చిన్ని చిన్ని ఆశ (కథానిక)

Advertisement
Update:2023-01-11 12:10 IST

సరిగ్గా రాత్రి పదైంది. అప్పుడే నా కోడలు శైలజ చెప్పులు విడిచి హుషారుగా ఏదో కూనిరాగం తీస్తూ ఇంట్లోకివచ్చింది. ముఖంలో ఆనందం దాచాలన్నా దాగనంతగా పొంగి పొరలుతోంది. ఆ వెనుకే నా కొడుకు కూడావచ్చాడు. తన మనసు తెలిసిన దాన్ని కాబట్టి ఆ సమయంలో కూడా... “కాఫీ కలపనా శైలూ"అడిగాను. "ఇవ్వండి అత్తయ్యా, అర్ధరాత్రి లేపి ఇచ్చినా మీ చేతి కాఫీవద్దని మాత్రం అనను” అంది నవ్వుతూ.

నేను కాఫీ కలుపుతుంటే వెనకాలే తనూ వంటింట్లోకి వచ్చి “పార్టీ ఎంత బాగా జరిగిందో అత్తయ్యా. మీరు రమ్మంటే రానన్నారు, కానీ వస్తే మరీ బావుండేది” అంది.

'అంతా నీ వయసువాళ్లే కదా, వాళ్ల మధ్యన నేనెందుకు. నాకేం తోచదు కదా, అందుకే రాలేదు శైలూ" అన్నాను. ఆ వేడుక చూడాలని నాకు మనసులో పీకుతున్నా కావాలనే వెళ్లలేదు. అదొక రకమైన చెప్పలేని సన్నని బాధ నా మనసులో కదులుతోంది.

అలాగని అది ఈర్ష్య మాత్రం కానే కాదు. జీవితంలో కొన్ని అతి చిన్న సరదాలే తీరని కోరికలై మనసును మెలిపెడుతూ ఉంటాయి. అవి వివరించి చెప్పినా చాలామందికి అర్థం కావు సరికదా

చెప్పిన వారిని వింతగా చూడడం నాకు అనుభవమే.

ఇవాళ శైలజ పుట్టినరోజు. పొద్దున్న తను లేచిన దగ్గర నుండీ ఇంట్లో ఒకటే హడావిడి. తను తలంటుకుని రాగానే నేను పాయసం చేసి తన చేతికి అందించాను. తను ఆ

గాజుగిన్నె నా చేతిలోనే పెట్టి 'మీరే తినిపించండి' అంటూగారంగా నోరు తెరిచింది. తినిపించగానే నా కాళ్లకు దండంపెట్టింది. నేను ఆశీర్వదించి తనకోసం చేసిన తనకిష్టమైన

నిమ్మకాయ పులిహోర, సెనగపప్పు వడలూ బాక్స్ లో సర్ది ఇచ్చాను. అవి పట్టుకుని ఆఫీస్ కు బయలుదేరి పోయింది.

నా కొడుకు కొన్న ఎర్ర అంచుతో ఉన్న బంతిపువ్వు రంగుచీర కట్టుకుని, మ్యాచింగ్ దుద్దులు పెట్టుకుని చక్కగాఅలంకరించుకుని వెళ్లింది. అలా తనని చూస్తుంటే ఎంత

ముచ్చటగా అనిపించిందో. పనంతా అయి సోఫాలోకూలబడ్డాక, ఒక్క ఉదుటున ఆలోచనలు మనసంతా

ముసురుకుని గతంలోకి పరుగులు తీశాయి.

***

'బారెడు పొద్దెక్కుతోంది వసుధా లేవవే. ఆడపిల్లలు ఇంత సేపు పడుకుంటే ఇంటికి అరిష్టం' అంటూ అమ్మ పొద్దున్నే తన చాటభారతం మొదలు పెట్టింది. అప్పుడే సరిగ్గా గడియారం ఠంగ్ ఠంగ్ మంటూ ఆరుకొట్టింది.

