నింగి నేలను ఎన్నటికీ సమీపించదు
ఒక భ్రమలోనే నిలబెడుతుంది
బహుశా బతుకును బతికించే
ఆశల వలేమో అది
ఏళ్లుగా గుండెను మోసే కన్నీళ్లు
ఒక్కోసారి ఎంతకూ తెగిపడవు
అతుకుతూ బతకడం నేర్చుకుంటాయి
వీడ్కోలెన్నడూ ఆనందాన్ని పంచదు
కలయికలోని ఆర్తిని గుర్తుగా మిగుల్చుకుంటుంది
ఆగాధంలోకి జారిపోయిన
వెన్నెల అడుగులు
ఎందుకో ఎంతకూ
మరపుకు రావు
మనసు పొరలనిండా
మౌనాన్ని నెేస్తూ..
జీవితంలో కొన్ని అంతే..
కనిపించక కసురుకోక మనవైనవి
కన్నుగప్పి నడుస్తుంటాయి
మనతోనే మన వెంటే..
మనమే గమనించం
గమనించీ గమనించని భ్రమల్లో చివరిదాకా ఒక వెలితిని మాత్రం
మోసుకుంటూ నామమాత్రంగా
బతికేస్తాం
కోల్పోయినదెంతో ఎప్పటికీ
గుప్పిట విప్పని పురావేదనే..
- మొదలి పద్మ
Advertisement