టప్ప్..టప్ప్ మన్న చినుకులు
కాసారంలో నీటిపువ్వులై వికసించి
క్షణకాలం జీవించాయి
ఆకాశం చిల్లుల జల్లెడయ్యింది
వాన జల్లు .వెండి తీగల్లా నేల జారింది
పంటభూమిలో పడ్డ వాన చినుకు
మట్టి సాంగత్యంతో
సుగంధాలువిరజిమ్మింది
మురికి కాలువలో పడ్డ
వాన చినుకు
మురికి సాంగత్యంతో..
దుర్గంధాలు వెదజల్లింది
రంగులేలేని ఆకాశగంగ
భూమికి జేరి
.నేల రంగులో కలిసి పోయి,
నదీనదాలుగా ప్రవహించి
త్రివేణీ సంగమమై..
పుణ్య తీర్థమై...
పాపహారిణియై జనుల
పూజ లందుకుంటోంది
పుట్టుక ఉన్నతమైనా
పతనానికి గాని
ఔన్నత్యా నికి గాని..
సాంగత్య మేకారణం కదా
-పీసపాటి బాలా త్రిపుర సుందరి
(హైదరాబాద్)
Advertisement