అమ్మాయిలు గాలులతో తయారవుతారు
తడబడకుండా వీచడమే గాలుల ఆనందం
తమను నిష్కారణంగా అడ్డుకుంటే ఆ గాలులు ఒప్పుకోవు
అమ్మాయిలు పూలతో తయారవుతారు
పరిమళాలు వెదజల్లడమే ఆ పూల ఉత్సాహం
తమను నిర్దయగా నలిపిపారేస్తే ఆ పూలు ఒప్పుకోవు
అమ్మాయిలు పక్షులతో తయారవుతారు
లెక్కలేకుండా స్వేచ్చగా ఎగరడమే ఆ పక్షుల అద్భుతం
తమ రెక్కలు కత్తిరిస్తే ఆ పక్షులు ఒప్పుకోవు
అమ్మాయిలు పర్వతాలతో తయారవుతారు
ఎల్లపుడూ తలలెత్తి నిలబడడమే ఆ పర్వతాల ఆహ్లాదం
తల వంచి జీవించమంటే ఆ పర్వతాలు ఎప్పటికీ ఒప్పుకోవు
అమ్మాయిలు సూర్యగోళంతో తయారవుతారు
అన్ని వేళలా వెలుగులీనడమే ఆ సూర్యగోళాల ఉత్తేజం
మేఘాల ముసుగులు కప్పితే ఆ సూర్యగోళాలు ఒప్పుకోవు
రెండేళ్ల క్రితం సెప్టెంబర్ 25 శనివారం ఉదయం మరణించిన కవి, రచయిత, స్త్రీవాద ఉద్యమకారిణి, సామాజిక శాస్త్రవేత్త కమలా భాసిన్ (1946-2021) కు కన్నీటి నివాళులతో...)
మూలం :కమలా భాసిన్
తెలుగు: ఎన్ వేణుగోపాల్