సమావేశం పూర్తయ్యి తన గదికి వచ్చి చూసుకునే సరికి సమయం రెండయ్యింది.
విరించి కి ఒక పక్క ఆకలికి కడుపు కాలిపోతోంది, మీటింగ్ లో చెప్పిన “డెడ్ లైన్” కి బుర్ర తిరిగిపోతోంది. “మీకు విజయానికి కొలమానాలు
చావుగీతలట్రా?” ఎప్పుడు రమ్మన్నా
ఏదో ఒక ప్రాజెక్టు పని అని చెప్తుంటే తండ్రి అన్న మాటలు గుర్తొచ్చాయి. ఎంత వద్దనుకున్నా తండ్రితో తన ఉద్యోగం ఎంచుకునే విషయం లో పడ్డ ఘర్షణ వద్దన్నా ఏదో రకంగా గుర్తొస్తూనే ఉంటుంది. “దీనికోసమేనా అంతలా పోరాడావూ?” అని వెక్కిరిస్తూనే ఉంటుంది.
రోజంతా మీటింగులు అని చంపుతారు, పనులు మాత్రం ఇవ్వగానే అయిపోవాలి అని తిట్టుకుంటూ ఒక పక్క నాలుగు మెతుకులు నోట్లో వేసుకుంటూనే, అలవాటుగా ఫోను కేసి చూసాడు. అయిదు మిస్డ్ కాల్స్. అన్నీ అమ్మ దగ్గరనుంచే. ఇన్ని సార్లు చేసింది... ఏ సంబంధం వచ్చిందో మళ్ళీ, అనుకుంటూ ఒక పక్క భోజనం చేస్తూనే అసౌకర్యంగా చెవి దగ్గర ఫోను పెట్టుకుంటూ తల్లికి కాల్ చేసాడు.
విజయ, ఫోను ఎత్తుతూనే ఏ పలకరింపులూ, ఉపోద్ఘాతాలు లేకుండా అడిగింది, “ఏరా? ఎప్పుడొస్తునావు రైలు రిజర్వేషను చేయించుకున్నావా?” అని. ఆ మాటకి గుర్తొచ్చింది విరించికి, వచ్చే వారమే తండ్రి పదవీ విరమణ మహోత్సవం అని. “ఈ సారైనా అయ్యగారికి కుదురుతుందా?” వెనకనుంచి తండ్రి గొంతు. ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుండీ తండ్రికీ తనకు మధ్య సంభాషణలు అన్నీ అమ్మ మధ్యవర్తిత్వం లోనే.. పై అధికారి చేతిలో ఎన్ని తిట్లు తిన్నా సరే, ఎలాగో అలా బతిమాలు కోవాలని నిర్ణయించుకుని, “దొరికేస్తుంది అరుణ్ కి చెప్పాను చేయించమని” అని పెట్టేసాడు.
చెయ్యాల్సిన పని అంతా ముందే
పూర్తిచేసి ఇచ్చినా, బాసు తన సొంత డబ్బులతో ప్రయాణం ఖర్చులు భరిస్తున్నట్టు మొహం పెట్టుకుని వదిలిపెట్టాడు. చివరి నిమిషంలో ప్రయాణం. అతి కష్టం మీద తత్కాల్‌లో దొరికిన సెకండ్ క్లాస్ రిజర్వేషన్. భోగీ మొత్తం గోల గోలగా వుంది. ఒక్కో బెర్తూ ఇద్దరికి అమ్మేరేమో అన్నట్టున్నారు జనాలు. తల పగిలిపోతుందేమో అనిపించింది.
“మీకులాగా జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణాలతో జీవితం మొత్తం సర్దుకుపోతూ బతకలేను...”. అవకాశం దొరికినప్పుడల్లా గతం గుర్తు చేసే అంతరాత్మ తన మాటలు తనకే రీలు వేసి చూపించింది. “అవును సెకండ్ క్లాస్‌కి ప్రమోషన్ తెచ్చుకున్నా…” నవ్వుకున్నాడు.
********
భార్య, కొడుకుతో కలిసి బడిలో అడుగు పెట్టారు నారాయణమూర్తి గారు. తమ మాస్టారిని చూడగానే పిల్లలంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో బడి ఆట స్థలం మొత్తం ముంచెత్తేసారు. ప్రస్తుత విద్యార్ధులే కాకుండా పూర్వ విద్యార్థులు కూడా చాలా మందే వచ్చారు. అందరి కళ్ళల్లో ఒక రకమైన ఉద్వేగం. కొంతమంది పిల్లలకైతే రేపట్నుండీ మాస్టారు రారన్న ఊహతో కన్నీళ్లు ఆగడం లేదు. ఏదో హీరోని చూసినట్టు ఆయన నడిచి వెళ్తుంటే దార్లోనే కాళ్ళకడ్డు పడిపోతున్నారు. చేతులు పట్టేసుకుంటున్నారు. వేదికకి కొంత దూరం ఉందనగా ఎర్ర తివాచీ పరిచి, కొంత మంది పిల్లలు దానికి అటూ ఇటూ నిల్చుని మాస్టారి మీద అభిమానంగా పూలు జల్లారు.
