దాంపత్య జీవనంలోని సున్నితమైన కథాంశాల్ని ఉదాత్తమైన హాస్యంతో అందించిన మునిమాణిక్యంవారు
(15 మార్చి నేడు మునిమాణిక్యం జయంతి )
“ఆయన “కాంతామనోహరుడు' 'కథక చక్రవర్తి' 'హాస్యపరమేశ్వర్' - ఇవెలావున్నా అసలు సిసలు ప్రఖ్యాతి "కాంతం మొగుడు” నుడిలోనే పర్యాప్తమైంది.
ఆయనే - వ్యక్తిత్వ ఉన్నతీకరణకు, బతుకు నడకలో స్తిమితత్వ సాధనకూ చిన్న కథ ద్వారా పెద్ద సందేశాన్నిచ్చిన మహనీయుడు, స్మరణీయుడు - మునిమాణిక్యం నరసింహారావు గారు.
‘ఈ కథలు చిన్నప్పుడు మా శివశంకరశాస్త్రి గారు నాలో పెంపొందించిన ఉపజ్ఞకు ఫలితాలు. వారు చూపిన దారిలోనే అవి రాణించి ఆంధ్రుల అభిమానాన్ని పొందినవి' అని వినయంగా చెప్పుకున్నారు వారు. తల్లావఝుల శివశంకరశాస్త్రి గారంటే, ఆనాటి తెలుగు సాహిత్య కేదారంలో తనవరివస్యతో ఎంతో ఫలసాయాన్ని సాధింపజేసిన ‘సాహితీ సమితి' సభాపతి, పండితకవి.
మునిమాణిక్యం వారి పేరు తలచుకోగానే - ఒక తెలుగింటి మధ్యతరగతి విరిబోణీ, ఆమె భర్త, వారి దాంపత్య జీవన సౌరభాలు గుర్తుకొస్తాయి. ఆమె కాంతం; ఆయన స్కూలు మాష్టారు, కాంతం మొగుడు - అంతే!! ఆయన కథలపేర్లలో చెప్పాలంటే ఆ దంపతులు 'ఆదర్శ జీవులు' భర్తకు ‘మొహమాటం’ ఎక్కువే. భార్య 'ఊదాచీర' కట్టినా, అంతో ఇంతో 'మొండివాదన’కు దిగినా ఇద్దరూ 'వెన్నెలలో' కావలసినంత హాయినీ, ఆహ్లాదాన్నీ పంచుకోగలరు!
నరసింహారావు గారు ఆయన కథా నాయకుడులాగానే 'నల్లటిమనిషి’! ‘కాంతంకైఫీయతు’ ‘ప్రణయకలహం' 'కోర్టులో కాంతం' ‘కాంతమ్మగారి ఆవు’ వంటి కథలన్నీ మునిమాణిక్యం వారి హాస్యచతురతకు, కథానికలో సంభాషణ రచనా నైపుణ్యానికీ పెట్టిన ఒరవడులు!
సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని ప్రత్యక్షంగా, కథాత్మకంగా ప్రోత్సహించిన నిబద్ధత మునిమాణిక్యం వారిది. సంసార రథ గమనానికి భార్యాభర్తలు రెండు చక్రాలు అనే సందేశమే అంతర్లయగా సాగినవి వారి కథలు. ఆ గమనం 'ధర్మచక్రప్రవర్తన'గా ఉండాలనేదే వారి కథాత్మ!
ఒక స్కూల్ మాస్టారి జీవితాన్ని, మధ్యతరగతి కష్టాల్నీ, ఇష్టాల్నీ వ్యక్తపరుస్తూ, దుఃఖాన్ని తరిమేసి కరుణరసాన్ని గుప్పిస్తూ, హాస్యాన్ని గుమ్మరించి మధ్యతరగతి మందహాసాలని వెలికితీశారు, తన కథల ద్వారా మునిమాణిక్యంగారు వారి కథలలో. అణకువ, మక్కువ; గడుసుతనం, చలాకీతనం, ఓర్పూ, నేర్పూ, అన్నీ మేళవించిన ఒక ముగ్ధమనోహరమైన ఇల్లాలిగా, పిల్లల ఆలనా పాలనా కోసం అనుక్షణం ఆరాటపడే బాధ్యతగల తల్లిగా, కాంతాన్ని చిరంజీవిని చేశారు మునిమాణిక్యం గారు' అని ఎంతో సమంజసమైన అభిప్రాయాన్ని ఇచ్చారు శారదా అశోకవర్థన్ గారు.
మునిమాణిక్యం వారిని నేను బందరులో 1962లో దర్శించుకున్నాను. ఆరోగ్యంగా, కులాసాగా, హాయిగా నవ్వుతూ నవ్విస్తూ ఉన్నారు. చుక్కాని పక్షపత్రిక సంపాదకులు కంచి వాసుదేవరావు గారితో వెళ్లాను. నరసింహారావు గారు పండితులు. మితభాషిలా కనిపించేవారు; కానీ మాట కలిపితే ఎంతో లోకజ్ఞత జాలువారే సంభాషణ సాగేది. ఔత్సాహిక రచయితలు - జీవనమాధుర్యాన్ని ప్రోదిచేసే కథలు వ్రాయాలనేది వారి వాంఛితంగా చెప్పేవారు.
మునిమాణిక్యం వారి పెద్దకొడుకు సుప్రసిద్ధ కథకులు- మురయా (రఘురామయాజ్ఞవల్క్య). నరసింహారావుగారు 'మనహాస్యం' అనే పరిశీలనాత్మక గ్రంథాన్ని రాశారు. హాస్యంలోని వివిధ శాస్త్ర విషయికమైన వివరాల్ని అందులో పొందుపరచారు.
మునిమాణిక్యంగారి మనుమలు శ్రీనివాస యాజ్ఞవల్క్య, రాంచందర్ ఎంతో శ్రమకోర్చి తాతగారి రచనల్ని వెలికితీసి ఇప్పటికి రెండు కథా సంపుటాలుగా తెచ్చారు. వారికి తెలుగు సాహితీలోకం కైమోడ్పులు అందుతున్నాయి. తెనాలిలో కీ.శే.దుర్గాప్రసాద్ గారు ఘనంగా నిర్వహించిన మునిమాణిక్యంవారి సంస్మరణ సాహిత్య సభలో ప్రధాన ప్రసంగం చేసే అవకాశం కూడా నాకు కలిగింది. సుప్రసిద్ధ రచయిత్రి, సాహితీమిత్రురాలు కీ.శే.శ్రీమతి కె.బి.లక్ష్మి గారు మునిమాణిక్యంగారి మోనోగ్రాఫ్ ని రాసి ఒకదానిని సి.పి.బ్రౌన్ అకాడమీ, రెండవదానిని కేంద్ర సాహిత్య అకాడమీ వారికి అందించారు.
నరసింహారావుగారు మార్చి 15వ తేదీ, 1898న గుంటూరు జిల్లా సంగంజాగర్లమూడిలో జన్మించి 3.4.1973న హైదరాబాద్లో దివంగతులైనారు.
నాటి‘కాంతం కథలు’లోని సంభావ్యత, ఆహ్లాదం ఈనాటికీ పఠనీయతని కోల్పోక పోవటమే కథకులుగా మునిమాణిక్యం గారి చిరంజీవత్వానికి తార్కాణం!!
-విహారి