'ఇదిగో బిందూ! మనింట్లోకి ఓ కొత్త వస్తువొచ్చింది చూడు. 'ఇంట్లోకి వస్తూనే హుషారుగా పిలిచాడు సురేంద్ర ' 'ఆటపట్టించడానికిదా సమయం? అవతల బోలెడు పనులతో ఛస్తుంటేను... నరేన్ ని స్కూలుకి పంపించడం ఓయజ్ఞం. తర్వాత చిట్టితల్లికి నీళ్లు పొయ్యడం మరో యజ్ఞం...!!
'అందుకు నే సాయం చేస్తాగా అమ్మాయ్...' అంటూ మావగారు మనవరాలిని ఎత్తుకుని హాల్లోకి వచ్చారు.
బిందు సిగ్గుపడిపోయింది.
నిజమే... మావగారి సాయం లేకపోతే ఈమధ్య ఇద్దరు పిల్లలతోనూ తనకి ఏపనీ చెయ్యడమే అవడం లేదు.
అత్తగారు పోయినప్పటినుంచి విరాగిలా మారిపోయిన ఆయన మనవలు వచ్చాక మామూలు మనిషయిపోయారు.
'అయ్యో ఒక్కదానివీ ఎంత అవస్థ పడుతున్నావమ్మాయ్...' అంటూ మనవడికి బూట్లు వేసి పెడతారు.
పాపకి స్నానం. చేయించేటప్పుడు పైనీళ్లు ఆయనే పోస్తారు.
తర్వాత మనవరాలిని ఎత్తుకుని ఆడించడానికి స్నేహితుడింటికి వెళ్లిపోతారు.
తను వంట పూర్తి చేసే సమయానికి 'పాపకి ఆకలేస్తోన్నట్టుంది చూడమ్మాయ్' అంటూ అందిస్తారు. భోజనం చేసి నడుంవాల్చి నిద్రలేచి టీ తాగాక మళ్లీ మనవరాలిని ఎత్తుకుని ఆడిస్తూ మనవడికోసం వీధి అరుగు దగ్గరే కాచుకుని కూర్చుంటారు.
సరేన్ రాగానే పాపని తనకి అందించి వాడికి స్కూలు డ్రెస్ విప్పి, టిఫిను తినిపించి వాడిని ఆడుకోడానికి దగ్గరున్నపార్కుకి తీసికెళ్లిపోతారు. ఇంట్లో తనకి అడసాయం మగసాయం ఆయనే, 'అమ్మాయ్...అదిగో అబ్బాయి తెచ్చిన కొత్త వస్తువు.....
అది ఐప్యాడ్.....
ఆరోజున అంతా దానితోనే సందడి.
అందులో భర్త రికార్డుచేసి చూపిస్తూంటే తమగొంతులు రూపాలు తమకే కొత్తగా వింతగాఅనిపించి మావగారు ఎంత సంబరపడిపోయారో.
భర్త ఆఫీసుకి వెళ్లిపోయాక తను పనిలో పడిపోయింది.
సాయంత్రం ముస్తాబు చేసిన పాపను అందిద్దామని చూస్తే ఎక్కడా కనిపించలేదుమావగారు . భోంచేసాక బహుశా కాలక్షేపానికి ఏ మేష్టారి ఇంటికో వెళ్లుండాలి.
ఆరోజు రాత్రి భర్త గదిలోంచి పెద్ద పెద్ద కేకలు వినబడ్డాయి.
'నాన్నా! నీకెన్నిసార్లు చెప్పాలి నాగదిలో వస్తువులు ముట్టుకోవద్దని... వద్దన్నా నా పుస్తకాలు సర్దుతావ్. మొన్నటికి మొన్న నా షర్టు కనిపించలేదు. 'చలేస్తుందని వేసుకున్నానురా ' అంటావు. నీకు కొత్తది కొనిస్తానంటే వద్దంటావు. ఇవాళపొద్దున్న ఇక్కడే ఉండే ఐప్యాడ్ మాయమయింది. ఏం చేసావు?"