నారాయణ మూర్తి గారితో ప్రస్తుతం పని చేస్తున్న వాళ్ళు ఎన్నో ఏళ్ల క్రితం పని చేసిన మాస్టార్లు, ఒకప్పుడు ఆయన దగ్గర చదువుకుని, రకరకాల వృత్తుల్లో స్థిర పడ్డ పూర్వ విద్యార్థులు చాలా మంది ఆయన గురించి మాట్లాడారు. ఎవరూ కూడా తయారు చేసుకున్న ప్రసంగాలు చదివినట్టు కనిపించలేదు. ఆయన మీద మనసులో ఉన్న అభిమానం, గౌరవం కలిపి మాట్లాడినట్టే అనిపించాయి అందరి మాటలూ.
“వీడెప్పుడు పోతాడా అని ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో రా బాబూ…” ఆఫీస్ లో సీనియర్ మేనేజర్ విరమణకి మొక్కుబడిగా పెట్టిన చిన్న సభలో సమోసా కొరుకుతూ తనతో పాటూ పనిచేసే రమేష్ అన్న మాటలు అప్రయత్నం గా గుర్తొచ్చాయి.
సన్మానం తర్వాత, తన ఉన్నతాధికారితో మాట్లాడుతున్న నారాయణ మూర్తి గారు, విరించిని పిలిచి ఆయనకు పరిచయం చేశారు. “మా అబ్బాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్” అని చెబుతున్నప్పుడు ఆయన స్వరం లో తొణికిసలాడిన గర్వం విరించి దృష్టిని దాటిపోలేదు. “ఆహా మంచి తెలివైన అబ్బాయి. చక్కగా స్థిరపడ్డాడన్నమ్మాట.. మీకింక ఏ చీకూ చింతా లేదు. మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చేస్తున్నాడు మాస్టారూ. కాస్త మీ అబ్బాయి చేత ఏదైనా సలహాలు ఇప్పించండీ” అంటుంటే నారాయణ గారు మరింత ఆనందంగా
“దానికేమండీ మా వాడి ఫోను నంబర్ ఇస్తాను. ఏదైనా సాయం కావాలన్నా, సందేహాలు ఉన్నా మా వాడితో మాట్లాడమనండి. మా వాడు ఏదైనా చాలా చక్కగా వివరంగా చెబుతాడు”. ధైర్యంగా మాట ఇస్తున్న తండ్రి నమ్మకం మొయ్యలేనేమో అన్న అనుమానం రాగానే అక్కడ నుంచి నెమ్మదిగా తల్లి ఉన్న వైపు నడిచాడు.
“విరించి అంటే బ్రహ్మ అని కదా మాస్టారూ? మంచి పేరు పెట్టారండీ అబ్బాయికీ”... వెనక నుంచి ఇంకా వాళ్ళ మాటలు వినపడుతున్నాయి.
“నా తలరాత నేను రాసుకో గలిగితే చాలు. వేరొకరి తల రాతలు రాయక్కర్లేదు”.... పెద్ద చప్పుడు తో తలుపు వేసి బయటకు నడిచిన జ్ఞాపకం విసురుగా వచ్చి ముఖానికి తగిలింది.
*******
మాస్టారు పిల్లలకే కాదు, మాకు కూడా గురువే అని చెప్పాలి. ఎప్పుడు ఎలాంటి సందేహం ఉన్నా మాస్టారిని అడిగితే చాలు చక్కగా చెప్పేవారు. ఆయనకి ఒక వేళ తెలియని విషయం అయితే తెలుసుకుని మరీ చెప్పేవారు…”
“ఏవయ్యా విరించీ !ఆ కొత్త కుర్రాడికి అంతలా అన్నీ చెబుతున్నావు? మనం ఎదగాలంటే పక్కవాళ్ళని తొక్కెయ్యాలయ్యా… ముందు రాజకీయం రావాలి. తరవాతే పని…ఎంత కట్టేసి కూచోపెట్టాలన్నా వినకుండా, తనకు తోచిన జ్ఞాపకాలకి ముడులు పెట్టుకుంటూ గతంలోనూ, వర్తమానం లోనూ కలియ తిరిగేస్తోంది కలవరంగా, అల్ల కల్లోలంగా అల్లరి మనసు.
'నమస్తే మాస్థారూ’'
బయట గదిలోనుంచి పొద్దున్న రాలేకపోయిన మురళీతో తండ్రి మాటలు వినపడడంతో విరించి ఈ లోకం లోకి వచ్చాడు.
'ఆ! మురళీ! బాగున్నావా? ఏం చేస్తున్నావ్? ఎక్కడుంటున్నావ్?' ఒక ప్రత్యేక అభిమానం తండ్రి గొంతు లో వినపడుతోంది.
'బాగున్నాను. ఇస్రోలో శాస్త్రవేత్తగా చేసున్నాను.'