'ఆడపిల్లలు... 'అంటూ అమ్మ అన్నమాట పదే పదే చెవిలో మారుమోగుతుంటే... అంటే తమ్ముడు ఆలస్యంగా లేవచ్చన్నమాట అని మనసులో అనుకున్నాను.

ఆ మాట బయటకు అంటే ఏం జరుగుతుందో నాకు తెలియంది కాదు. చిన్న చిన్న విషయాలకు రెట్టించినందుకే 'ఆడపిల్లకి

అంత పొగరు పనికిరాదు. ఏమిటలా ప్రతిదానికీ వాదిస్తావు,

చిన్నంతరం పెద్దంతరం లేకుండా... అయినా మీ అమ్మ పెంపకం అలా తగలబడింది' అంటూ అమ్మని

సాధించడానికి ఒక కారణం భూతద్దం వేసి మరీ వెతుకుతూ విరుచుకుపడుతుంది నాయనమ్మ. ఆవిడకి తమ్ముడొక్కడే మనిషిలా ఆనతాడు. ఇంట్లో ఏది వండినా

ముందు వాడికోసం తీసి పక్కన పెట్టాల్సిందే, లేకపోతే ఆవిడ ఊరుకోదు. నాకు నచ్చిన కూర మరికొంత కావాలని పేచీ పెట్టినా పెట్టరు. అదే వాడు అడిగితే మాత్రం మా కంచాలలోంచి తీసి మరీ వాడికి ఇచ్చేస్తారు.

'ఆడపిల్లగాపుట్టనే పుట్టకూడదసలు' అని ఎన్నిసార్లు నాలో నేను అనుకుని బాధపడ్డానో లెక్కలేదు. ఇంట్లో వాళ్లు కథలు కథలుగా నా పుట్టుక గురించి

చెప్పుకుంటుంటే నా మనసులో అదంతా అలా బలంగా

పాతుకుపోయింది.

ఐదుగురు ఆడపిల్లల తరువాత ఎన్నో

ఏళ్లకి అమ్మకు మళ్లీ కానుపు వచ్చింది. అమ్మ

తీయించేసుకుందామనుకుంటూనే, ఈసారి మగపిల్లాడు

పుడతాడేమో అనే చిన్న ఆశతో ఉంచేసుకుంది. ఆమెకు

నాయనమ్మా నాన్నతో పాటూ ప్రపంచం సమస్తమూ

వంతపాడింది. కానీ నా పుట్టుకతో వాళ్లందరి ఆశా కొండెక్కి

పోయింది. పురుడు జరిగిన ఇంట్లోంచి వచ్చిన శోకాలు

చూసి అందరూ ఏమైందో అని కంగారుపడ్డారు. తీరా చూశాక 'ఓహ్ మళ్లీ ఆడపిల్లా' అని పెదవి విరిచిన వాళ్లు చుట్టూ చేరినప్పుడు అందరికీ బాధ మరింత ఎక్కువైంది.

నాయనమ్మ బాలింత అయిన అమ్మకి సరిగ్గా తిండి కూడా

పెట్టలేదు సరికదా మళ్లీ ఆడపిల్లని కన్నందుకు అమ్మని సూటిపోటి మాటలతో కుళ్లబొడిచింది. ఇక నాన్న సరేసరి.నన్ను చూడటానికి కూడా రాలేదు.

చివరికి ఒక పెద్దాయన 'మరోసారి చూడండి, ఈసారి తప్పక మగపిల్లాడు పుడతాడు' అని ధైర్యం చెప్పేసరికి కాస్త కుదుటపడ్డారు. అప్పుడు కూడా మరో ఆడపిల్ల పుడితే ఏం చేసేవారో మరి. కానీ వారి ఆకాంక్షకు తగ్గట్టు, ఆయన దీవించినట్లే మరో రెండేళ్లకు తమ్ముడు పుట్టడంతో అందరు అందరూ పరమానంద పడిపోయారు.

