కాస్త మృదువుగా మాట్లాడండి
కనపడని గాయాలతో
ఊహించలేనంత రక్తస్రావంతో
అదృశ్యంగా గిలగిలలాడుతున్న వారితో
కొంచెం సున్నితంగా మెలగండి
రోజులు యుగాలుగా మారి
దినదినగండాలతో బాధింపబడుతున్న
మనఃశరీరాలను
శోధిస్తున్న జవాబుల్లేని బ్రతుకు ప్రశ్నలతో
సతమతమవుతూ
నడవలేనితనంతో ఉన్న
కుంగిన పొద్దులను
మీ మాటల లేపనంతో
నిటారుగా నిలబెట్టండి
వేవేల ఎడారులను
దాటిన జీవితమంత అలసటతో
ఎండి నెర్రెలు విచ్చిన గుండెపై
తొలకరిలా కురిసిపొండి
తుపానులను
ఒంటరిగా ఎదిరించి
భవిష్యత్ లోయల్లోకి
భయంగా తొంగి చూస్తున్న
వెన్నులను నిమిరి
వెన్నుదన్నుగా ధైర్యరసాన్ని తాగించండి
మునివేళ్ళనదులై పారే
ఈ మౌన ప్రపంచంలో ఇమడలేకున్నారు
గాజుతెరల సావాసంతో
గోడలు కడుతున్న
ఈ నిశ్శబ్దసమూహ సముద్రాలను
ఈదలేకున్నారు
దయచేసి ఆపద్బాంధవులై ఆదుకోండి
మీ అపరిమిత స్వరతంత్రుల నిధులతో
వారి ఖాళీసంచులను నింపండి
సుతిమెత్తని మాటల మంత్రికులై
చీకటి రాత్రులను
వెన్నెలతో వెలిగించండి
మబ్బులు కమ్మిన
పగటి ఆకాశాలను
సూర్యుళ్ళై పలకరించండి
వెన్నలో ముంచిన పలుకులను
చినుకుల్లా చిలకరించండి
మానవవనాలలో
ప్రాణశ్వాసను నింపి
మెరుపురంగులను ఒంపి
సమాజపుతోటను
పరిమళభరితం చెయ్యండి
అలలు
రాళ్ళను నునుపు చేసినట్టు
మరింత మృదుమధురంగా పలకండి
దయచేసి
మరికాస్త మృదువుగా మాట్లాడండి
-పద్మావతి రాంభక్త