మంచి  గ్రహింపు

Advertisement
Update:2022-11-30 14:35 IST

మంచి  గ్రహింపు 

"అమ్మా! బళ్ళో ఈ వేళఏం జరిగిందో తెలుసా?" 

అంటూ ఉత్సాహంగా 

పరుగెత్తుతూ వచ్చిన 

ఏడేళ్ళనీలోత్పల్, తల్లి 

వసంత వాడిన 

ముఖాన్ని చూసి, 

వంటింటి ద్వారం వద్దే

ఆగిపోయాడు. గబ గబాకొంగుతో ముఖం పైనలేనిచెమటను తుడుచుకుంటూ " రా రా కన్నా! ఏం 

జరిగింది?" అంటూ 

నవ్వుతూ పలకరించింది.  

పొంగిన ఉత్సాహంలో 

నీరు చల్లినట్లైంది

ఉత్పల్ కి.  అంతదాకా మేఘాలమీద తేలుతున్నతనను ఒక్కసారి ఎవరో కిందకు తోసినట్లై "ఏంటమ్మ? మళ్ళీ నాన్న నువ్వు గొడవపడ్డారా? నీవసలు ఆయన్నిపట్టించుకోవద్దమ్మా. కాస్సేపయ్యాక తనన్న మాటలని అనలేదంటారు. అసలు ఆయన మన లోకంలో ఉంటే కదా!" అన్నాడు.

"అదేం లేదు రా. నా బాధ ఎప్పుడూ ఉండేదే కదా. బళ్ళో జరిగిన విశేషం ఏమిటో చెప్పు." అంటూ ఇంట్లోనే తయారుచేసిన పోషకాల హెల్త్ మిక్స్ ని పాలల్లో కలిపి ఇచ్చింది.

నాకు ఇష్టమైన ఒక గొప్ప వ్యక్తి గురించి రాయమన్న వ్యాసంలో తాత గారి గురించి రాసాను కదా – నేను చదివింది విన్నాక మా క్లాసు టిచర్ నన్ను బల్లపైన నిలబడమంది" అంటూ కాస్త ఆగాడు ఉత్పల్ తల్లి ముఖంలోని భావాన్ని చూడ్డానికి.

" అరే ఎందుకు కన్నా?" అని ఆదుర్దాగా అడిగింది తల్లి.

ఫక్కున నవ్వుతూ, "భయపడకమ్మా. అందరూ తమకు ఇష్టమైన ఆటగాళ్ళు, సినిమా నటులు, రాజకీయనాయకుల గురించి వ్రాసారు. నేను మాత్రంస్వాతంత్ర్యసమరయోధులైన తాతగారి గురించి రాసాను. నేను చదవడంమొదలుపెట్టినపుడు, ఇద్దరు ముగ్గురు నా వైపు హేళనగా చూసారు. కానీ నేను ఆపకుండా, స్థిరంగా చదివాను. చదివి ముగించాక, మా గది నిశ్శబ్దంతో నిండింది.

మా టీచరు నన్ను బల్లమీద నిలబడమంది. నేను నిలబడ్డాను. తరువాత అందర్నీ నిలబడమని చెప్పి, "ఒక స్వాతంత్ర్యసమరయోధుని మనవడు మనలో ఉన్నాడంటే, అది మన అందరికీ గర్వకారణమని" అంటూ అందరినీ స్టాండింగ్ ఒవేషన్ ఇమ్మంది. నాకు ఏం జరుగుతోందో అర్థం కాక ఆశ్చర్యంతో అలాగే అవాక్కై నిలుచుండిపోయా.

అలా ఎంతసేపున్నానో తెలియదు కానీ, హాలు దద్దరిల్లేటట్లు పెద్దగా చప్పట్లు నన్ను మళ్ళీ స్పృహలోకి తెచ్చింది. అసలు గాలిలో తేలిపోతున్నట్లు నన్ను నా స్నేహితులందరూ ఎత్తుకుని ఉన్నారు. చుట్టూ మా బడిలోని టీచర్లు, ప్రిన్సిపల్, హెచ్.ఎమ్., మిగిలిన విద్యార్థులు అందరూ సంతోషంతో నవ్వుతూ, చప్పట్లు కొడుతున్నారు. నాకు కాస్త గర్వంగా, కాస్త సిగ్గుగా, బిడియంగా ఇంకా ఏదేదో లాగ అనిపించిదమ్మా.

