ఆడపిల్లలున్న ఇంట్లో
కష్టాలు కూడా
నవ్వటం నేర్చుకుంటాయి
ఆడపిల్లలులేని ఇల్లు చిందరవందరగా ఉండి
చికాకు పడుతుంటే
ఒక్క ఆడపిల్ల ఉంటే చాలు
ఇల్లు నందనవనమై వెలిగిపోతుంది...
అమ్మానాన్నలను
ఏ వృద్ధాశ్రమంలో చేర్చాలా
అని
మధనపడే కొడుకులున్న చోట
ఆడపిల్ల ఉంటే ఎంతనయం
ప్రేమను రంగరించి
కన్నవారి కన్నీటిని తుడుస్తుంది...
నిషేధాల చురకత్తులతో
సావాసం చేస్తూనే
జీవితాన్ని తూచటం
వారికి మాత్రమే తెలుసు
పున్నామ నరకం తప్పిస్తేనేం తప్పించకపోతేనేం
ఉన్న ఒక్క జీవితాన్ని పువ్వులా కాపాడేది మాత్రం వారేకదా...
సమాజం అడ్డంకులు సృష్టించినా దాష్టీకాలతో గొంతు నొక్కేస్తున్నా
గోడకు కొట్టిన బంతిలా
ఉత్సాహంతో వారు
చరితను పునఃపునః
లిఖిస్తుంటే
మహిళా శక్తికి చేయెత్తి జైకొడుతూ
నవ్వుకెరటంలాంటి కూతురు కావాలని ప్రార్థన చేస్తుంటాను
అపరాధభావనను తొలగించే
ఆసరా అవుతుందని...
- సియస్.రాంబాబు