వేసంగిపాట (కవిత)

Advertisement
Update:2023-05-08 23:08 IST

సూర్యుణ్ణి మంటబెట్టి ఆర్పడం మరిచిపోయినట్టున్నారు

కాలం చిటపటలాడిపోతున్నది

తూరుపు బారెడెదిగిందో లేదో

కిరణాలు కొరకంచుల్లా

మారిపోయాయి

పేడతీసే పిల్లాడు

తట్టబోర్లించుకుని

యెండతో యుద్ధంజేసి గెలుస్తున్నాడు

సుఖదేహాలు ఏసీగదుల్లో తాళంపెట్టుకుంటే

శ్రమరక్తం ముతక్కోక చెంగుతో మార్తాండుణ్ణి అదిలిస్తున్నది

బలహీనుల దగ్గర

సూర్యుడిది ప్రతాపం

పనిపాటలోళ్ల ముందు

అగ్గెండ తోకముడవాల్సిందే

చెట్టునీడెపుడూ వేసవి ధిక్కారమే

చెరువుల్ని మింగేసిన సూర్యుడు

సముద్రంలో మునిగిపోయి

అస్తమిస్తాడు

దూపకోసం పశువులు

చెరువుని కలవరిస్తుంటే

మబ్బులు కరుగుతాయి తప్ప,

భానుడికి కరుణలేదు

సూర్యుడి బాధ పడలేక

బావి పాతాళంలో దాక్కుంది

తాబేలు ఊపిరి కోసం ఇంకిపోకుండా ఊటలు దీస్తుందది

మట్టికుండలో నీళ్లు

బుగ్గలో నింపుకుని

సూర్యుడి వేడిగర్వంపై

పుక్కిలిస్తుంటాం

తాటాకుల పందిరికింద కూర్చుని

విసనకర్రతో

వడగాలిని తరిమికొడతాం

కాలువల్ని గుటుక్కున మింగేస్తాడు

వేసవి పంటమళ్లకు

నీటిపస్తు బెడుతుంది

బడిపిల్లలకే కాదు నాగలికీ వేసవిసెలవులుంటాయి

ఏరువాక రాగానే హలం

సూర్యుడి మీద సాలుదున్నుతుంది

వేసవిలో సూర్యుడు దగ్గరా

చలివేంద్రం వుంటుంది

కాకపోతే మోకేసుకుని పాకగలిగినోళ్లకే ముంజనీళ్ల చల్లదనం

సూర్యుడికే చెమటుక్కబోస్తుంటే

తాటాకువీవెనలతో ఆర్పుకుంటాడేమో

ఓడేవాడున్నప్పుడే ఓడించేవాడుంటాడు

ఏడ్పుగుణముంటే దుఃఖంలో తోసేవాడుంటాడు

యుద్ధంతో ఢీకొట్టే వాళ్లకు

సలాం జేసేవాళ్లే వుంటారు

రోళ్లను పగలుగొట్టే సూర్యుడైనా ఓడిపోతాడు

లోపల్న నదుల్ని తపస్సుజేసే

వాడి ముందు!

వేసవి నా ముందెపుడూ హడలిపోతుందీ

ఆ ఋతువులో కుంభవృష్టి పద్యాలు రాస్తుంటాను!

-మెట్టానాగేశ్వరరావు

Tags:    
Advertisement

Similar News