బడికి వెళ్లడం మొదలు పెట్టాక, రెండవ తరగతికి రాగానే అనుకుంటా- నాలో ఆ చిన్న సరదా మొదలైంది. ఆరోజు ఉత్సాహంగా ఇంటికి రాగానే మొదట నాకు నాయనమ్మ కనబడింది. అంతే... ఆలస్యం చెయ్యకుండా నాయనమ్మకు నా కోరిక చెప్పాను. విన్న వెంటనే నాయనమ్మ 'అదొక్కటే

తక్కువ... చాల్లే సంబడం' అని ఒక్కసారిగా కసిరి పారేసింది. అమ్మకి అంత స్వాతంత్ర్యం లేదని తెలియని వయసు నాది. కాబట్టి ఆమె దగ్గర కూడా నా కోరిక వెల్లడించి జవాబు కోసం ఎదురుచూశాను.

ఆవిడ నావైపుఒకమారు నిర్లిప్తంగా చూసి మౌనంగా ఊరుకుంది.

నాతోపాటూ చదువుకునే అందరి ఇళ్లలో ఒకరిద్దరే పిల్లలు కావడం వల్లో ఏమో మరి, వాళ్లు ఆడింది ఆటగా పాడి పాటగా కొనసాగేది. పుట్టినరోజున వాళ్లు మంచిగా అలంకరించుకుని కొత్త బట్టలు వేసుకుని స్వీట్లూ చాక్లెట్లూ పంచుతుంటే నేను అంతలేసి కళ్లేసుకుని చూస్తూ ఉండేదాన్ని. అలాగే ఆరోజు టీచర్లూ హెడ్ మాస్టర్ తో సహా వాళ్లని ప్రత్యేకంగా చూడడం నా దృష్టిని దాటిపోలేదు.

అదిమి పెట్టుకున్న ఆ కోరిక కాస్తకాస్తగా పెద్దవుతూ ఉంటుండగానే నేను పెద్దమనిషినయ్యాను. నా శరీరంలో వస్తున్న మార్పులు నాకు తెలియడం మొదలైంది. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాననే ఊహ నాలో ధైర్యం పెంచి ఈసారి నాన్న దగ్గర నా కోరికను మరోమారు వ్యక్తపరిచేలా చేసింది.

వినగానే నాన్న ముఖం చిట్లించి... 'రెక్కలు ముక్కలు చేసుకుని ఇంతలావు సంసారాన్ని ఒక్కడినే నడుపుకుని వస్తున్నాననే

జ్ఞానం ఒక్కరికీ లేదు. చచ్చీ చెడీ ముప్పొద్దులా మేపి చదువు కూడా చెప్పిస్తున్నాను. ఇవి చాలక పుట్టినరోజులు కూడా చెయ్యాలా నీ ముఖానికి. నా ప్రాణాలు జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు ఈ ఆడమందకి ఇంకా పెళ్లిళ్లు కూడా చేసి చావాలి...' అని అరుస్తూ నామీద విరుచుకుపడ్డారు. నాన్న కోపంతో బయటకు విసురుగా వెళ్లిపోగానే 'నాన్నను పీక్కుతింటున్నామంటూ'

నామీదా అమ్మ మీదా కారాలూ మిరియాలూ నూరడం మొదలు పెట్టింది నాయనమ్మ. నా మనసు గట్టిగా దెబ్బతింది అక్కడే. ఇక ఆ తరవాత ఎప్పుడూ నా

పుట్టినరోజు చెయ్యమని ఎవరినీ అడగలేదు. అలాగని ఆ కోరిక కూడా నాలో చల్లబడలేదు.

కాలేజీలో చేరాక అతి తక్కువ మందితో నా స్నేహం కొనసాగింది. వాళ్లతో సైతం నా కోరిక విషయం ఏనాడూ పంచుకోలేక పోయాను.

