ఆకాశం తాకింది
ఆతని మూర్ధం.
అంత ఎత్తున కెదిగింది
ఆతని శీర్షం.
ఆతడు పుట్టింది
ఆసూరి వంశం.
ప్రవచించింది సర్వ కిరణ ప్రభల వేదాంగ సారం.
నేలకు పరచుకున్న
సమతా భావనా సందేశం.
అది వసంత పంచమి దినం.
ఫలించింది వేయి తల పోతల
తిరుమల జియ్యరు అభిమతం.
ముందుగా తయారయింది
సాఫ్ట్ వేర్ ఫైల్ ప్రతిరూపం.
గోళ్ళు ,వేళ్ళు, శిఖ వస్త్రం, యజ్ఞోపవీతం,
వెలసింది మార్పన్నది కనరాని
మార్పు కోరిన ఏకతా మూర్తి త్వం.
పంచ లోహాల ఇహలోక ఆవాహనం
ముచ్చింతల చీమంత చింతల నెడబాపిన క్షేత్రం.
మేలు కోరిన మేలుకోట యతి న్యాసం.
సన్యాసం కాదు సంసార జన హితం.
అసమానం జ్ఞాన కుండ యజ్ఞం.
అనేక యాత్రల పుణ్య మిచ్చు
ఐక్యతా రాగం
తొలగని విశ్వాసాలకు
కరగి పోయింది ఋణం.
యునెస్కో గుర్తించిన రామప్ప ఆలయ కట్టడం
భూదాన్ పోచంపల్లి చేనేతల
కగ్ర స్థానం,
తెలుగు తేజానికి
చిత్రగతుల విన్యాసం
పూర్వ జాన పదాలను
విడువని గ్రామం
ప్రపంచ పర్యాటక భాగ్య నగరం
-రాజేశ్వరి దివాకర్ల
(వర్జినియా యు.ఎస్)