మెలకువ

Advertisement
Update:2023-01-07 14:24 IST

అనుమానంతోనో ,

అపార్ధంతోనో

అవమానంతోనో ,

ఆధిపత్యంతోనో

బంధాల్ని ,అనుబంధాల్ని కోల్పోతుంటాం !

చిరాకుగానో,పరాకుగానో

ఈర్ష్యతోనో ,ద్వేషంతోనో

స్నేహితుల్ని ,సహచరుల్ని కోల్పోతుంటాం !

తెలిసో, తెలియకో

మాయగానో ,

అమాయకంగానో

వస్తువుల్ని ,విలువల్ని కోల్పోతుంటాం !

పొరపాటుగానో ,

ఏమరుపాటుగానో

ఆవేశంలోనో ,

ఆవేదనగానో

భద్రతల్ని ,బాధ్యతల్ని కోల్పోతుంటాం !

పంతాల్తోనో ,పట్టింపుల్తోనో

పౌరుషంగానో ,పగతోనో

రాగాల్ని,అనురాగాల్ని కోల్పోతుంటాం !

మూర్ఖంగానో ,మొండిగానో

ఉదాసీనంగానో ,

ఉద్రేకంగానో

ఉపాధిని,ఉద్యోగాల్ని కోల్పోతుంటాం !

కోల్పోవడం తప్పేమీ కాదు

తిరిగిపొందలేకపోవడం పెద్ద ముప్పు !

పశ్చాత్తాపం ,

ఆత్మపరిశీలన

అవగాహన,

ఆత్మావలోకనం

క్షమాపణ ,ఆదరణ

కోల్పోయింది తిరిగిపొందడానికి

అనువైన మార్గాలు !

పోగొట్టుకున్నది మరలా అందుకోడానికి

అసలైన సూత్రాలు !!

⁃ పి. లక్ష్మణ్ రావ్

(విజయనగరం)

Tags:    
Advertisement

Similar News