మన్మథ ఉపాలంభనం

Advertisement
Update:2022-12-14 12:28 IST

మదనా!

పేద మనసుల నిధనా!

కలల్ని కొల్లగొట్టడంలో కాలాంతకుడివి

కన్నీళ్ళ వ్యాపారంలో కల్తీలేని దళారివి

వేటగాళ్ళకు విడిది నీ వాసంతరాజ్యం

నీవెంతటి కౄరమైన అహింసామూర్తివో

అద్వైత వేషంలో ఆత్మలోకం దివాలావో

చెట్లు చూస్తున్నాయి చిరకాలంగా

నదులు నీ కథల్ని జనపథాలకు

చేరవేస్తున్నాయి

దుర్మరణం జాతి వారసత్వం కాకుండా

భూనభోoతరాలు జాగ్రత్త పడుతున్నాయి

మన్మథా!

తుఫాను ముందుండే

నిశ్శబ్దంలో నిలుచున్నావు?

తిరుగుబాటు పూర్వరంగం

ఆలాపన వింటున్నావు

ఎన్ని వసంతాలు వచ్చినా

ఆనందసందోహాలు హెచ్చినా

కలకాలం కంట తడిలాంటి మోళ్ళనీ

శిక్షాగ్రస్త సంతతిలాంటి బీళ్ళనీ

జన్మభూమిలోనే శపించాయి

నీ సుగంధ బాంధవ్యాల సరిహద్దులు

కాళ్ళుతెగిన మొండిమృగంలా మొత్తుకునే

మొద్దు గన్నేరు మూగపాట విన్నావా?

పుళ్ళ బతుకుల జిలజిలమనే జిల్లేళ్ళ

కన్నీళ్ళు తుడిచావా? ఎప్పుడైనా!!

నాగజెముళ్ళా క్రిక్కిరిసిన బతుకు దారిద్ర్యం

చూశావా?

ఎందుకు చూస్తావు? కనువిందులకే

కాలక్షేపం చేస్తావు!

రంగరంగ వైభవంగా మాదకద్రవ్యాల

సౌధాగ్రాన

చిగురుటాకుల మీద పూలపాన్పువేసే

సుఖిస్తావు

నీ ధర్మాద్వైతం, ఏకపక్ష నీతిని జాతీయగీతం

చేసింది

కాని కందర్పా!

అబద్దం ఎల్లకాలం రాజ్యం చేయదు

కత్తిలాంటి నిజం, చీకటి అఖాతాల మీద

విప్లవాల వెలుగు వంతెన వేస్తుంది

మదనా!

వసంతం నీ ఇష్టారాజ్యం కాదు

కొందరి జన్మ సిద్ధ నైవేద్యం కారాదు

అందరి బతుకు వికాసంగా మారాలి

ఈ వ్యాధిగ్రస్త వసంతం అగ్నిప్రవేశం కావాలి

.... ఇదిగో నా పాట!

అనాది పీడితుల ఆర్తిపాట

ఇంతవరకు పాడబడనివాళ్ళ పోరుపాట

ఈ తరాన్ని వెలిగించి ముందుకు నడిపించే

కాంతిపాట

నీ వసంతాన్ని కాల్చివేసే కార్చిచ్చు రాచబాట!

మాధవానందస్వామీ!

మకరకేతనా! మధుపజ్యాలంకార వినోదా!!

పంచశరాసనా! ప్రపంచ వంచకా!!

మదించిన నీ రాచక్రీడలు నేటితో పరిసమాప్తం!

దుఃఖితుల బావుటాగా లేచి వీచిన నా పాట

చెట్టుచెట్టునా చుట్టూముట్టే విముక్తి గీతమై

మోసులెత్తుతుంది

ఈసారి నా పాట

నిత్యవసంతం నెత్తిమీద

ప్రచండ గ్రీష్మం ఎత్తిపోత

ఈసారి నా పాట

నీ యుగాది గుండెల మీద

నిప్పుల జెండా ఎగురవేత!!

అగుపించని అణచివేతలో

పోరు సలిపే హక్కుల విజేత!

ఆత్మగౌరవం అస్తిత్వాకాంక్షలో

పీడిత పక్షుల స్వేచ్ఛా

పతాక !..."

(జ్వాలాముఖి మానిషాద దీర్ఘకవితనుండి కొంతభాగం )

- జ్వాలా ముఖి

Tags:    
Advertisement

Similar News