భారతీయ సంస్కృతి
సంప్రదాయాల
రాగం, తాళం,భావం తో
అందెల సవ్వడి చేస్తూ
లయబద్ధం గా కొనసాగే
నాట్య ప్రదర్శన ..
ముఖ కవళకలతో
భావాన్ని ప్రకటిస్తూ
వినుతి కెక్కిన
అంగ హారముల
పురాతన నృత్య ప్రదర్శన.
మంజీర ధ్వని తో
మదిని మందిని ఆకట్టుకునే
నృత్య భంగిమలు..
తమిళ నాట జనియించే
శాస్త్రీయ భరత నాట్యం.
ఆంధ్ర రాష్ట్రం లో ఆవిర్భించిన
ముఖారవిందంలో
సాత్వికాభినయం
అద్భుత కలాపాల కూచిపూడి.
మైలిక త్రిభంగ భంగిమ చుట్టూ
అష్ట పదులను ఆధారం చేసుకుని
కనుల కదలికతో కట్టిపడేసే
ఒడిస్సీ నృత్యం.
ముఖానికి మేలిముసుగు వేసి
వస్త్ర ప్రదర్శన విభిన్నంగా ఉంటూ
రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని తెలిపే
మణిపురి.
సంస్కృతి, సంప్రదాయ బద్దంగా
భక్తి భావన తో కొనసాగే
అస్సాం రాష్ట్ర సత్త్రియ నృత్యం.
కథను నృత్య రూపకంగా
ఉన్నతంగా ఉండే ఉత్తర ప్రదేశ్ లో
లయబద్దమైన భంగిమల కథక్
ఇతిహాసాలను జ్ఞప్తికి తెస్తూ
దట్టమైన కనుబొమ్మలను
నేర్పుగా కదిలిస్తూ
ప్రత్యేక అలంకరణల
కేరళా కథాకళి.
శృంగార రస సంపూర్ణ యై
సమ్మోహితులను చేయు
జగన్మోహిని నృత్య రూపం
కేరళలో మోహినీయాట్టం.
ఒక్కసారి ఆలోచించండి...
పాశ్చాత్య నృత్యానికి
విలువల నిస్తూ
మన నృత్యాలను
మరుగున పెట్టకండి..
విదేశాలలో మెరుగులు పెడుతున్న
మన నాట్యకళ ను కాపాడండి.
-మంచాల శ్రీలక్ష్మీ (మైత్రి )
(రాజపూడి)