జెండా గాలి
మాట్లాడుకుంటున్నాయి.
తనకు రెపరెపల సాయం
చెయ్యమంది జెండా,
పక్కవారి నుంచి
దేశాన్ని విముక్తం చేస్తానంది.
ఆ జెండాకు రక్త మంటిందనీ
తానే పవిత్రమైన దాన్ననీ
ముందుకొచ్చింది మరో జెండా,
జెండా రంగులు మారుతున్నప్పుడల్లా
గాలి గాయపడుతుంది.
జెండా పై కపిరాజు
ఎప్పుడో రాలిపోయాడు
ఇప్పుడు గాలి ఒంటరిది.
జెండాలు
దూరదూరాలకు ప్రయాణం చేస్తాయిగాని
వాటికి గమ్యం దొరకదు.
ఎత్తైన భవనాలపై ఎగిరే
వాటి ఔన్నత్యాన్ని
కిందినుంచి కొలవలేము
కర్రపొడుగే దాని ఎత్తు.
మళ్లీ జెండాగాలీ
సంభాషణ కొనసాగిస్తాయి.
గాలి మెల్లగా అంది
'ఇన్ని జెండాలు చూశానుగాని
ఇంతవరకు
మానవజెండా కనపడలేదు.'
జెండా మౌనం దాల్చింది
గాలి కూడా కాస్సేపు
వీయడం మానుకుంది
ఇప్పుడు
జెండాను చూసి
మనిషి భయపడుతున్నాడు.
-ఎన్.గోపి
Advertisement