లక్ష్మణ రేఖ (కవిత)

Advertisement
Update:2023-11-16 17:12 IST

కాలవృక్షం నిర్ధాక్షిణ్యంగా

రోజుల ఆకుల్ని రాల్చేస్తూ ఉంది.

ఒంటరి మోడులా మిగిలిన అతనిపై

అప్పుడప్పుడు జ్ఞాపకాల పక్షి

వచ్చి వాలుతూ ఉంటుంది.

ఆత్రంగా అతను మధురస్మృతుల

ముత్యాలు ఏరుకుంటూ ఉంటాడు

అతని గుండె గోడలకు వ్రేలాడే

గతం తాలూకు తైల వర్ణ చిత్రాన్ని

తడిమి తడిమి చూసుకుంటూ ఉంటాడు

అతడి కళ్ళు

కన్నీటి కాసారాలు అవుతూ ఉంటాయి

పొరపాటున సరిహద్దు గీతను

దాటిన నేరానికి

గూఢచారి ముసుగేసి

స్వేచ్ఛను ఉరి తీసేసి

చీకటి గహలోకి అతిధిగా పంపించేసారు

ముప్పైఏళ్ళ తర్వాత

సన్నటి వెలుగురేఖలు

ఆ గుహలోకి ప్రసరించాయి

ఆవిరైన క్షణాలు

అతని మఖం మీద

ముడతలుగా మారాయి

యవ్వన వస్త్రాలను అక్కడే వదిలేసి

వృద్ధాప్యాన్ని తొడుక్కొని

స్వేచ్ఛా విహంగమై

కళ్ళనిండా కలలను

గుండెలనిండా ఆశలను నింపుకొని

సొంత గూటిని చేరుకున్న అతనికి

కాళీ గూడు స్వాగతం పలికింది

ఆగూటిలో ఉండాల్సిన తన జంట పక్షి

తన కలల పంట పండించుకోవడానికి ఎటో ఎగిరిపోయింది

సరిహద్దు గీత దాటిన

అతని నుదుటి గీత మారి పోయిoది

శాశ్వతంగా అతనికి

ఒంటరితనపు చీకటి నేస్తమయినది

- మోపూరు పెంచల నరసింహం

Tags:    
Advertisement

Similar News