నా వింత కోరిక విని చులకనగా నవ్వుతారేమో అన్న భయం నన్ను వెంటాడేది.

'అయినా ప్రతి మనిషి పుట్టుకా అపురూపమే కదా. మరి ఆ పుట్టుకనీ, లోకంలోకి అడుగు పెట్టిన రోజునీ మనకున్న చిన్న పరిధిలో ఒక ఉత్సవంగా జరుపుకోవడం తప్పెలా అవుతుందో నాకు అర్ధం కాదు.

చెట్టుమీద గూడు కట్టిన పిట్టలను చూడటం నాకొక సరదా !

అవి తాము కన్న చిట్టి పిట్టల బుజ్జినోళ్లలో వేళకు ఆహారం పెట్టి ఎంత చక్కగా పెంచుకుంటాయి! వాటికి ఎగరడం వచ్చేవరకూ తమ రెక్కలను అడ్డు పెట్టి ఎంత బాగా

కాపాడతాయి! మనుషులకే ఆడామగా తేడాలూ, ఈ వ్యత్యాసాలన్నీ. కుక్కా పిల్లీ ఆవూ... ఇవేవీ తమబిడ్డ ఆడో మగో పట్టించుకోకుండా అన్నిటికీ ప్రేమగా పాలిచ్చి పెంచుతాయి. మనుషులే ఆడపిల్లల్ని కన్నాక వివిధ కారణాలతో కుప్పతొట్లో పారేయడమో లేదా కడుపులో ఉండగానే చంపేయడమో చేస్తున్నారు. సృష్టిలో ఆలోచించగల సామర్ధ్యమున్న జీవులు ఒక్క మానవులే

కదా. కానీ వారే ఇటువంటి అమానుష కృత్యాలకు పాల్పడతా రెందుకు. ఎంతగా ప్రపంచం ముందడుగు వేస్తున్నా స్త్రీ వివక్షను ఎదుర్కోక తప్పట్లేదు కదా. ఉద్యోగాలు చేస్తున్నా ఊళ్లేలుతున్నా ఎంతమంది ఆడవాళ్లు వారి వారి జీవితాలలో ఆనందంగా ఉంటున్నారో అని లెక్కలేస్తే ఇప్పటికీ ఉలికిపడాల్సిన పరిస్థితే ఉంది మనసమాజంలో."

సమయం దొరికినప్పుడు ఏకాంతంలో నా ఆలోచనలు అంతూ పొంతూ లేకుండా ఇలా సాగిపోతూనే ఉంటాయి.

ఒకరోజు నన్ను అంటి పెట్టుకుని తిరిగే నా స్నేహితురాలు వాణి “వసుధా, చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. అంతవరకూ ఉత్సాహంగా ఉన్న నువ్వు ఎవరిదైనా పుట్టినరోజు వస్తే చాలు డల్ అయిపోతున్నావని నాకు అనిపిస్తుంది. నా పరిశీలన నిజమే కదా" అని అడిగింది.

నేను తన ప్రశ్నకు ఉలిక్కిపడి తల దించుకున్నాను కానీ జవాబు మాత్రం చెప్పలేదు. నాకు జవాబు చెప్పడం ఇష్టం లేదనుకుందో ఏమో కానీ వాణి కూడా మరిక రెట్టించలేదు. నాకు నచ్చని విషయం ఎవరైనా ఎత్తితే నేను మౌనంగా ఉండిపోతానని వాణికి స్పష్టంగా తెలుసు. అన్నీ గుట్టుగా లోపలే దాచుకుని, మనసులోని విషయాలేవీ బయటకు చెప్పని నాలాంటి ఇంట్రావర్ట్ ని కాసైనా ఎవరైనా చదవగలిగారంటే అది వాణి మాత్రమే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే తన దగ్గరే నేను కాస్త నోరు విప్పిమాట్లాడగలిగేది. ఇంట్లో వాతావరణం వల్లే నేనిలా మౌననదిలా మారానేమో కూడా నాకే తెలియదు.



