కథ చదివితే కనువిప్పు కలగాలి. తెలియని ఒక మేల్కొల్పుకు లోను కావాలి. మానసికావరణంలో నూత్న చైతన్యమేదో ప్రవహించాలి. సరికొత్త మనుషులు పరిచయమైన అనుభవంతో హృదయం పరిమళించాలి. ఇలాంటి మిశ్రమానుభూతులకు లోను చేస్తుంది డాక్టర్ పి. విజయలక్ష్మి పండిట్ కథల సమాహారం. కవయిత్రిగా ప్రసిద్ధి చెందిన ఆమె చక్కటి కథలూ రాస్తుంటారు. ఇది వారి రెండో కథల సంపుటి.
విస్తృత అధ్యయనం, వైవిధ్యమైన జీవనానుభవం కారణంగా విజయలక్ష్మి పండిట్ ఇతివృత్తాలలో భిన్నత్వం గోచరిస్తుంది. ముఖ్యంగా ఆమె సృజించిన పాత్రలు జవజీవాలతో అలరారుతూ మన కళ్ళముందు కదలాడినట్టు ఉంటాయి. అలా పాత్రలకు జీవం పోసే లక్షణం వల్ల ఈ కథల్లోని పాత్రలు గుర్తుండిపోతాయి.
ఈ కథలలో స్త్రీల పాత్రల్ని సృజించిన తీరు అబ్బురం గొల్పుతుంది. నిండైన ఆత్మవిశ్వాసంతో కూడిన స్త్రీల పాత్రల సృష్టి మహిళా పాఠకుల్లో జీవితం మీద ఆశని ఇనుమడిరపజేస్తుంది. వారిలో ఆత్మగౌరవ చైతన్యాన్ని ప్రోది చేస్తుంది. బతుకుయానంలో సమస్యలు ఎదురయితే కుంగిపోకుండా పరిష్కరించుకోడమెలానో తెలుస్తుంది. అలాగే అనేకానేక అనుభవాల సమ్మిశ్రితమైన జీవితాన్ని ఎలా గడపాలో బోధపడుతుంది.
విజయలక్ష్మి పండిట్ గారి స్త్రీల పాత్రలు ఫిర్యాదులు చేయవు. వారి స్త్రీ పాత్రల మధ్య వైమనస్యం లేదు. అర్థం చేసుకోడం, అవగాహన కల్పించుకోడం, చేయూత నందించడం అనే లక్షణాలు బతుకు గమనాన్ని సులభతరం చేస్తాయని ఈ స్త్రీల పాత్రల చిత్రణ చెబుతుంది. ఆడవాళ్ళ మధ్య పరస్పర సహకారం, అవగాహన, సానుకూల దృక్పథం వారి జీవితాల్ని ఎలా మెరుగు పరుస్తాయో ఆకళింపు చేసుకోడానికి ఈ కథలు ఉపయోగపడతాయి. కనుకనే ఈతరం అమ్మాయిలతో ప్రత్యేకంగా ఈ కథలు చదివించాలి. టీవీ సీరియళ్ళలో ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులన్నట్టుగా కుట్రలు, కుతంత్రాలతో కూడిన స్త్రీలను చూపిస్తుంటారు. అందుకు భిన్నంగా ఒకరి పట్ల మరొకరు ఆపేక్ష కలిగిన స్త్రీలు విజయలక్ష్మి గారి కథల్లో కనిపించి మనసుకు హాయి గొల్పుతారు.
ఆమె అనేకం - కథలో మమత, వసుంధర
జీవితమంటే - కథలో అనురాధ, సిరి, జయ
అమ్మ.. విశాలాక్షి లో... విశాలాక్షి, దివ్య
పేగుబంధంలో నీలవేణి
కొండంత అండ అమ్మలో - నలుగురు స్త్రీలు
మీటూ... అమ్మలో పద్మ, రమ
డిప్రెషన్ లో సుమతి, సుధ
మూలాలు కథలో జయంతి, సుజాత
... ఈవిధంగాఈ కథలలో అనేక స్త్రీల పాత్రలు సరికొత్తగా దర్శనమిస్తాయి. సమస్యలు ఎదురయినా, బాధలు పడినా, ఊహించని రీతిన బతుకు తలకిందులయినా తట్టుకొని నిలబడిన స్త్రీలు ఈ కథల్లో కనిపిస్తారు. ఆధునిక జీవితంలోని సంక్లిష్టతల్ని, వైరుధ్యాల్ని ఎదుర్కొంటూ ముందుకు సాగడమెలానో వారి జీవనక్రమంలోని ఒడిదుడుకులు తెలియజేస్తాయి.
