పాచి టపాకాయ (జ్ఞాపకాల పందిరి) -బుద్ధవరపు కామేశ్వరరావు (హైదరాబాద్)

Advertisement
Update:2022-10-23 12:37 IST

దసరా శెలవులు అయిపోయాయి. ఈసురోమంటూ పుస్తకాలు ఉన్న కాఖీ రంగు గుడ్డసంచీలు భుజాన తగిలించుకుని బడికి బయలుదేరాము మా అన్నదమ్ములు ఆరుగురం, మనకు ఈ చదువులు ఎప్పుడు అయిపోతాయి? ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయిరా భగవంతుడా అని మనసులో అనుకుంటూ.

ఓ వారం రోజుల తరువాత...

ఆ రోజు ఆదివారం.

పొద్దున్నే అమ్మ పెట్టిన తరవాణి అన్నం, బెల్లపావకాయతో నంజుకుంటూ తినేసి, మా వీధి చివర్లో ఉన్న మా కొత్తదొడ్డి లోకి ఆడుకోవడానికి బయలుదేరాము. ఈలోగా

"ఈరోజు నుంచి నాకు తెలియకుండా ఎక్కడకీ వెళ్లకండి. అంతే కాదు, రేపటి నుండి బడి నుంచి రాగానే నేను చెప్పిన పనులు చేయాలి. అర్ధమయ్యిందా? పదండి లోపలికి" వీధి గుమ్మం వద్ధే అటకాయించి, మమ్మల్ని లోపలికి తోలారు నాన్నగారు.

"హూ..ఈ పెద్దోళ్లున్నారే, కుళ్లుమోతోళ్లు. వాళ్లు ఆడుకోరు, మమ్మల్ని ఆడుకోనీరు" అనుకుంటూ లోపలికి వచ్చాను.

కాసేపటికి ఓ పాత న్యూస్ పేపర్ల కట్ట, కొన్ని పుస్తకాలు తీసుకొచ్చిమా ముందు పడేసారు నాన్న గారు. పరిస్థితి అర్ధమైన నేను,

"ఈ రోజు శెలవు ఇచ్చింది ఆడుకోవడానికి, అంతే తప్ప ఇవి చదవడానికి కాదు" అన్నాను ధైర్యంగా, ఆ పుస్తకాల మేట వైపు భయం భయంగా చూస్తూ.

"ఏడిసావులే, డిప్పకాయ్ వెధవా! ఇదిగో ఈ పేపర్లని ఇలా ఈ రూళ్లకర్ర పెట్టి, ఇదిగో ఈ సైజులో కట్ చెయ్యండి" అంటూ ఓ నాలుగు రూళ్లకర్రలు, సైజు కోసం, కటింగ్ చేసిన ఓ నాలుగు కాగితాలు పడేసి వెళ్లి పోయారు నాన్న గారు.

"కత్తిరించిన ఈ కాగితాలు ఏం చేస్తారంటావురా?" అనుమానం వ్యక్తం చేసాడు నా పైవాడు, బేబన్నయ్య.

"బహుశా ఇల్లంతా అంటిస్తారేమోరా?" సమాధానం చెప్పాను.

ఈలోగా మా సంభాషణలు విని అక్కడికి వచ్చిన మా పెద్దన్నయ్య

"ఒరే వెర్రి పీనుగుళ్లారా! వాటితో మతాబాలు కూరడానికి కావలసిన గుల్లలు తయారు చేస్తార్రా! మరి దీపావళి దగ్గరకు వచ్చేస్తోంది కదా? ....ఒరే, అన్నట్టు చెప్పడం మరిచాను, ఆ సోవియట్ యూనియన్ పుస్తకాలు మటుకు చింపకండ్రోయ్. వాటితో సిసింద్రీలు చేసుకుంటాం" సందేహ నివృత్తి చేసాడు, కాకినాడలో ఉంటూ పియ్యూసీ చదువుతున్న పెద్ధన్నయ్య.

కాసేపటి తర్వాత మా పని తీరు చూడడానికి వచ్చిన నాన్న,

"ఒరే! కాముడూ! నువ్వూ, కిష్టయ్య ఆ కుమ్మరి గంగయ్య ఇంటికి వెళ్లి, ఓ నాలుగు రోజుల్లో ఓ వంద ప్రమిదలు, ఓ వంద చిచ్చుబుడ్డి గుళ్లలు చేసి ఉంచమనండి" అని పని పురమాయించడంతో "హమ్మయ్యా, పని తప్పింది' అనుకుంటూ గంగయ్య ఇంటి వైపు పరుగులు తీసా, మా తమ్ముడితో కలిసి.

ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత

"ఒరే! ఆ గన్నెయ్య తాతకి ఓ పని పురమాయించా. ఏం చేస్తున్నాడో చూసి రండి" అని నాన్న చెప్పడంతో మా కొత్తదొడ్డి వైపు పరుగులు తీసాము.

