“అన్నయ్యా...”
“ఏమిట్రా?”
“……..”
“చెప్పు. భయపడతావేం?”
“ఈ సారి మార్కులు చాలా తక్కువొచ్చాయి. ప్రోగ్రెస్ కార్డు గానీ నాన్న చూస్తే చంపేస్తారు.”
“ఎందుకన్ని తక్కువొచ్చాయ్?”
“……..”
“ఇకనుంచీ శ్రద్ధగా చదువుకుంటావా?”
“ఊఁ.”
“సరే, ఆ ప్రోగ్రెస్ కార్డు మీద నాన్న సంతకం నేను చేసేస్తానులే. ఇలాగివ్వు.”
“తరవాత నాన్నకి తెలిస్తే నిన్ను తిడతారేమో...”
ధైర్యం చెప్పాడు అన్నయ్య –
“ఫరవాలేదు"
***
“పరీక్ష ఫీజు కట్టావా?”
“……..”
“చెప్పు. భయపడతావేం?”
“పరీక్ష ఫీజు కోసం నాన్న ఇచ్చిన డబ్బు ఎక్కడో పడిపోయిందన్నయ్యా.”
“నిన్న నిన్ను నేను చౌదరిగారి పొలం వెనుక పేకాట పాక దగ్గర చూశాను. నేను అటువైపు రాగానే, నిన్ను చూడలేదనుకుని పారిపోయావు. చెడు సావాసాలకి మరుగుతున్నావు. చాలా తప్పు.”
“ ఒక్కసారే అన్నయ్యా, ఆ వెంకు బాబు రమ్మంటే వెళ్ళాను.”
“అబద్ధాలు చెప్పకు. ఇప్పుడు మరి పరీక్ష ఏం చేస్తావ్?”
“……..”
“నిన్న ఎరువులు తెమ్మని నాన్న ఇచ్చిన డబ్బు, ఇదిగో... వెళ్ళి, పరీక్ష ఫీజు కట్టెయ్.”
“నాన్నకి ఏం చెబుతావ్?”
“పోయిందని చెబుతాను.”
“నిన్ను తిడతారేమో...”
బాధగా నవ్వాడు అన్నయ్య –
"ఫరవాలేదు"
***
“పొలం అమ్మి వాడి చదువుకి పెడితే, రేపు నువ్వు, నీ కుటుంబం ఎలా బతుకుతార్రా?” అమ్మ ఆరాటం.
“సగమే కదమ్మా అమ్ముతున్నాం. వాడు బాగా చదువుకుని, ప్రయోజకుడైతే, అవసరాలకి మనని ఆదుకోడా?”
“మబ్బులో నీళ్ళు చూసి, ముంత వొలకబోసుకుంటావా?” అమ్మ అభ్యంతరం.
“అంటే? నేను ఏరు దాటి, తెప్ప తగలేస్తాననా?” తమ్ముడి గొంతులో చచ్చేంత రోషం.
“అమ్మా, వాడు నా తమ్ముడు. నాన్న లేక పోయినంత మాత్రాన వాడి చదువు ఆగకూడదు. మన తంటా లేవో మనం పడదాం.”
బాధ్యతగా చెప్పాడు అన్నయ్య,
"ఫరవాలేదు"
***
“తమ్ముడూ, పంట బాగా పండిందన్న భరోసాతో, పెద్ద సంబంధమే ఎత్తుకున్నాను. ఊహించని తుఫానుతో పంటలే కాదు, కొంపకూడా కొట్టుకు పోయింది. అమ్మాయి పెళ్లి ఆగిపోయేలా ఉందిరా, నువ్వే ఏదైనా వీలు చూసుకుని, ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కించాలి.” అన్నయ్య గొంతులో తడి.
“అయ్యో, అంతా విన్నాను గానీ, నాకూ ప్రస్తుతం ఇబ్బందిగానే ఉందన్నయ్యా, వీలైన అప్పులన్నీ చేసి నాలుగు గదుల ఫ్లాట్ కొనటం తప్పై పోయింది! వస్తున్న జీతం ఈ.ఎం.ఐ. లకే చాలటం లేదు. పెద్దాడిని పై చదువుకి పంపటానికి మొన్ననే పాతిక లక్షలు ఖర్చయింది....”
తమ్ముడి కష్టాల లిస్టు ఆగటం లేదు.
“అలాగా. పోన్లే, ఇబ్బంది పడకు. నేనెలాగో అలా సర్దుకుంటాను.”
దైన్యాన్ని గొంతులోనే దాచుకుంటూ చెప్పాడు అన్నయ్య-
"ఫరవాలేదు"
అన్నయ్య మరి!
-పి. వి. ఆర్. శివకుమార్
( ముంబయ్)