'ఓ చాలా బాగుంది. నీ పరిశోధన కి, శాస్త్ర అభిలాష కి అనుకూలంగా ఉందా?'
'ఉంది మాస్టారూ. దీనికన్నా ఎక్కువ డబ్బులు వచ్చే ఉద్యోగాలు చాలా వచ్చినా ఇందులోనే నా మనసుకి హాయిగా ఉంది. ఇది మీరు చూపించిన దారే. “
మురళి మాటలు విరించి మనసుని ముల్లులా గుచ్చుతున్నాయి.
“ఏవిటి రా, లైటు కూడా వేసుకోకుండా పడుకుని ఆలోచిస్తున్నావూ? అప్పుడే గదిలోకి మడత పెట్టిన బట్టలు పట్టుకొచ్చిన విజయ, విరించిని చూస్తూ లైట్ వేసి అడిగింది. ఏమీ లేదమ్మా, ఇలా కూర్చో “అని తల్లి ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు. ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడే అలా పడుకుంటాడని తెలిసిన విజయ కొంత సేపు ఏమీ మాట్లాడించకుండా విరించి తల నిమురుతూ ఉండిపోయింది.
“అమ్మా! నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని నీకెప్పుడైనా అనిపించిందా?” తల్లి మొహం లోకి చూస్తూ అడిగాడు.
“ఏం నీకలా అనిపిస్తోందా?” తన ప్రశ్న తనవైపే తిరిగొచ్చింది.
“ఊ… ఎంత కాదు అని సర్ది చెప్పుకుంటున్నా అలాగే అనిపిస్తోంది”. నెమ్మదిగా లేచి కూర్చుంటూ చెప్పాడు.
“నాన్న నా ఉద్యోగం ఎంచుకునే విషయం లో నా గురించి చాలా చెప్పేవారు. చాలా వాదించేవారు. నువ్వెప్పుడూ ఏమీ చెప్పలేదు ఎందుకమ్మా?” మౌనం గా ఉన్న తల్లితో మళ్లా విరించే అన్నాడు.
“మీరు చూసే ప్రపంచంలో మా అభిప్రాయాలకి, అనుభవానికి ఎంత విలువ ఉందో తెలియకుండా సలహాలు చెప్పకూడదు చిన్నా!” ఒక వయసు వచ్చాక, సొంత పిల్లలకైనా అడిగినప్పుడే ఏదైనా చెప్పాలి. అయినా నీకు ఇప్పుడు నీ నిర్ణయం తప్పని ఎందుకనిపిస్తోంది రా?” చదువుతూ ఆపిన పుస్తకం ఎక్కడ ఆగిందో వెతుకుతూ అడిగింది విజయ.
“ఇదీ అని చెప్పలేను కానీ… రోజూ ఏదో నిరాశ గానే అనిపిస్తుందమ్మా. ఇవాళేదో గొప్పగా చేశాను అనిపించడం దాన్నేవంటారూ?… ఒక తృప్తి…అది నా పనిలో లేదనిపిస్తోంది.”
“పనిలో లేదా?... నువ్వు చేసే విధానంలో లేదా?” పుస్తకంలో నుంచి తల తిప్పి అడిగింది విజయ.
“విరించీ… ఒక్కటి గుర్తు పెట్టుకో… మనం చేసే ఏ పనీ ఎవరితోనో సరితూగడానికి చేసినంత కాలం నువ్వన్న తృప్తి నీకు దొరకకపోవచ్చు. ఎప్పుడూ మన మనసులో ఒక భాగం నువ్వు చేసేది తప్పో ఒప్పో చెబుతూనే ఉంటుంది. మొదటి అడుగుతోనే ప్రయాణం పూర్తవ్వదు. ప్రతి అడుగులోనూ చాలా దారులు కనపడతాయి. నీ మనసుకి ఏది చేస్తే తృప్తి అనిపిస్తుందో ఆ దారినే ఎంచుకుంటూ వెళ్లినప్పుడే గమ్యం చేరినప్పుడు...నీకే నువ్వు నెగ్గావని తెలిసిపోతుంది.”
“ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు అలోచించుకోగలవని తెలుసు… పద అన్నం తిందువుగానీ… మళ్ళా పొద్దుటే ప్రయాణం” అంటూ లేచింది విజయ.
తండ్రితో మాట్లాడిన మురళీ నెగ్గాడు. నాకు గెలుపు అంటే ఏవిటో ఇప్పుడే తెలుస్తోందా ?...
*********
రైలుకి బయలుదేరుతూ కాళ్ళకి నమస్కారం పెట్టిన విరించి వైపు ఆశ్చర్యంగా చూశారు నారాయణ మూర్తి గారు.
తెల్లవారుతూ సూర్యుడు తొలి కిరణాలతో నులివెచ్చగా బయటకు వస్తున్నాడు. రైలు ఎక్కడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వాళ్ళ తో కలిసి రైలు మొత్తం కోలాహలంగా ఉంది.
విరించికి ఆ “గోల” అంతా “సందడిగానే” కనిపిస్తోంది ఇవాళ.
- మైలవరపు స్ఫురిత