ప్రిన్సిపల్ స్వయంగా నా దగ్గరికి వచ్చి, ప్రేమతో నన్ను దగ్గరికి తీసుకొని, తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. తరువాత నేను రాసిన వ్యాసాన్ని చదివి, తాతగారి ఫోటోని కళ్ళకి అద్దుకున్నారు భక్తిపూర్వకంగా. "తాతగారి పేరు నీవు నిలబెట్టాలి నీలోత్పల్" అంటూ వెళ్ళిపోయారు తన గదికి.

 ఆ తరువాత రెండు పీరియడ్లలో అందరూ తాతగారి గురించే ప్రస్తావించారు. తాతగారు ఇప్పుడు బ్రతికి ఉండియుంటే, మా బడికి ఆయనని తీసుకొని వేళ్ళేవాణ్ణమ్మా – ఆ సెరిబ్రల్ మలేరియా రాకుండా ఉండి ఉంటే ….అనిపించి, ఏడుపు వచ్చిందమ్మా" అని అమ్మని వాటేసుకొని బావురుమన్నాడు ఉత్పల్. వసంతకి కూడా కళ్ళు చెమర్చాయి, తండ్రి జ్ఞాపకం వచ్చి.


బాల్యంలోకి వెళ్ళిపోయింది వసంత మనసు. తనంటే తండ్రికి ఎంతో అభిమానం. తనకిష్టమైన రాగం పేరు తనకి పెట్టారు. తను పుట్టగానే స్థిరమైన ఉద్యోగం దొరికిందని తనని తన అదృష్టదేవతగా అనుకొనేవారు.

మూడో ఫారందాకా ఇంట్లో అందరికీ ఖద్దరు దుస్తులే. బరువుగా అనిపించినా అవే తొడుక్కునేవారు. ఇంటో అన్నీ స్వదేశీ వస్తువులే. స్వాతంత్ర్యోద్యమంలో అమ్మ కూడా నాన్నతో పాల్గొనేదని తండ్రి చెప్పగా, తను ఆశ్చర్యపోయేది. తండ్రి సాక్షాత్తు గాంధీగారిలాగా, తల్లి కస్తూరిబా లాగా అనిపించి, చాలా గర్వపడేది. వారు అప్పుడు వాడిన రాట్నం ఇంట్లో అటకపైన భద్రంగా ఉంచి, అప్పుడప్పుడు దుమ్ము దులుపుతూ, దాన్ని ఎంతో అపురూపంగా చూసుకొనేది.

ఉన్న రెండు గదుల ఇంట్లో ఎంతో పొందికగా ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చాక, తండ్రి మిలిటరీ నుండి వచ్చేసి, యేదో ప్రైవేటు కంపెనీలో గుమాస్తా గా చేరారు. ఉద్యోగంలో వచ్చే జీతంతో ఎంతో ఒద్దికగా, పొదుపుగా తలిదండ్రులు కాపురం చేసారు. తనని, అన్నయ్యని ఎంతో ప్రేమతో, క్రమశిక్షణతో పెంచారు. అలా కాలేజీ దాకా కాలం బాగానే సాగింది. బి.ఏ. కో-ఎడ్యుకేషన్ కాలేజిలో చదివింది.

అక్కడే పరిచయమైనాడు పురుషోత్తం. అమ్మాయిలందరి కలల్లోకి వచ్చేటట్లు ఉంగరాల జుట్టు, ఊరించేకళ్ళు, లేటెస్ట్ స్టైల్ దుస్తులతో భలేగా ఉండేవాడు. అమాయకంగా, అందరితోను కలివిడిగా నవ్వుతూ, తుళ్ళుతూ తిరిగే తనని చూసి ఇష్టపడ్డాదు. పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అదేవిధంగా తన తలిదండ్రులతో ఇంటికి వచ్చి, పెద్దలతో మాట్లాడాడు. తన సమ్మతిని కూడా తెలుసుకొన్న తరువాత, తలిదండ్రులు  డిగ్రీ ముగించాక, తమకు వివాహం జరిపించారు.


