మా నాన్నారు ....!

Advertisement
Update:2023-07-11 17:45 IST

ఆయనున్న చోట నవ్వుల గలగలలూ, మాటల విరుపులూ, వ్యంగ్య, హాస్యపు చిరుజల్లులూనూ...

"నువ్వుండాలోయ్ ఉమామహేశ్వరమ్... కాసేపు నీతో ఉంటే మాటల్తో నువ్వాడే ఆటలూ, ఆ ’పన్’లూ ’పంచ్’ లూ అలా వింటూంటే మనసు నిండిపోతుందోయ్"

అంటూ ’భరాగో’ గారి లాంటి పెద్దలు నాన్నకిచ్చిన కితాబులు. నవ్వడం, నవ్వించడం ఆయన’కల’వాటు.

"పిశుపాటి హాస్యకథలూ, వ్యంగ్య వీచికలూ బాగా రాస్తాడోయ్ "అని ఒకరంటే.. "ఓస్ అంతేనా! పాటలూ, గంభీరమైన కవితలూ, కథానికలూ, వ్యాసాలూ, సంపాదకీయాలూ రాస్తాడోయ్ బాగా"అని ఇంకోరూ... "సడేలే! పేరడీలూ, ఈల పాటలూ కూడా పాడతాడు స్టేజీల మీద "అంటూ ఇంకొందరూ... "బొమ్మలూ గీస్తాడుట, బాబ్జీ పేరుతో కార్టూన్లూ వేశాట్ట "అని మరికొందరూ నాన్న గురించి గొప్పగా చెప్తూంటే - "మా నాన్నారే?? "అంటూ ముక్కు మీద వేలేస్కుని ఆశ్చర్యపోతూండేదాన్ని...

ఇవేకాక నాకు బుద్ధి తెలిసే నాటికి వందలకొద్దీ రేడియో నాటికలూ, దూరదర్శన్‍లో సీరియళ్ళూ, పరిషత్తు నాటకాలూ, వాటికొచ్చిన అవార్డులూ, రివార్దులూ నా కళ్ళతోనే చూశా...

జీవితాన్ని కాచి వడబోసిన ఋషి వాక్యాలు ఆయన కలం నుండి ’ఉమ ఋక్కులు’గా రూపుదిద్దుకున్నాయి. అలా సాహిత్య ప్రక్రియలెన్నిట్లోనో దూకేసి, ఈదేసి వదిలేసిన ఆ సరస్వతీ స్వరూపాన్ని అవాక్కయ్యి చూస్తూండిపోయాను.

రాత్రికి రాత్రి గంట నాటికను ఇలా అడిగితే అలా రాసిచ్చేసి ఎమర్జన్సీ స్క్రిప్ట్ రైటర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన విజిటింగ్ కార్డు చూస్తే ఆయనలోని హాస్య స్ఫురణ మనకి గోచరిస్తుంది. తన పేరు ’ఉమామహేశ్వరమ్’ని చివరిలో మార్చేసి ఉమామహేశ్వర్రావు అని అచ్చుతప్పులు పడ్డా - దాన్నికూడా హాస్యస్ఫూరకంగా -"నా రచనలతో ’రమ్’ అని మత్తెక్కిద్దామంటే ’రావు’ వీడికి అని తేల్చేస్తున్నారు "అని చురకేస్తూండేవారు.

ఆయన మాటల్లో -

జనాలు రెండే రకాలు

పడితే -

లడ్డు టైపు

చెడితే -

కాలడ్డు టైపు

ఆయన రచనల్లో బోలెడు హాస్యం చిలికిస్తూండేవారు. ఒకపక్క ఇలా నవ్విస్తూనే ’ముఖం వెనుక నేను’ అంటూ తన గురించి తానే రాస్కున్న పరిచయం ఒక అద్భుతం... ఆయన్నీ, ఆయన సాహిత్యాన్నీ క్షుణ్ణంగా చదివినవాళ్ళకే ఈ కవితలోని లోతు తెలుస్తుంది

"నేను -

వెన్నెల పారేస్కున్న చంద్రుణ్ణి

నా ఎండకి -

నేనే గొడుగు పట్టుకోలేక

నా తేజానికి -

నేనే దగ్ధమౌతూన్న సూర్యుణ్ణి

నేను-

అలలు మింగేసిన సముద్రాన్ని

సృష్టికి -

ముందూ వెనుకల వాతావరణాన్ని"

ఇంతకన్నా ఆయనలోని భావగంభీరతను ఎలా వ్యక్తీకరిస్తాం అనుకుని ’మా నాన్నారే ఈయన ??? అంటూ, అనుకుంటూ ఆయన లోకాన్ని వీడి పదునాలుగేళ్లయినా ఇవ్వాళ్టికీ ఆశ్చర్యపోతూనే ఉంటాను. ఆయన సాహితీ సముద్రంలో ఓలలాడుతూనే ఉంటాను.

హాస్య, వ్యంగ్య, భావగాంభీర్యాల కలబోత

- మా నాన్న

ఆయన పూర్తి పేరు

- పిశుపాటి ఉమామహేశ్వ’రమ్’

అవుధరించారూ

- అద్గదీ మా నాన్నారు !!!

- పి .జ్యోతి (వర్జీనియా)

Tags:    
Advertisement

Similar News