అక్కడ ఇటుకల పొయ్యి మీద ఓ కళాయి గిన్నె పెట్టి, అందులో ఉన్న పదార్ధాన్ని కందిపుల్లతో కలుపుతున్న మా ఇంటి పనులు చేసే గన్నెయ్య తాతని

"తాతా! ఏమిటది ప్రసాదమా?" నోరు ఊరుతుండగా అడిగాను.

"అబ్బే ఇది పెసాదం కాదు. ఇది లైపిండి. మైదా, మైలతుత్తం యేసి ఉడికిస్తే ఇలా వత్తాది. దీని తోటే ఆ మతాబా గుళ్లలు అంటించాలి" తాత చెప్పిన సమాధానంతో విషయం బోధ పడింది.

ఎలాగైతేనే ఆ సాయంత్రానికి, అందరమూ తలా ఓ చెయ్యి వేసి సుమారు ఓ ఐదు వందల మతాబా గొట్టాలు తయారు చేసేసాము.

ఆ రోజు నుండి మధ్యాహ్నం బడి నుంచి భోజనానికి వచ్చినప్పుడు ఆ గొట్టాలు ఎండలో పెట్టడం, సాయంత్రం బడి నుంచి రాగానే, ఎండకు ఎండి గలగల శబ్ధం చేస్తున్న వాటిని లోపల పెట్టడం మా దినచర్యలో భాగం అయిపోయింది.

** ** ** **

ఓ నాలుగు రోజుల తర్వాత నాన్న, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య కాకినాడ వెళ్లి తాటాకు బుట్టల్లో గంధకము, సూరేకారం, బీడు, బొగ్గు లాంటి మండేపదార్థాలు తేవడంతో ఆ రోజు నుంచి చెప్పకపోవడమే, మాకు పని బాగా ఎక్కువయ్యింది.

ఇదిగో పిల్లలూ "ఈ మిశ్రమాన్ని ఆ గుడ్డలో వేసి చేతితో అటూ ఇటూ తిప్పండి. మెత్తగా అయిపొయిన పిండి, కింద కాగితం మీద పడుతుంది. గుడ్డలో మిగిలింది మళ్లీ మాకు ఇవ్వండి. మళ్లి నూరుతాం" నాన్న చెప్పడంతో అందరూ ఆ పని మీద పడ్డాము.

ఓ రెండు రోజుల్లో మతాబాలు, చిచ్చుబుడ్లు మా ఇంట్లో పడక గదిలో పురుడు పోసుకున్నాయి. వాటిని కాల్చే అవకాశం ఎప్పుడు వస్తుందా అని మేము ఆ గది వైపు ధీనంగా చూసేవాళ్లం.

** ** ** **

"అమ్మా! చూడవే మేము కరణం గారి అమ్మాయిలు అన్నపూర్ణ, కృష్ణవేణి లతో ఆడుకుంటూంటే పెద్దన్నయ్య, చిన్నన్నయ్య మా దగ్గరకు వచ్చి ఉప్పు పొట్లాలు తిప్పుతున్నారు" ఆ సాయంత్రం అమ్మకి కంప్లైంట్ చేసారు పండక్కి కొంచెం ముందే వచ్చిన పెద్దక్క, చిన్నక్కలు.

"ఉప్పు పొట్లాలు ఏమిట్రా? నిన్ను తగలెయ్యా?" అప్పుడే అక్కడకి వచ్చిన చిన్నన్నయ్యని కేకలేసింది అమ్మ.

"ఉప్పు పొట్లాలు అంటే ఏమీలేదే. ఓ తాటి కమ్మకు చివర్లో తాటి పీచుకు ఓ దళసరి గుడ్డ కట్టి, అందులో ఉప్పు, బొగ్గు కలిపి అందులో ఓ కాలిన బొగ్గు వేసి గిరగిరా తిప్పుతాం. అందులోంచి చిన్న చిన్న నిప్పు రవ్వలు బయటకు వచ్చి...." చెబుతున్న చిన్న అన్నయ్యతో

"సరేలే అర్థం అయ్యింది కానీ ఆ ఉప్పు పొట్లాలు ఏవో మన దొడ్లో తిప్పుకుని తగలడండి. ఎవరి కంట్లో అయినా పడితే ప్రమాదం కూడా!" మెత్తగా చీవాట్లు పెట్టింది అమ్మ.

** ** ** **

ఓ నాలుగు రోజుల కల్లా ఇంట్లో తయారు చేసిన మతాబాలు, చిచ్చుబుడ్లు తో పాటు కాకరపువ్వొత్తులు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, పాంబిళ్లలు, టపాకాయలు లాంటి బోలెడు సామాన్లు కొని, తెచ్చి ఇంట్లో పడేసారు అన్నయ్యలు.

** ** ** **

ఇక ఆ మరునాడు నుంచి మా ఇంట్లో ఎగుమతి పథకం ప్రారంభం అయ్యింది.