ప్రేమించిన భర్త,అత్తమామలతో కాలం ఉల్లాసంతో, ఉత్సాహంతో జీవన నౌక నవ్వులనదిలో పువ్వుల పడవలాగా  బాగానే సాగింది.

పెళ్ళైన రెండేళ్ళ తరువాత అత్తమామలు ఢిల్లీలో ఉన్న తమ పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి, ఉండసాగారు.

కాలం ఎప్పటికీ అలాగే ఉండదు కదా.  ఉన్న కంపెనీలోనే మార్కెటింగ్ మ్యానేజర్ గా ప్రమోషన్ వచ్చింది భర్తకి. ఎక్కువసేపు ఆఫీసు బయటే పని. జీతం కాస్త ఎక్కువైంది. పనిమీద తిరగడానికి ఆఫీసువాళ్ళు మోటర్బైక్ ఇచ్చారు. తమ సంతోషానికి దృష్టి తగిలినట్లు, ఎప్పుడూ క్లైంట్స్ ని కలవడానికి, వారితో బిజినెస్ చర్చలు చేయడానికి పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్ళడం, అప్పుడప్పుడు అక్కడే భోజనం చేయడం, ఇంటికి రాత్రుళ్ళు ఆలస్యంగా రావడం జరిగేది. అవన్నీ మామూలేకదా అని సరిపెట్టుకొనేది వసంత.

కానీ కొంతకాలం తరువాత కాస్త నోటినుండి ఒకలాంటి వాసన రావడం, మాట కాస్త ముద్దగా రావడం, నడకలో కాస్త తూలడం చూసి నిలదీసింది వసంత. ప్రస్తుతపు పరిస్థితులలో మీటింగుల లో కాస్త త్రాగడం మర్యాద అనీ, అలా కాకుండా మడికట్టుకుంటే బిజినెస్ దెబ్బ తింటుందనీ చెప్పి, సర్ది చెప్పాడు. తన పరిధి తనకు తెలుసనీ కూడా అన్నాడు. నమ్మింది వసంత.

కానీ, ఒకరోజు అదే ఆఫీసులో అక్కౌంట్స్  విభాగంలోని భాస్కరంతో భర్త రావడంచూసి, భయపడింది వసంత. కారణం – భాస్కరం ఒక తిరుగుబోతు, తాగుబోతు కూడా.  తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్నట్లు ఆ భాస్కరంతో సహవాసం వల్ల అప్పుడప్పుడూ తాగే పురుషోత్తమానికి ఎప్పుడూ అదే ధ్యాసైపోయింది. ఆ తాగుడు మహమ్మారికి బానిసైపోయాడు.

మొదట్లో నెలాఖర్లో అంటే జీతాలిచ్చే రోజున రాత్రి బైక్ లో అర్థరాత్రి దాటాక వచ్చేవాడు. తరువాత క్రమంగా వారానికి రెండుసార్లు, మూడు సార్లు అలా తప్పతాగి ఆలస్యంగా వచ్చేవాడు. ఒక్కొక్కసారి బండి నడపలేనంత తాగినప్పుడు ఆ భాస్కరం తీసుకొని వచ్చి, దిగబెట్టేవాడు. ఇదంతా చాలా అవమానంగా తోచేది వసంతకి.


అలా ఒకసారి దిగబెట్టడానికి వచ్చినపుడు, ఆ భాస్కరం తన దగ్గర కాస్త అతిచనువు చూపినపుడు సిగ్గుతో చితికిపోయింది. తనను కాపాడవలసిన భర్త మత్తులో ఉండటాన్ని గ్రహించి, చటుక్కున భాస్కరాన్ని బయటకు వెళ్ళమని చూపుడువేలితో ఆదేశించి, అతడు బయటికి వెళ్ళిన వెంటనే తలుపు బిగించింది.  మన్నుతిన్న పాము లాగ పడివున్న భర్త పాదరక్షలు తీసి, లేని శక్తిని తెచ్చుకుంటూ, అతనిని లోపలికి తీసుకునివెళ్ళి, పడక మీద పడుకోబెట్టింది. తర్వాత భోరుమని ఏడ్చింది దుఃఖం ఆపుకోలేక. ఇక ఆ రాత్రంతా జాగరణే.

