మాయాబజార్ (కవిత)

Advertisement
Update:2023-11-19 18:48 IST

ఆదిలోనే హంస పాదం ప్రవేశించేటప్పుడే అవమానం

దొంగననో, తీవ్రవాదిననో

వళ్లంతా నిమరటం

దయ తల్చినట్టుగా లోనికి వదలటం

వరలలో ధరలతో రంగురంగుల వలలు

మనబోటి తోటి వారల కలకలంలో

దారికి అడ్డంగా ఉంటేనే మాట

లేదా మనతోనే మన మాట

వెతుకులాటలో తోపులాట

అవసరానికి మించి అనవసరాల మూట

చెప్పూ చేట ఒకటే చోట

వరసలో నిలబడి పిచ్చి చూపుల హేల

మనిషికి మనిషికి మధ్య

మార్కెట్ భాషల అంతరం

మది పలకరింపుల చెంత

బేరసారాల సంత

తూచ్ లతో కొంత తొలగింత

నవ్వులు పూచే వేళ

మార్కెటింగ్ వెక్కిరింత

ఇచ్చి పుచ్చుకునే వేళ

అప్పు కార్డుల గీత

తిరిగి వెళ్లే వేళ

తోపుడు బండీల మోత

తనిఖీల చూపులతో

మోస్తున్న మూటలతో

మాయాబజారు విహార బహిష్కరణ 

- పి. రామహనుమాన్, “రాహ"

(హైదరాబాద్)

Tags:    
Advertisement

Similar News