ప్రేమ తత్త్వం (కవిత)

Advertisement
Update:2022-12-14 12:15 IST

తెలియ లేదు గాని

నూనూగు మీసాలప్పుడే మొలకెత్తింది,

దూరంగా కనుచూపు మేరలో కదిలే

ఆనాటి అమ్మాయిని చేరుకోవాలని

చిరకాలం కొనసాగిన నడక.

క్లాస్‌మేట్‌కు

పుస్తకంలో నెమలీక పెట్టిచ్చినప్పుడు

చెలరేగిన ఉద్వేగపూరిత క్షణాలు!

నిజానికి

అతని మొట్టమొదటి కవిత్వం

ప్రేమ లేఖలే!

పోస్ట్‌మ్యాన్‌ను మించిన ఆత్మీయుడు

ఇప్పటికీ కనిపించడు.

వీధి మలుపులో అతని అడుగులు

స్పందనలకు ప్రతిధ్వనులయ్యేవి.

అతనితో పాటు

ప్రియురాండ్లు కూడా

యవ్వనంలో ప్రవేశించారు.

అమూర్తం కాస్త

స్పష్టాస్పష్ట మూర్తంగా మారింది.

వ్యక్తుల ప్రమేయం కాదు

వారందరూ

ప్రేమ భావనకు ఆలంబనలు మాత్రమే.

క్రమంగా ప్రయాణం

ఒక రూపం దగ్గర ఆగిపోయింది.

కేవలం రూపమేనా అది!

గుండెకూ గొంతుకకూ మధ్య

ప్రసారాలు మొదలయ్యాయి.

అద్దంలో చూసుకుంటే

అతనికతడే కొత్తగా కనిపించాడు.

ఆ యింటి వీధిలో

ఎన్ని సాయంత్రాలు దగ్ధమైనాయో!

ఎడతెగని నిట్టూర్పులు

ఎన్ని రాత్రులను చీలికలు చేశాయో!!

ఉదయమేనా అది!

ఒక అపూర్వ సుందర గోళం

గుండె కింది నుంచి పైకి లేస్తుంది.

విప్లవం ఎరుపెక్కుతున్న రోజుల్లో

ఫైజ్ కవీంద్రుణ్ని వెళ్లి కలవాలనిపించేది

చిత్తం లోతులను తట్టిన

వైరముత్తును పలకరించాలనిపించేది.

విశాఖ సముద్రంలో అలలు

ఇవాళ కూడా అతణ్ని గుర్తు పడతాయి

అరణ్యంలోని పచ్చదనం

ఆకాశంలోని కాంతి వలయం

అన్నీ అతనిలోనే సుడులు తిరిగేవి.

ఒక భావుకత

ఒక మానవత

అన్నీ ప్రేమ ప్రసాదించిన కానుకలే,

సామాజిక జీవిక లోని

చైతన్య జ్వాలికలు

ప్రేమ అల్లిన మాలికలే.

అందుకే అతడు నాకు మిత్రుడు

జ్ఞాపకాల హృదయనేత్రుడు

అతణ్ని కలిసినప్పుడల్లా

ప్రేమను కలిసినట్టుంటుంది నాకు.

- డా౹౹ ఎన్. గోపి

Tags:    
Advertisement

Similar News