'బుల్లి పలక ముచ్చటగా ఉంటేనూ నానేస్తం పక్కింటి మేష్టారికి చూపించడానికి తీసికెళ్లారా... వాళ్ల మనవడు పాపంచిన్నపిల్లాడు తెలియక ఏవో నొక్కాడు. కాని మామాటలు మొహాలు రికార్డు అవనే లేదు. ఇదిగో తెచ్చాసాలే.'
'కుర్రాడు ఏం పాడు చేసాడో ఏంటో... అయినా ఇది పిల్లల ఆటవస్తువుకాదు
కదా...... '
అంటూ భర్త గట్టిగా మాట్లాడేసరికి ఆయన పాపం అన్నంకూడా తినకుండా ముకుళించుకుపోయి పడుకున్నారు. హిమబిందుకి జాలేసింది.
పాపం కొడుకు కొన్న కొత్త వస్తువుని గొప్పగా సంబరంగా నలుగురికీ చూపించాలన్న ఆత్రంలో చిన్నపిల్లాడు కొత్తబొమ్మని చూపించడానికి ఆత్రపడిన పసిమనసు ఆయనది.
భర్తది చిన్నపిల్లాడి తంతు,తనక్కావలసింది వెంటనే కనిపించకపోతే ఆగమాగంచేసేస్తాడు. మళ్లీ అంతలో నే
చల్లారిపోతాడు.
భర్తవైపు ఆలోచిస్తే అదీ నిజమే...
ముచ్చటపడి జీతంలోంచి వాయిదాలతో కొనుక్కున్న వస్తువది. పాడయితే కష్టం.
అయితే 'ఓ పలకని ముట్టుకుంటే కొడుకు ఏదో అనేసాడని... తనకి ఇంట్లో ఏ వస్తువూ ముట్టుకునే హక్కులేదా?'
మావగారి కనుకొలకుల్లో నీళ్లు...
'ఏంటిది మావయ్యా? మీరు మరీ చిన్నపిల్లాడయిపోతున్నారు ఈ మధ్య... ' అంది ఓదార్పుగా .
అందుకేగా మీ ఆయన అన్ని మాటలు అన్నాడు?" ఉక్రోషం ధ్వనించింది ఆయనమాటల్లో,
'అవును మాఆయనే లెండి. అంతకంటే ముందు మీకు కొడుకేగా!
'మీ ఆయన మీద ఈగ వాలనివ్వవు నువ్వు వాడినే సమర్ధిస్తావులే."
మావగారి మాటలకి మొహం అటు తిప్పుకుని నవ్వుకుంది హిమబిందు.
+++
'ఈమధ్య మీకు చిరాకు ఎక్కువయిపోతోంది."
'ఏంచెయ్యను టార్గెట్లు దగ్గర పడుతున్నాయి.. '
భార్య ఎందుకలా అంటోందో అర్ధమయిన సురేంద్ర గొంతులో పశ్చాత్తాపం,
'చూడండి! మనం వయసులో ఉన్నవాళ్లం. టార్గెట్లు ఉన్నా తట్టుకోగలం. అత్తయ్యపోయినా పాపం మావయ్య మనమీద అభిమానంతో మనవల్ని ఎంతో ప్రాణంగా చూసుకుంటున్నారు. మీకోసం వీధిచివర కాపుకాసి ఇంట్లోకి రాగానే నాకంటెముందే గ్లాసుడు మంచినీళ్లందించే ఆయన్ని చూస్తుంటే మీకెంత రిలీఫ్ గా ఉంటోంది. అవన్నీ మరిచిపోయి.చిన్నపిల్లాడినన్నట్లు ఆయనను అలా కసురుకోవడం నాకు నచ్చలేదు... '
'కానీ అలా గట్టిగా మాట్లాడ్డం వల్ల నా టెన్షనంతా తగ్గిపోయింది తెలుసా...నాన్నకీ ఈ విషయం బాగా తెలుసులే. నా చిన్నప్పుడు ఆయనా అంతే...తన టెన్షన్ తగ్గడానికి మా తాతమీదా అలాగే అరిచేవారు. నీకో రహస్యం చెప్పనా!నాన్న ఇదంతా. మరిచిపోయి రేప్పొద్దున్న నాతో ఎలా మాట్లాడతారో చూడు."
