విశ్వమనే విధాతకి
దివి భువి పెదవులు కాగా..
సాయంత్రపు ఫలహారంగా
భానుడిని మింగేస్తుంటే..
కమ్ముకున్న చీకట్లలో
దిక్కు తోచక నిలబడ్డా..
జాలిపడ్డ ఆ పెదవులు
జాబిలమ్మను బహుకరిస్తే..
విహంగాల రెక్కపట్టి,
మబ్బుల మెట్లు ఎక్కి,
ఇంద్రధనుస్సు తాడు పట్టి,
తోక చుక్క తురగమెక్కి,
వినువీధిన విహరిస్తూ..
చిరుతారల దాటుకుంటూ..
వెన్నెల వెలుగున పయనించి
చందమామ చెంత చేరా..!
మామ పెంచిన మర్రి చెట్టుకు
ఊయలేసి ఊపుతూ..
పేదరాశి పెద్దమ్మ
మంచి కథలు చెప్తుంటే..
ఊగుతూ, ఊకొడుతూ
మైమరచి నిద్రపోయా...
కల కరిగి కళ్ళు తెరిస్తే,
కాంక్రీటు గోడల గదిలో
నిరాశ నిండిన మదితో
తియ్యని ఊహల స్మృతితో..
మరో రోజు ప్రారంభం
మరో కథ ఆరంభం
గడియారం భయపెట్టగ,
గ్రహచారం నను తరమగ
దినచర్యను మొదలెడుతూ..
బ్రష్, పేస్టు లకై
వడివడి గా పరిగెట్టా..
కమ్మని నిన్నటి కలని
మది లోపల దాచేసా.
-పి.లక్ష్మీ ప్రసన్న ( కాకినాడ)