ఏదో ఒక రోజు
నిన్నటి మరకలన్నీ కడుక్కుని
పరిశుభ్రంగా నిద్రలేవాలి
భుజంపై
దూదిపింజంత బరువుల్లేనట్టు
గాలితో అతితేలికగా అడుగులేయాలి
పూల పరిమళమై వ్యాపించాలి
ముళ్ళను క్షమించి
గాయాలను కడిగేసుకోవాలి
ఆకాశమంత
ఆనందాన్ని ఆహ్వానించి
ప్రకృతిలోని హరితాన్నంతా
హృదయంలోకి ఒంపుకోవాలి
రెక్కలన్నిటినీ విప్పి
పక్షంత స్వేచ్ఛగా
మనసును ఎగరేయాలి
సీతాకోకల సౌకుమార్యాన్ని
తడిమి చూసి
సృష్టిలోని సౌందర్యాన్ని
తనివితీరా తాగాలి
ఆత్మీయుల దరి చేరి
కబురుల కోటలు కట్టాలి
వాయిదా వేస్తున్న పనులన్నీ
పూర్తి చెయ్యాలి
సంతకం పూర్తి చేసాక
నిదుర పొత్తిళ్ళలో
ఒదిగిపోవాలి
సంపూర్ణ జీవితమై
వెలిగిపోవాలి
-పద్మావతి రాంభక్త
(విశాఖ)
Advertisement