ఉదయాన్నే మత్తు వదిలినాక, భర్తతో భాస్కరం గురించి చెబితే, అసలు నమ్మలేదు సరికదా, స్నేహితుడినే తప్పుపడతావా అంటూ నాలుగు వాయించాడు. అప్పటినుండీ తాగి వచ్చినపుడల్లా వసంతని తన్నేవాడు. ఇక వసంత తనకి దేవుడే దిక్కనుకుని ఊరుకుంది.  ఇంటి పరిస్థితులని తన తలిదండ్రులకి తెలిస్తే బాధపడతారని, తన విషయం వారికి తెలియకుండా జాగ్రత్త పడింది.

 ఒక్కొక్కసారి తెలియనివాళ్ళు కూడా తాగినమైకంలో ఉన్న భర్తని ఇంటికి పిలుచుకొని వచ్చేవారు. ఆ మైకంలో ఎన్నో సార్లు జీతాన్ని పోగొట్టుకున్నాడు. ఇందువల్ల ఆర్థికపరిస్థితులు తారుమారయ్యాయి. పొద్దున పున్నమి చంద్రుడిలాగా ఆఫీసుకి అందంగా తయారై వెళ్ళినవాడు రాత్రి వచ్చేటప్పుడు చెదరిన జుట్టుతో, రోడ్డు మీద పడిపోవడంవల్ల అంటుకున్న మురికితో, నలిగిన బట్టలతో, తరిగిన వన్నెతో ఉన్న భర్తను చూసి బాధ పడని రోజు లేదు.

ఎంతగానో మంచి మాటలు అనునయంగా చెప్పినా భర్తలో మార్పురాలేదు. ఒకసారి డీ-అడిక్షన్ కేంద్రానికి కూడా తీసికెళ్ళింది. అక్కడ కౌన్సిలింగ్ లో అడిగిన ప్రశ్నలకి బాగా జవాబు చెప్పడంతో, డాక్టర్లు అతనిది కేవలం సోషల్ డ్రింకింగ్ అనీ, అది హానికరం కాదని వసంతకే నచ్చజెప్పారు.  

ఆర్థిక పరిస్థితి దిగజారడంతో జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్న వసంతకి తను గర్భవతినని తెలిసింది. ఇక తను ఆ శిశువు కోసం బ్రతకాలనుకుంది. తండ్రికి బుద్ధిచెప్పిన ప్రహ్లాదుడివంటి బాబు పుట్టాలని ఆ దేవదేవుణ్ణి వేడుకుంది. 

 కోరినట్టే చక్కటి, పండంటి పిల్లవాడిని ప్రసవించింది వసంత. పిల్లవాడికి నీలోత్పల్ అని నామకరణం చేశారు.

పురుషోత్తమానికి ఆఫీసులో ప్రమోషన్ వచ్చి, వేరే శాఖకి బదిలీ ఐంది. అక్కడ ఆఫీసులోనే ఉండి చేసే పని కనుక, బయటికి వెళ్ళే పని లేదు. కనుక ఆఫీసు వదిలిన వెంటనే ఇంటికి వచ్చి, పిల్లవాడితో గడిపేవాడు. వాడిని ముద్దు చేయడంలోనే మునిగిన పురుషోత్తం, తన దురలవాటుకి కాస్త దూరమయ్యాడు. అది చూసి ఎంతో సంబరపడిపోయింది.

పిల్లవాడికి ఆరేళ్ళపుడు మళ్ళీ పాత ఆఫీసుకే బదిలీ కావడంతో మళ్ళీ షరా మామూలైంది. పిల్లవాడిమీద భర్త ప్రభావం పడుతుందేమోనని వసంత భయపడసాగింది. కానీ నీలోత్పల్ తండ్రి ప్రవర్తనని బాగా అర్థం చేసుకున్నాడు. వీలైనంత సమయం తల్లికి తోడుగా ఉండేవాడు.


