ఎదలోంచి శబ్దం పెల్లుబుకుతూ
ప్రవహిస్తోంది
నిశ్శబ్దం వేధింపుకు గురి అయిన
శబ్దం అది
అదోలాంటి దైన్యం
మూగవాని రోదనలా ఉంది
వేటగాని వలలో చిక్కిన
లేడి చూపులా జాలిగా.. దీనంగా..
గుండె నిండా సవ్వడి చేయని
ప్రశ్నల వలయాలు
ఏదీ నిలవటం లేదు
గోడమీంచి దూకు వర్షపు చుక్కల్లా
రూపం కోల్పోతూ
ఉనికిని మిగుల్చుకుంటూ .......
ఏమైందీ వేళ
మదిలోని భావమేదీ
కాగితంపై ఆగనంటూ..
ఈ స్థితిని దాటి మరో స్థితిని చేరాలని మనసు ఆరాటం
కానీ గమ్యం స్థితిని మార్చదు
గమనం గతిని జతచేయదు
ఇదేనా జీవన్మరణo
-మొదలి పద్మ
Advertisement