నా పద్దెనిమిదవ పుట్టినరోజు వద్దన్నా ఆ రోజు నన్ను పలకరించింది. నా అదృష్టం కొద్దీ నా పుట్టినరోజు వేసవి

సెలవుల్లో రావడం వల్ల నన్ను ఎవరూ ఆరోజు చాక్లెట్లు ఇవ్వలేదని అడగరు. నేను ఆ రోజున తలస్నానం మాత్రం చేయడం మరువను. మామూలుగా నాకు ప్రతీ శుక్రవారం తల రుద్దుకోవడం అలవాటు.

తమ్ముడు ఆశ్చర్యంగా “ఏమిటివాళ శుక్రవారమా? " అన్నాడు నా తలకి చుట్టుకున్న తువ్వాలు చూస్తూ.

“కాదులే, ఎందుకో చిరాకుగా ఉంటే తలస్నానం చేశాను”అన్నాను.

'నా పుట్టినరోజు అని చెప్పడం, ఎవరైనా ఒక పుల్లవిరుపు

మాటంటే బాధపడటం, ఇదంతా ఎందుకు' అని నేను

గప్ చుప్ గా ఊరుకున్నాను. చిన్నప్పటి నుండీ ఎదురైన

చేదు అనుభవాలు నాకు అంతలా గుర్తుండిపోయాయి

మరి. సాయంకాలం పుస్తకమేదో చదువుకుంటుంటే సుడిగాలిలా మా ఇంటికి వాణి వచ్చింది.

వచ్చీ రాగానే “పద బయలుదేరు. మా ఇంటికి ఒకసారి అర్జంటుగా రావాలి నువ్వు" అంది.

అప్పుడే లోపలకు వస్తున్న నాన్నతో... “ఒకసారి మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకువెళ్తాను బాబాయ్ గారూ.మళ్లీ ఒక అరగంటలో పువ్వుల్లో పెట్టి మీకు అప్పచెబుతాను” అంది.

అసలు ఎక్కడికీ పంపని నాన్న ఏ కళనున్నారో సరేనంటూ

తలాడించారు. మా ఇల్లు వాళ్లింటికి ఐదు నిమిషాల దూరం మాత్రమే. వాణి వాళ్లింటికి వెళ్లేసరికి వాళ్లింట్లో

ఎవరూ లేరు, తనూ చెల్లాయి తప్ప. వాళ్ల అమ్మానాన్నా ఏదో పెళ్లికి వెళ్లారట. హాల్లో టీపాయ్ మీద ఒక చిన్న కేక్ ఉండడం నన్ను ఆశ్చర్యపరిచింది.

తను నన్ను చూసి నవ్వి... “నువ్వు చెప్పకపోతే నాకు తెలియదనుకున్నావా దొంగా... ఇవాళ నీ పుట్టినరోజని నా

పాకెట్ మనీతో ఇలా అరేంజ్ చేశాను. లక్కీగా అమ్మానాన్నా పెళ్లికి వెళ్లడం కూడా కలిసొచ్చిందోయ్....

లేకపోతే వాళ్లేమనుకుంటారో అని లోపల్లోపల నువ్వు

గింజుకుపోతావు కదా వసూ” అంది నా బుగ్గ గిల్లుతూ.అయోమయంగా చూస్తున్న నాకు దాని మాటలకు ఒక్కసారిగా కన్నీళ్లోచ్చాయి.

"పిచ్చీ, పుట్టినరోజునాడు ఏడవకూడదు... రా కేక్ కట్

చేద్దువుగానీ” అంటూ అగ్గి పెట్టె కోసం లోపలకు వెళ్లింది.

వాణీ వాళ్ల చెల్లి “హ్యాపీ బర్త్ డే టూ యూ” అంటూ నా చేతులు పట్టుకుని ఊపుతూ నవ్వుతోంది.