కాలచక్రం గిర్రున తిరిగింది. నీలోత్పల్ కి 8 ఏళ్ళు వచ్చాయి.ఒకరోజు బాగా తాగి, బైక్ ని హైవేస్ లో అతివేగంగా నడిపినందువల్ల, ఎదురుగా వస్తున్న హెవీలోడ్ లారీని ఢీకొని, అక్కడికక్కడే పురుషోత్తం మరణించాడు. మగదిక్కులేని వసంత కొడుకుతో తలిదండ్రుల పంచన చేరింది.

చుట్టుప్రక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పి, బి.ఎడ్. చేసింది. ఒక బడిలో టీచరుగా ఉద్యోగం సంపాదించుకుంది. సహజంగానే పిల్లలంటే ఇష్టం కనుక, ఆ ఉద్యోగంలో బాగా కుదురుకుంది. బళ్ళో అందరికీ అభిమానపాత్రురాలైంది. కొడుకుని ఎంతో ప్రేమతో, తండ్రిలేని కొరత తెలియకుండా, చాలా రక్షణనిచ్చి, కంటికి రెప్పలా కాపాడుతూ, ఉన్నంతలో తృప్తి చెందేట్లు, డబ్బు విలువ, మానవతా విలువలను, తోటిపిల్లలతో స్నేహంగా ఎలాగ మెలగాలో, ఆడపిల్లలని ఎలా గౌరవించాలో తెలుపుతూ పెంచింది. యోగాభ్యాసం, హిందీ, కర్ణాటక సంగీతం, చిత్రలేఖనం క్లాసులకి పంపింది.

అందువల్ల ఉత్పల్ కి స్నేహితులు చాలామంది ఏర్పడ్డారు. పంచుకొనే అలవాటు కలిగింది. మంచి పిల్లవాడని అందరికీ వాడంటే అభిమానమే. దగ్గరలోని గ్రంథాలయంలో జీవిత సభ్యత్వం ఇప్పించి, వాడికి పుస్తకాలను చదివే అలవాటుని అలవరచింది. ఇప్పుడు వాడికి 10 ఏళ్ళు.

*****

"అమ్మా!" అన్న పిలుపుతో స్వప్నలోకం నుంచి ఉలిక్కిపడి, తిరిగిచూసింది వసంత.

"ఈ వేళ సోషల్ క్లాసులో పాఠం జరగనే లేదు. ఎందుకో తెలుసా?" అనడిగిన కొడుకుని చూసి " చెప్పు నాన్నా." అనడిగింది. మా టీచరు మేమందరమూ ఎవరెవరి దగ్గర ఏమేమి నేర్చుకున్నామో చెప్పమన్నారు. రమేశేమో తనకి గణితం మీద ఇష్టం తన తండ్రి వలన కలిగిందన్నాడు. నిర్మల్ తనకి తెలుగు సాహిత్యం మీద అభిమానం తన తల్లి ద్వారా వచ్చిందన్నాడు. నిఖిలేశ్ తన తాతగారి నుండి చిత్రలేఖనం అనీ, సవితేశ్ తన అమ్మమ్మ దగ్గరనుండి సంగీతం పై ఆసక్తి కలిగిందన్నాడు."

"మరి నీవు?" అన్న తల్లి ప్రశ్నకి " నేను మా తాతగారి నుండి దేశభక్తి, అమ్మమ్మ దగ్గరి నుంచి దైవభక్తి, అమ్మ నుండి మానవత్త్వం, నాన్న దగ్గర్నుండి….నాన్న దగ్గరనుండి … ఎలా దురలవాటుకి దూరంగా ఉండాలన్నది నేర్చుకున్నానని అన్నాను" అని దృఢంగా అన్న కొడుకు మాటలని విన్న వసంతకి చెడు నుంచి కూడా మంచి నేర్చుకోవచ్చన్న  సత్యాన్ని ఇంత పిన్నవయసులో ఎంత బాగా తెలుసుకున్నాడో కదా నీలోత్పల్ అనుకుని, కొడుకుని అక్కున చేర్చుకుంది.

కళ్ళు మూసుకుని, ఆ దేవదేవునికి మనసులోనే నమస్సుమాలు అర్పించింది, అంత మంచి పుత్రుణ్ణి తనకు ప్రసాదించినందుకు.

-డా. తిరుమల ఆముక్తమాల్యద

Tags:    
Advertisement

Similar News