పురానా జమానా

Advertisement
Update:2022-11-09 11:42 IST

అలనాటి హైదరబాదున

నవాబు నాటి కట్టడాలలో

సర్కారాఫీసుల చక్కదనాలు

కొలువులు చేసిన తలపులు ఎన్నో

సైకిలు ఎక్కి దూరం తొక్కి

చెమటలు కక్కి దఫ్తర్ జేరి

షెడ్డున గాడి భద్రం పెట్టి

సమయం దాటి లోపలెళ్ళగా

గడియారం గోడను చూసి

న్యాయం చెప్పే పుల్లకలంతో

అటెండెన్సులో ఇంటూ పెట్టి

ఇరాని చాయి గొంతున బోసి

బాబా జర్దా పాన్ బిగించి

కొరకొర చూసే చూపులవతల

ఆ గాంభీర్యం మేకపోతుదే!

వినయంగా సలాము చేయగ

డంగైపోయి ఎర్రగ నవుతూ

అటెండెన్సును ముందుకు తోసి

సంతకాలకి అనుమతించిన

షేరువానుల సూపర్వైజర్

వెతికిన దొరకున ఈనాడు?

* * *

సీటున జేరి పనిచేస్తుంటే

ఉక్కపోతతో చెమటలు కారగ

ఫ్యాను గాలులు బొబ్బలు రేపగ

ఏసీ గీసీ జంతా నై

అప్పుడె వచ్చిన వాటరు బాయి

వట్టివేరుల తడకల మీద

ఆర ఆరగ నీరు జల్లగా

ఫ్యాను గాలులు చల్లబడంగ

ప్రాణం లేచి హాయి గొలుపగా

చకచక పనులు ముందుకుసాగగ

చల్లబరచిన అపర వరుణులు

కంటిన కానరు వెతికిన మళ్ళీ.

* * *

బాధ్యత శాలువ బుజాన పడగా

వైటు పేపరు కార్బను పేపరు

వైటు పేపరు కార్బను పేపరు

మళ్ళీ మళ్ళీ బొత్తులు పెట్టి

టైపు మిషనులో కిర్రున తిప్పి

కట్టెలు కొట్టే బలవంతుడిలా

టిక్కుటిక్కునా చప్పుడు చేస్తూ

బాజా బాదుడు బాదేస్తుంటే

వేళ్ళ నొప్పులు లాగేస్తుంటే

జల్దీ బాబూ జల్దీ బాబూ

అడిగే నాటి హెడ్డు క్లర్కులు

దొరకరు ఏమో మళ్ళీ మళ్ళీ.

కష్టమైన ఆ సత్యపు రోజులు

ఇష్టమైనవి మరువలేముగా.

(1960 ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువ నవాబునాటి సంపన్నుల పాత భవనాలలో ఉండేవి. అప్పటి కాలం ఆ ఉద్యోగాలు తలుచుకుంటూ .....)

-క్రొవ్విడి వెంకట బలరామమూర్తి. (హైదరాబాదు)

Tags:    
Advertisement

Similar News