ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మ్రోగింది. వంట గదిలోనుండి గబ గబ వచ్చి ఫోన్ తీసి"హలో" అంది సుధ..
"చిన్నీ !"అంటూ అమ్మ గొంతు పదేళ్ల తర్వాత.కన్నీళ్లు వస్తున్నాయి కానీ మాట రావడంలేదు.
"ఎవరూ !"అన్నాడు భర్త జగదీష్.
గొంతు పెగుల్చుకుని "మా అమ్మ "అంది.
మాట్లాడు అన్నట్లు సైగ చేసాడు.
"అమ్మా..ఎలా ఉన్నావు "అంది. "బావున్నా.. టీ వీ లో వార్తలు చూడండి" అని ఫోన్ పెట్టేసింది.
" ఏంటటా "అన్నాడు జగదీష్.
"అమ్మ వార్తలు చూడమంటోంది"అంది.
అర్థం కానట్లు చూసి న్యూస్ పెట్టాడు. ఎవరెవరో అవార్డులు అందుకుంటున్నారు.
"నిమ్మల ప్రహేళిక డాటరాఫ్ జగదీష్" అంటూ పిలిచేసరికి సన్నగా రివట లా ఓ ఇరవై రెండేళ్ల అమ్మాయి వచ్చి దేశ ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకుని క్రిందకి వచ్చి అమ్మ కాళ్ళకి నమస్కరించింది.
ఒక్కసారిగా ఇద్దరూ అదిరిపడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. జగదీష్ ముఖం అద్దంలో చూసుకున్నట్లు ఉంది ఆ అమ్మాయి ముఖం.
తన ఇంటి పేరు,తనపేరు అర్థం కాలేదు.తల్లికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోంది.
మనసు గతం వైపు మళ్ళింది
సుధకువరసగా ముగ్గురు ఆడపిల్లలు. వంశోద్దారకుడి కోసం మళ్ళీ నెల తప్పింది. 'బెడ్ రెస్ట్ 'అంటే అమ్మగారింటి దగ్గర ఉండిపోయింది.
"ఈసారి మగ పిల్లాడితో రాకపోతే నిన్ను తీసుకు వెళ్ళం "అన్న అత్త,మావ,భర్త మాటలు గుర్తుకు వచ్చి చిగురుటాకులా వణికిపోయింది సుధ.
తరచి తరచి అడగ్గా తల్లికి కారణం చెప్పింది.
"నువ్వు ప్రశాంతంగా ఉండు "అని ధైర్యం చెప్పి,ఇతి హాసాలు చేతికి ఇచ్చి చదవమనేది తల్లి సుందరమ్మ.
తాను నిద్రపోయేటప్పుడు ప్రక్కన కూర్చుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేది.
నొప్పులు మొదలయ్యాయి. ఆందోళన లో సుధ మనసు మనసులో లేదు.
ఆడపిల్ల పుట్టి చనిపోయిందని నర్సు వచ్చి చెప్పింది.
ఊపిరి పీల్చుకున్నాడు జగదీష్.
కనీసం బాధ పడని అల్లుడిని చూసి "పాఠాలు చెప్పే వాడికి గుణ పాఠం చెబుతాను "అంది తల్లి."నీకు పుణ్యం ఉంటుంది ఏమనకు "అంటూ ప్రాధేయ పడింది సుధ.
మంచి రోజులు లేవంటూ'అత్తవారింటికి తీసుకు వెళ్ళారు.
అప్పుడప్పుడు వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్ళి పోయేవారు సుధ కుటుంబం.
పదేళ్ల క్రితం తండ్రి చనిపోయాడని తెలిసి వెళ్ళారు. మొట్ట మొదటగా అక్కడ చూసింది పన్నెండేళ్ళ ప్రహేళికను. తల్లిదండ్రులు ఈ పిల్లను పెంచుకుంటున్నట్లు ,వారి తదనంతర ఆస్తి ఆ పిల్ల పేరున వ్రాసినట్లు తెలిసి జగదీష్ పెద్ద గొడవ చేశాడు.
"ముగ్గురు ఆడపిల్లలతో ఉన్నాం !దాన్నేవరినో పెంచుకోవడం ఏమిటి ?"అంటూ పెద్ద గొడవ చేసి, ఆరోజు నుండి ఈరోజు వరకు అమ్మతోమాట్లాడనివ్వలేదు.
రానివ్వలేదు.
ప్రహేళిక అంటే ప్రశ్న అని అర్థం. భర్త పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఏవో ఆలోచనలు జవాబు అమ్మే చెప్పాలి.
అమ్మా వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చినట్లు తెలిసి వెళ్ళాం. హాలు లో నిలువెత్తు నాన్న ఫోటో. చుట్టూ ఈ అమ్మాయి గెలుచుకున్న అవార్డులు.
ఒక సాధారణమ్మాయి సంగీత, సాహిత్య నాట్య ప్రదర్శన లలోనూ,కరాటే, బాడ్మింటన్ వంటి క్రీడలలో రాణించడం,నేడు ఇస్రో సైంటిస్ట్ గా అవార్డు గెలవడం చూసి గర్వంగా అనిపించింది.
ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలన్న తాపత్రయం నిలువనీయడం లేదు. ప్రశ్నార్థకంగా చూస్తున్న కూతురు అల్లుడు వైపు చూసి "ఆకు చాటున నేను దాచిన పూజా పుష్పం ప్రహేళిక. చచ్చిపోయిందనుకున్న మీ కూతురు. ఆడపిల్ల మైనస్ కాదు.వంశోద్దారకుడు వంశాన్ని నిలబెడతారు అనేది తప్పు.తనతో పాటు మీకు కీర్తి సంపాదించడమే నిజమైన వంశాభివృద్ధి. ఆడైనా , మగైనా ఇద్దరూ నీ బిడ్డలే గా. వ్యత్యాసం ఎందుకు.మీరు చూసే విధానంలో పద్దతి మార్చుకోండి. "అంది సుందరమ్మ.
"అమ్మా.. ఎవరు వచ్చారు "అంటూ లోపలికి వచ్చిన ప్రహేళికను చూసి
"నువ్వు చిక్కుప్రశ్న వి కాదు .చిక్కుపడిన నాలాంటి చదువుకున్న ఛాందసభావాల వారికి సమాధానానివి "అంటూ గట్టిగా కూతురిని గుండెకు హత్తుకున్నాడు జగదీష్ .
-మంచాల శ్రీలక్ష్మీ (మైత్రి).
(రాజపూడి)