చీకటి (కవిత)

Advertisement
Update:2023-12-02 21:33 IST

పగలే కమ్ముకొంది

లోకమంతా చీకటి

ఏది మంచో,ఏది చెడో తెలియని అజ్ఞానపు చీకటి

మేధస్సే మితిమీరి

యుద్ధమేఘాల్లో మురిసే

మూర్ఖత్వపు చీకటి

నేనే రైటు,

నాకే మాట్లాడే రైటు

అనే అహంకారపు చీకటి

ఎదుటివారెవ్వరూ

కానరాని చీకటి

ఆప్యాయతలను

అర్థం చేసుకోలేని చీకటి

అనురాగాన్ని

అనుభవించనీయని చీకటి

ఎవరి కష్టమూ

కనబడనంత చీకటి

మానవత్వం ఎక్కడుందో

దొరకనంత చీకటి

నిజాయితీ ఎక్కడికి తరమబడిందో తెలియనంత చీకటి

అడ్డేలేక పెరుగుతోన్న

అక్రమాల చీకటి

బలహీనుని బ్రతుకంతా

కప్పేసిన కారుచీకటి

సగటు మనిషి బ్రతకటమెలా

అను అయోమయపు చీకటి

ఒకరి ఉనికి ఒకరికి కానరాని

విద్వేషాల చీకటి

ఈ చీకట్లను చీల్చే

భానుని ఉదయం ఎన్నడో?

ఈ అజ్ఞానం అంతం చేయగల

జ్ఞాని ఎవ్వడో?

సమాజానికి వెలుగులందించే

శుభతరుణమెప్పుడో?

ఈ దీపావళి కాగూడదా

ఆ శుభ తరుణం

చీకట్లను పారద్రోలు నిత్య రణం

- నలమోతు విజయకుమార్

Tags:    
Advertisement

Similar News