అతి సర్వత్ర వర్జయేత్ (కవిత)

Advertisement
Update:2023-10-13 21:45 IST

అప్పుడెప్పుడో

దూరాన రెక్కలు కట్టుకుని

అచ్చంగా ఆప్తమిత్రుడిలాగనో.

మనసుకు దగ్గరయ్యే

నెచ్చెలిలాగనో.

కాసిన్ని కులాసాల కబుర్లతో

గుమ్మంలో వాలిపోయేది

ఉత్తరం పిట్ట

ప్రపంచమిప్పుడు

కుగ్రామమైనవేళ

అభివృద్ధి చెందుతున్న

అంతర్జాల హవాలో

దినదినగండమై

ఊపిరాడని ఒంటరి పిట్టలా

తన జ్ఞాపకాలు వదిలేసి అదృశ్యమయ్యిందది

చరవాణి చెరలోపడ్డ మనిషిప్పుడు

కుచించుకుపోయిన

హృదయ విశాలంతో

అల్లుకోవాల్సిన బంధాల తీగల్ని

నిర్దయగా అల్లంత దూరానికి గిరాటేస్తున్నాడు

అవసరానికి ఉపయోగించాల్సిన సాధనాన్ని

సౌలభ్యం కోసమో

సౌకర్యంగా ఉందనో

శుభోదయం నుండి శుభరాత్రి

చాటింగ్ వరకు

మితిమీరిన కాలాన్ని

కాలక్షేపానికి వెచ్చించి

సర్వకాల సర్వావస్తలయందు

మొబైల్ మాయలాడితో

సాహచర్యం చేస్తున్నాడు

చరవాణి ఒక పద్మవ్యూహం

ఆలోచనలు ఉన్నతమై ఉపయోగించుకుంటే

అన్నివేళలా సహాయకారిగా

అందలం ఎక్కిస్తుంది

విజ్ఞానం ముసుగులో

పెడదోవలు వెతికితే

వినాశకారిగామారి

అథఃపాతాళానికి తొక్కేస్తుంది

బహుపరాక్...

అతి సర్వత్రా వర్జయేత్!

- పూజితా చరణ్

గొల్లలవలస (గ్రామం, పోస్ట్), శ్రీకాకుళం

Tags:    
Advertisement

Similar News