే ఆలోచనతో ప్రేక్షకులు ఉండగా తెరపడుతుంది ` శాస్త్రి గారు ఆకాంక్షించిన ఈ నిజం గురించి అందరూ ఆలోచిస్తే, సర్వేజనాస్సుఖినోభవంతు ` ఇది నిజం.

- తాటికొండాల న‌ర‌సింహారావు, 9885787250

Tags:    
Advertisement

Similar News