ఉన్నట్టుండి అప్పుడే మా తమ్ముడు లోపలకు వచ్చాడు. చూసి ఆశ్యర్యపోయి “ఇవాళ నీ పుట్టినరోజా అయితే" అన్నాడు. నేను బిక్కచచ్చిపోయాను.

వాడే మళ్లీ “నాన్న నిన్ను అర్జంటుగా వెంటబెట్టుకు రమ్మన్నారు పదా” అంటూ నా చెయ్యి పట్టుకుని బయటకు లాక్కుపోయాడు. వాణి వైపు నిస్సహాయంగా చూస్తూ వాడి

వెంట నడిచాను నేను.

ఇంటికి వెళ్లేసరికి ఎవరో అతిధులు హాల్లో కూర్చుని ఉన్నారు.

నాన్న “మా అమ్మాయి వసుధ" అని వాళ్లకు చెప్పి,

“వసుధా లోపలికి వెళ్లి కాఫీ కలిపి తీసుకురా” అంటూ

నాకు పురమాయించారు. అంత అర్జంటుగా నన్నుఎందుకు పిలిచారో నాకు అర్థం కాలేదు. అమ్మా

నాయనమ్మా అందరూ వాళ్లతో ఏవో మాట్లాడుతున్నారు.

నేను కాఫీ కప్పులు ట్రేతో తీసుకెళ్లి వాళ్లకి అందిస్తుంటే

ఒకతను నన్ను తదేకంగా చూసి, పక్కనున్న ఆవిడ వైపు

చూస్తూ తలాడిస్తున్నాడు. నాకు హఠాత్తుగా బుర్రలో లైటు

వెలిగింది. పదిహేను రోజుల తరువాత రావలసిన వాళ్లు

అనుకోకుండా ఇటు పనుండి వచ్చారని నాన్న అమ్మతో

అంటుంటే విన్నాను.

ఇక వాళ్లు వెళ్లిపోగానే తమ్ముడు సరదాగానే “ఇవాళ అక్క

పుట్టినరోజును వాణీ అక్క జరిపుతోందోచ్ " అన్నాడు.

అంతే, ఇంట్లో అగ్నిపర్వతం బద్దలైంది. అందరూ నామీద

విరుచుకుపడ్డారు.

“అంటే ఏమిటీ... మేము పుట్టినరోజు చెయ్యలేని దరిద్రులమని అక్కడకు వెళ్లి దేబిరిస్తున్నావా. ఛీ, చచ్చేలా

కష్టపడి ఏ లోటూ లేకుండా కుటుంబాన్ని లాక్కొస్తున్నా

ఇలా అవమానిస్తావా...” అంటూ నాన్న చిందులు తొక్కారు. నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను.

నేను ఏం చెప్పినా అక్కడ చెల్లదని నాకు తెలుసు. ఇదంతా

ఊహించని తమ్ముడు చల్లగా ఇంట్లోంచి బయటకు

జారుకున్నాడు. వాడిదీ తప్పని నాకు అనిపించలేదు. నాలో ఏ భావమూ లేదు. ఎవరి పట్లా కోపమూ లేదు కానీ పాపం వాణి ఎంత ప్లాన్ చేసింది, దాని ప్రయత్నం వృధా

అయిపోయిందే అని బాధేసింది.

ఇక ఆరోజు నుండీ నేను అడుగు బయట పెట్టలేదు ఆరోజు నన్ను చూసుకుని వెళ్లిన అతడితో రెండు నెలల్లో నా పెళ్లి జరిగిపోయింది. నాకిష్టమో లేదో కూడా కనుక్కునే

ప్రయత్నం కూడా ఎవరూచెయ్యలేదు.


ఎవరో బయట బెల్

కొట్టడంతో వెళ్లి తలుపు తీశాను. నా కొడుకూ, కోడలూ, తమ్ముడూ, మరదలూ, వాణీ, వాళ్లాయనా ఇంకొంత మంది స్నేహితులూ బిలబిలా లోపలికి వచ్చి...