పెళ్ళయి ఆర్నెల్లయినా కాకముందే భర్తకు విడాకులు ఇవ్వక తప్పని స్థితిని సిరి ఎలా ధైర్యంగా ఎదుర్కొన్నదో 'జీవితమంటే..' కథలో చూసి విస్తుపోతాం. నేటితరం అమ్మాయిలు చదువుల్లో, ఉద్యోగాల్లో ముందుకు పోవడమే కాదు, అనుకోకుండా తటస్థించే సమస్థల్ని ఆత్మస్థయిర్యంతో ఎదుర్కోగల ధీరవనితలు అనిపించుకుంటున్నారు. ఇందుకు ఈ కథలోని సిరినే ఉదాహరణ.
'డిప్రెషన్' కథలో సుమతి, సుధ రెండూ గొప్ప పాత్రలే. తన జీవితంలో అనూహ్య పరిణామాలతో డిప్రెషన్‌కు లోనైన సుమతి తనని తాను కూడదీసుకొని మరల బతుకును గెల్చుకోవడం ఓ మలుపు అరుతే, లెక్చరర్ అయిన ఆమె తన స్టూడెంట్ సుధలోని డిప్రెషన్‌ని గుర్తించి సరైన దిశానిర్దేశం చేస్తుంది. దాంతో ఆ అమ్మాయి బాగా చదువుకొని లెక్చరర్ అవుతుంది. ఈవిధంగా డిప్రెషన్ తాలూకు గాయాల్నించి బయటపడిన ఇద్దరి కథ ఎందరో మహిళా పాఠకులకు స్ఫూర్తినిస్తుంది.
'అమ్మ... విశాలాక్షి' - తను తల్లయినాక తన తల్లిని ఎంతగా నిర్లక్ష్యం చేసిందో గ్రహించిన దివ్య అంతర్మథనమే ఈ కథ. అన్నిటికీ తనను సమర్థించే నాన్నను చూసి అమ్మ చూపే ప్రేమ, ఆప్యాయతల్ని పట్టించుకోదు దివ్య. పెళ్ళయి, ఒక పాపకు జన్మనిచ్చాక గానీ తల్లి పట్ల తను వ్యవహరించిన తీరు ఎంత బాధ్యతారహితంగా ఉన్నదో గ్రహిస్తుంది. కానీ ఆమె పెళ్ళయిన ఆరు నెలలకే తల్లి చనిపోతుంది. ఒక బిడ్డకు తల్లయినాకనే అమ్మతనంలోని ఔన్నత్యం, గొప్పతనం, తను ఎలా ఉన్నప్పటికీ తనని ప్రేమించిన తల్లి మనసులోని అనురాగం దివ్యకు బోధపడిరది. భర్త ఆనందు ఆమె పశ్చాత్తాపాన్ని గుర్తించి ఆమె తల్లి పేరు విశాలాక్షినే బిడ్డకు పెట్టుకోవడం గొప్ప నిర్ణయం. భర్త చూపే అనునయం, సానుకూల కంఠస్వరంలోంచి పలికిన మాటలతో దివ్య కూతురులో అమ్మను చూసుకోడానికి తపించడం ఈ కథకు చక్కని ముగింపు.
ఈవిధంగా విజయలక్ష్మి పండిట్ కథల్లో స్త్రీల పాత్రల చిత్రణ విలక్షణమైన రీతిలో ఉండి పాఠకుల మనో ప్రపంచం మీద రాగభరితమైన ముద్ర వేస్తాయి. స్త్రీల పాత్రల సృష్టిలోనే కాదు మగవారి పాత్రల చిత్రణలోనూ సంయమనం చూపారు రచయిత్రి. కూతుళ్ళకు సహకరించే నాన్నలు, భార్యల మనసు గ్రహించే భర్తలు, అవసరమైనపుడు అండదండలు అందించే అన్నయ్యలు కనిపిస్తారు ఈ కథల్లో.
మన సమాజం అనేకానేక వైరుధ్యాలమయం. సమస్యలు, సవాళ్ళు, వివక్ష లేకపోలేదు. కానీ మనుషుల మీద ఫిర్యాదులు చేయకుండా, వాస్తవాల్ని గ్రహిస్తూ జీవితాల్ని చక్కదిద్దుకోవడమెలానో ఈ కథలు చెబుతాయి. కథా సంవిధానంలో రచయిత్రి సానుకూల కంఠస్వరం ఈ కథలకు నిండుదనాన్ని ఇచ్చింది. మనుషుల పట్ల సున్నితంగా, సంస్కారవంతంగా వ్యవహరించడమెలానో ఈ కథలు చెబుతాయి. ఆత్మస్థయిర్యంతో తమ జీవితాలని మలచుకోవడమెలానో ఈతరం అమ్మాయిలకు నేర్పుతాయి. ఆడవాళ్ళను మనుషులుగా గుర్తించి మన్ననతో మెలిగే హృదయ సంస్కారాన్ని అబ్బాయిలకు అలవరుస్తాయి. అందుకే ఈ కథల పుస్తకం ప్రతి ఇంటా ఉండాలి. తల్లిదండ్రులు చదవాలి. పిల్లల చేత చదివించాలి.
- గుడిపాటి