పాప చేతుల్లో ఉన్నప్పుడు

Advertisement
Update:2023-11-17 16:23 IST

పాప చేతుల్లో ఉన్నప్పుడు

లోకంతో పనే ఉండదు

ఇంకెవరూ కనపడరు

మరెవరూ వినిపించరు

ఆ రెండు చిన్ని కళ్ళు

చాలా మాటలు చెబుతాయి

ఆ కళ్ళు ఎవరి కళ్ళనూ

తిప్పుకోనీయవు

ఎదుటి మనిషిని

ఎటూ కదలనియ్యవు

లోకం మొత్తం ఆ కళ్ళల్లోనే ఉందేమో..

అమ్మానాన్న లేని వాణ్ణి కదా

వాళ్ళ ప్రేమలన్నీ ఆ రెండు చిన్ని కళ్ళల్లోనే వర్షంలా కురుస్తుంటే..

ఎటూ కదల్లేను.

'లతికా...' అని పిలుస్తుంటే

ఏదో తెలిసినట్టు,

అంతా అర్థమైనట్టు

తను నవ్వుతుంది.

కళ్ళనిండా, మొహం నిండా,

చేతుల నిండా నవ్వులే నవ్వులు.

ఆ నవ్వుల ముందు

ఆ దయార్ద్ర చూపుల ముందు

ఆ ప్రేమైక తల్లి ముందు

నేను తాతనే అయ్యానో,

పసిబిడ్డనే అయ్యానో తెలీదు.

విసుగు, అలసట, దుఃఖం

అన్నీ ఆక్షణంలో ఆవిరైపోతాయి.

*

బిడ్డలందరూ తండ్రులైనట్టే తండ్రులందరూ తాతలవుతారు

ఆ తాతలందరూ మళ్ళీ

చిన్న బిడ్డలయ్యేది

మనవడి ముందు,

మనవరాల ముందే కదా!

*

పునర్జన్మలు తెలియవు కానీ,

మా అమ్మ మళ్ళీ అట్లా మా ఇంటికి తిరిగివచ్చినట్టే ఉంది..

ఆ పాప మొహంలోఅదే అమ్మతనం

ఆ పాప మొహంలో అదే దయ, ప్రేమ

ఆ పాప మొహంలో

అదే వాత్సల్యం, కరుణ!

అందుకే మనవరాలు

చేతుల్లో ఉన్నప్పుడు-

మలినాలనన్నీ మాయమైపోతాయి.

పాప చేతుల్లో ఉన్నప్పుడు

మనసు పైన వర్షం కురిసినట్టు

కలతలు దుఃఖాలు బాధలు అన్నీ

ఎటో కొట్టుకుపోయి,

నేను తేలికైపోతాను,

మళ్లీ పసివాడినైపోతాను.

పాప చేతుల్లో ఉన్నప్పుడు

మనం మళ్ళీ పిల్లలమైపోతాం

మనం మళ్ళీ మనుషులైపోతాం!

రోజు మొత్తం బ్రతకలేని వాళ్లు బ్రతకడానికి

రోజంతా తీరిక లేని వాళ్ళు

రోజంతా దిక్కుతోచకుండా

పనిచేసే వాళ్లు,

పరమ రద్దీగా నిరంతరం

ఎటో అటూ కదిలే వాళ్ళు

కాస్త తీరిక చేసుకోవాలి..

రోజులో ఒక్కసారైనా

ఎవరి పాపనైనా సరే

చేతులారా ఎత్తుకోవాలి

ఆ లేత కళ్ళల్లోని తడినిచూడాలి

జీవితం ఎందుకో ఏమిటో ఎట్టానో అప్పుడు కదా తెలుస్తుంది!

అసలు బ్రతుకంటే ఏమిటో

అప్పుడు కదా తెలుస్తుంది!

పాప చేతుల్లో ఉన్నప్పుడే- కదా

మనం మనుషులం!

- పలమనేరు బాలాజీ

Tags:    
Advertisement

Similar News