'అయితే ఇదంతా వంశపారంపర్యమన్నమాట. అయితే మీ కొడుకూ ఇలాగే...?'
నవ్వింది బిందు .
'ఒయ్ నాన్నా!'
చిన్నారి నరేష్ గొంతు కోపంగా వినిపించింది.
తాతగారిలా గుమ్మానికడ్డంగా రెండుచేతులూ నడుంమీద వేసుకుని నిలబడ్డ కొడుకుని చూసి ఫక్కున వస్తున్న నవ్వునుబలవంతాన ఆపుకున్నాడు సురేంద్ర.
'అసలు తాతనెందుకు తిట్టావ్? నువ్వు వెరీ బ్యాడ్... తాతకి సారీ చెప్పేదాకా నీతో కటీఫ్.."
అంటూ బుగ్గలు పూరించి గుప్పిళ్లతో గుద్దుకుని పచ్చికొట్టేసి వెళ్లిపోయి తాతగారి పక్కలో దూరిపోయాడు. ఆతర్వాత తాతా మనవడు ముసుగులోపల గుసగుసలాడుకుంటూంటే హిమబిందు ముసిముసిగా నవ్వుకుంది.
వారం తర్వాత ఓరోజున ఉదయమే తండ్రి చేతిలో ఐప్యాడ్ పెట్టాడు సురేంద్ర,
ఆయన భయంగా దానికేసి చూసి 'వద్దురా' అన్నాడు.
'తీసుకో నాన్నా. నిజంగా ఇది ఇవాళ నీ పుట్టినరోజు బహుమతిగా ఇవ్వాలనే కొన్నాను. ఇదిగో ఇందులో ఇవన్నీమీకిష్టమైన భక్తిపాటలు, సుప్రభాతాలు రంగస్థల పద్యాలు.... బాబిగాడికందకుండా భద్రంగా పై రాక్ లో దాచుకో."
ఆయన సంబరంగా పదిలంగా ఐప్యాడ్ ను గుండెకి హత్తుకుంటూంటే దంపతులిద్దరికీ కళ్లలో నీళ్లూరాయి. ఈ కసురుకోవడాలు, పిల్లల కసుర్లలోని అలసటలు తల్లీతండ్రి అర్ధం చేసుకోవడం... మరిచిపోవడాలు...
అలా సాగిపోతూ ఉంటేనే జీవితానికి అర్ధం పరమార్ధమూను.
ఆరాత్రి హిమబిందు తల్లి ఫోన్లో బాధపడింది ...
'బిందూ! అక్కయ్య పురుటిరోజులవడంతో రాలేకపోతున్నానే ...ఇద్దరు పిల్లలతో ఎలా అవస్థ పడుతున్నావో ఏమిటో.. '
'మా మావగారు సొంత కూతురిలా చూసుకుంటున్నారమ్మా. నాకేం కష్టం లేదు. నువ్వు బాధపడకు. 'అంది.
బిందు .
తండ్రిప్రేమకోసం మొహం వాచిపోయిన అక్కయ్యా తనూ ఎంతగా కుమిలిపోయే వారో ? కన్నకూతురిలా తనను గుండెలో పెట్టుకుని కాపాడుతున్న మావగారు తనకి దైవమిచ్చిన నాన్న.
'అమ్మాయ్! పాపాయి గౌను తడిపేసుకుందమ్మా... చలేస్తుందేమో... బట్టలు మార్చు' అంటూ పాపతో గుమ్మంలోకి అడుగుపెడుతున్న మావగారి కంఠస్వరం భారతీయ కుటుంబ సంస్కృతిలోని అపురూప చిత్రంలా అనిపించడంతో బాటు చెవుల్లో అమృతం పోసినట్టయి చెంగున లేడిలా లేచింది హిమబిందు.
- శ్రీమతి పి.వి. శేషారత్నం
( విశాఖపట్టణం)