నీడ

Advertisement
Update:2022-12-13 13:03 IST

"దయానిధీ!..." చల్లని పిలుపు

"ఎవరు మీరు?..." దయానిధి కుర్చీలో కూర్చొని డబ్బును లెక్కపెడుతున్నాడు.

అవసానదశలో !!....

కనులముందు నల్లని ఆకారం... నల్లని దుస్తులు... ముఖం... కళ్లు.... స్పష్టంగా తెలియటంలేదు దయానిధికి...

ఆ ఆకారం నుండి నవ్వు!....

దయానిధికి కోపం... "అడిగినదానికి జవాబు చెప్పకుండా... ఏమిటా వెకిలినవ్వు!..." అసహనంగా ఆవేశంగా అన్నాడు.....

"ఇపుడు నీ వయస్సు ఎంత?..."

"నా వయస్సుతో నీకేంపని?..."

"నా వయస్సు నీ వయస్సే కాబట్టి అడిగాను... నీకు వయస్సు గుర్తు వుందో లేదోనని...".

"యాభైఆరు..." అసహనపు జవాబు

"అంటే... మరో రెండు సంవత్సరాల్లో రిటైర్మెంటు!..." చిరునవ్వుతో చెప్పాడు ఆ వ్యక్తి.

"ఆ.. ఆ.. అవును... ఇంతకీ నీవు ఎవరవు?...".

"నేను ఎప్పుడూ నీతో వుండేవాడిని... కానీ... నీవు నన్ను ఏనాడూ గుర్తించలేదు..." ఎంతో విచారంగా చెప్పాడు.

ఆ వ్యక్తి...

"నేను గుర్తించవలసిన... చేయవలసిన పనులు నా చుట్టూవున్నవారికి ఎన్నో వున్నాయి..." విచారంగా చూచాడు.

దయానిది ఆ వ్యక్తివైపు.

ఆ మహామనీషి... క్షణం తర్వాత...

"అవును... ఆ సంగతి నాకూ తెలుసుగా..." నవ్వాడు

"జీవితంలో అర్ధభాగం... ఇంట్రవల్ ముగిసింది. ముందు వుండేది సెకండ్ హాప్... ప్రస్తుత కాలంలో మానవులువారికి వున్న అలవాట్లు... స్నేహాలు... బరువు బాధ్యతలు... తల్లిదండ్రులను నిరాదరణతో చూడటం... కారణంగా యాభై

సంవత్సరాలకే డెభ్బై వయస్కులుగా కనపడుతున్నారు....

.ఎవరిదో విషయం మనకెందుకు!... దయానిధీ!... నీవు ఒక్కసారి

ప్రశాంతంగా అద్దంలో నీ ముఖాన్ని చూచుకో... తలజుట్టు పూర్తిగా నెరసిపోయి...ముగ్గుబుట్టలా వుంది. కళ్లకిందనలుపుచారులు... నరాల బలహీనత... బీపీ... షుగర్... కళ్లల్లో కూడ చూపులో మాంద్యం.... అన్నీ అవలక్షణాలే... కారణం

ఇంతవరకు నీవు గడపిన జీవనం... సత్యం... ధర్మం... న్యాయం... నీతి నిజాయితీ ప్రేమాభిమానాలకు... పూర్తిగా విరుద్ధం....నీ నిలువెల్లా స్వార్థం... నీకు ప్రయోజనం లేని పలకరింపు నీవు ఎవ్వరితో చేసింది లేదు...బెంచి కింది వ్యాపారాన్ని జోరుగా సాగించావు... సాగిస్తున్నావు... అమ్మా నాన్నలను ఆవిడ మాటలు విని ఆశ్రమంపాలు చేసావు.

కొడుకు ప్రేమ పిచ్చిలో పడి ఉరివేసుకొని చచ్చాడు... కూతురు కులం కాని వానితో లేచిపోయింది.

భార్య నీమీద అలిగి ఆశ్రమంలో చేరింది... నీ పాపం పండింది... నీ టైమ్ అయిపోయింది... ఎంతో సంపాదించావ్...

ఇంకా ఈ రహిత జీవితం అవసరమా?... ఇంతవరకు నీతో ఉన్నా... నీవు గుర్తించని హితుడను. వెళ్లిపోతున్నా...వెళ్లిపోతున్నా!... నేను నీ నీడను!....

దయానిధినేలకు ఒరిగాడు. ఒడిలోని డబ్బు (నోట్లకాగితాల దొంతర) గది నాలుగువైపులకు ఫ్యాన్ గాలికి

ఎగిరిపోయింది.

పనిమనిషి పాండు గదిలోకి ప్రవేశించాడు.నాలుగుమూలలా వున్న నోట్లను ఏరుకొని జేబులో పెట్టుకొన్నాడు.తన యజమాని వైపు చూచి... తాకి ఆయన కధ ముగిసిందని తెలిసి ఏడుస్తూ (నటన) గదినుండి బయటకు నడిచాడు...

 చతుర్వేదుల చెంచు సుబ్బరాయ శర్మ ( చెన్నై)

Tags:    
Advertisement

Similar News