అతడూ పిల్లలూ
హోళీ ఆడడానికి వెళ్ళారు
రంగుల్ని వెదజల్లి
ఇంద్రధనుస్సుకే
కొత్త రంగుల్ని
పరిచయం చేస్తూ
నవ్వులను పూయిస్తూ
ఆనందాలను పండిస్తూ
మధ్యాహ్నపు సూర్యుడు
నడినెత్తిన నాట్యమాడుతున్నపుడు
అలసటను భుజాన వేసుకుని
నీరసాన్ని దేహాలకు తగిలించుకుని
అడుగులు వేస్తూ వచ్చారు
ఆకాశం గురించి అడుగుతారేం
అమాయకంగా
ఎప్పట్లాగే ఇంట్లో
పచ్చని పసుపుతో
ఎర్రని కారంతో
ఇల్లు చేరే ఆకలికి
వైద్యం చేయడానికి
ఆయత్తమవుతూ
రంగు వెలిసిన నీడలా
తనదైన
వంటల మంటల లోకంలో తను
- పద్మావతి రాంభక్త
Advertisement