“పుట్టినరోజు జేజేలు...” అంటూ పాట పాడుతూ నాచుట్టూ చేరి నాకు పూలగుత్తులు అందించి నన్ను సోఫాలోకూర్చోబెట్టారు. నాకు నోట మాట రాలేదు.

“ఏమిటిదంతా... ఎవరు...చేసారిదంతా ” అని నేను ఏదోఅనబోయాను.

“ఇదంతా నీ కోడలు ప్లాన్ తల్లీ. నీ అరవయ్యవ పుట్టినరోజు ఘనంగా జరపాలని తను నాలుగు నెలల

ముందునుంచే మా అందరినీ కూడగడుతోంది” అంది వాణి. 'నాకు తెలియకుండా ఎలా చేసిందబ్బా' అని ఒకపక్క నేనుఆశ్చర్యపోతుంటే...

"అక్కా నన్ను క్షమించు. ఆరోజు నీ పుట్టినరోజు నాడు నీకు చివాట్లు పెట్టించాను. అప్పుడు నేనూ చిన్నవాడిని కదా. నోటిని అదుపులో పెట్టుకోలేక నాన్న దగ్అనవసరంగా అలా వాగేశాను. అలా చెయ్యకుండా

ఉండాల్సిందని ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటాను" అన్నాడు తమ్ముడు.

వాడిని దగ్గరకు తీసుకుని... “నేను అది అప్పుడే మరిచిపోయాను లేరా” అన్నాను.

“చూశారా వదినా, మీ కోడలు తను వచ్చిన సంవత్సరంలోపే మీ మనసు ఎంత చక్కగా కని పెట్టి ఇదంతా ఎలా ప్లాన్ చేసిందో. మా మట్టి బుర్రలకు

ఇన్నాళ్లూ ఇలా చేయాలని తట్టనే లేదు” అంది మరదలు.

“అందరికీ టిఫిన్లు బయట నుండి ఆర్డర్ చేసేశాను. అత్తయ్యా మీరు ఈ పట్టుచీర కట్టుకుని రండి.

జాకెట్టు కూడా మీ ఆది ఇచ్చి ముందే కుట్టించేశాను” అంటూ నా

చేతికి ఒక ప్యాకెట్ అందించింది శైలు. ప్యాకెట్ తెరిస్తే నాకు నచ్చిన నెమలికంఠం రంగు పట్టుచీరతో పాటూ డెరెక్ట్ బి.ఏ. కి అప్లై చేయడానికి నింపిన దరఖాస్తు కూడా ఉంది. నాకు చదువుకోవడం ఇష్టమని తెలుసుకుని నా

కోడలు నాచేత దరఖాస్తు చేయిస్తోందని అర్థమైంది.

కాగితాలు చేత్తో పట్టుకుని శైలూ వైపు చూస్తే తను నావైపు చూస్తూ నవ్వుతోంది.

“సాయంత్రం నీ పుట్టినరోజు పార్టీ హోటల్ లో అరేంజ్

చేసింది వసుధా నీ కోడలు. అప్పటి కోసం మరో కొత్త చీర సిద్ధం చేసిందిలే” అంది వాణి.

నా మనసు సంతోషంతో చిన్నపిల్లలా గంతులు వేసింది.

ఆనందబాష్పాలతో శైలును గట్టిగా కౌగిలించుకున్నాను. నా

కొడుకు “అమ్మా నన్ను పట్టించుకోవడం మానేశావు

నువ్వు... కోడలు పార్టీలో చేరి” అంటుంటే అందరూ ఒకటే

నవ్వులు... మరోవైపు నా హృదయాన్ని తడిపేస్తూ

ఆనందాల జల్లులు...

పద్మావతి రాంభక్త

Tags:    
Advertisement

Similar News