ఓ విషాదస్నేహం

Advertisement
Update:2023-06-12 22:23 IST

ఓ విషాదస్నేహం

నీవు నేను ఒకటే

ఎవరి లోకంలో వాళ్లున్నాం

నీవు లేకపోతే నేనుంటాను

నేను లేకున్నా నీవుంటావు

నీవు కనబడకపోతే మరొకర్ని పిలుస్తాను

నేను రాకున్నా నీవు వేరే ప్రత్యామ్నాయం వెతుకుతావు

నీవు నేనూ ఒకటే

కలిసున్నామనే చెప్పుకుంటాం

విడిగానూ బతగ్గలం...

నీవు కలలోకి వస్తావు

నేను నీ స్వప్నంలో తిరుగుతాను

అవసరాలు ఇలమీదనే కాదు

కలలోనూ వెంబడిస్తాయి

వాటికీ ప్రేమరంగు పులుమేస్తాం గానీ

ప్రేమ కూడా ఒకరకంగా దాహమే

నీకూ నాకూ...

నీవూ నేనూ ఒకటే

ఒకరికోసం మరొకరు ఎదురుతెన్నెలవుతాం

అదంతా నిర్మల మోహమేమీ కాదు

ముసుగేసుకున్న స్వార్థం

నీవునేనూ ఒకటే

శ్మశానం దగ్గర కలుసుకున్నాం

బూడిదకుప్పగానూ సమానమయ్యాం!

జరిగిన యాత్రలో నీవూ నేనూ

హృదయాల సామీప్యంగా బతకలేకపోయాం

అదే విషాదం గదా!?

-మెట్టా నాగేశ్వరరావు

Tags:    
Advertisement

Similar News