"ఇదిగో ఇది గన్నెయ్య తాతకి" అంటూ ఓ బుట్టలో కొన్ని మతాబాలు, చిచ్చుబుడ్లు అలాగే "ఇవి పనిమనిషి అప్పలమ్మకు, ఈ బుట్ట కిరాణా కొట్టు తాతబ్బాయి కి........" అంటూ ఇంట్లో ఉన్న దీపావళి సామాన్లు రవాణా చేయడం ప్రారంభించింది అమ్మ.

గదిలో సామాన్లు ఒక్కొక్కటిగా రెక్కలు వచ్చి ఎగిరిపోతోంటే లోలోపల నా మనసు కుతకుతలాడిపోయేది.

అయితే ఆ మరునాడు,

"డాట్టరుగారూ! నేను వత్సవాయి తమ్మిరాజు గారి అబ్బాయిని. మా బాజీ గారు ఈ మతాబాలు స్వయంగా కూరారు. మీకు ఇమ్మన్నారు" అంటూ ఓ బుట్ట మా నాన్నగారి చేతిలో పెట్టి వెళ్లిపోయాడు.

సాయంత్రానికి కొటికలపూడి వెంకట్రావుగారు, కలిదిండి భాస్కరరాజు గారు, అల్లంరాజు సూరన్న గారు.. ఇలా సుమారు ఓ పదిమంది ఇళ్లనుంచి సరుకు రావడంతో, ఎగుమతులు కంటే దిగుమతులే ఎక్కువగా ఉండడంతో నా ఆనందంతో మనసు గంతులేసింది .

** ** ** **

దీపావళి రోజు సాయంత్రం

వీధి అరుగుల మీద ఆ మూల నుంచి ఈ మూలకి దీపాలు పెట్టారు అక్కలు.

ఈలోగా తను స్పెషల్ గా కూరుకున్న పెద్ద మతాబా అంటించబోతున్న చిన్న

అన్నయ్యని,

"ఒరే వాజి పీనుగా! అప్పుడే కాల్చకూడదురా. కాసేపు ఓపిక పట్టు. ముందుగా పిల్లల చేత గోగుకాడలు కొట్టించాలి" అంటూ అడ్డుపడింది అమ్మమ్మ.

మా తమ్ముళ్లు నలుగురునీ అరుగు మీద నిలబెట్టి, వాళ్ళ చేతికి కాలుతున్న వత్తులు వేసిన గోగు కాడలు ఇచ్చి,

"దిబ్బూ దిబ్బూ దీపావళి

మళ్లీ వచ్చే నాగుల చవితి"

అంటూ ఆ ప్రక్రియ పూర్తి చేసింది అమ్మ.

తర్వాత మా ఇద్దరు అక్కయ్యలు, బావలు, మా తొమ్మండుగురు అన్నదమ్ములు, నాన్న, అమ్మ, అమ్మమ్మ మరియు మా గన్నెయ్య తాత అందరమూ అరుగుల మీద కూర్చుని కాల్చివేత ప్రక్రియ ప్రారంభించాం.

"హేమర్రోయ్ పిల్లలూ అన్ని ఇప్పుడే కాల్చేయకండి. నాగుల చవితికి కొన్ని ఉంచుకోండి" ముందస్తు హెచ్చరిక జారీ చేసింది అమ్మమ్మ.

మొత్తం మీద అర్ధరాత్రి పదివరకూ సాగింది ఆ దహనకాండ.

కార్యక్రమం అయిన తర్వాత అందరికీ దిష్టి తీసి పడేసింది అమ్మమ్మ.

** ** ** **

మర్నాడు ఉదయం

ఇంటి ముందు తుడుస్తూ

"ఏటో ఈ మడుసులు. ఈ పండక్కి ఇపరీతంగా కరుసు పెట్టేత్తారు. సొమ్మును బూడిద సేసేత్తారు. సత్తన్నాను ఊడసలేక" రాత్రి కాల్చిన చెత్తను ఊడ్చలేక విసుక్కుంటోంది అరవై ఏళ్ల పనిమనిషి అప్పలమ్మ.

కళ్లాపి చల్లడానికి వచ్చిన అమ్మ, ఆ మాటలు విని, తనలో తాను ముసిముసిగా నవ్వుకుంది, ఆయనకు, పిల్లలకు ఈ దీపావళి సరదా, ఈ అప్పలమ్మకు ఈ సణుగుడు ప్రతీఏడూ ఉండేవే అన్నట్టు.

ఈ లోగా ఢాం...అని పెద్ద చప్పుడు.

అందరమూ ఉలిక్కిపడి అరుగు మీదకు పరుగు తీసాము, ఏం జరిగిందో అన్న అదుర్దాతో.

"కంగారు పడకండి. అది నేనే వేసాను. దానిని పాచి టపాకాయ అంటారు. దీపావళి పండుగ మర్నాడు అలా టపాకాయ పేలుస్తేనే పండగ ముగిసినట్లు" అని పంచె పైకి సర్దుకుంటూ నవ్వుతూ లోపలికి నడిచారు నాన్న, అరుగు కింద ఉన్న అప్పలమ్మ, అరుగు మీద ఉన్న మేము ఆశ్చర్యంగా చూస్తుండగా.

Tags:    
Advertisement

Similar News